koppula easwar
-
ఉద్రిక్తత: బీజేపీ, టీఆర్ఎస్ బాహాబాహీ
సాక్షి, జగిత్యాల: జిల్లాలోని గొల్లపల్లిలో బుధవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం కాస్తా ముదిరి ఒకరినొకరు దూషించుకుంటూ ఇరు పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను గౌరవించింది టీఆర్ఎస్ ప్రభుత్వమని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ 35 % నుంచి ఏకంగా 43శాతం పెంచిన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. పోలీసు స్టేషన్లో ఎన్నో రిక్రూట్మెంట్ పూర్తి చేసామని, అలాగే సరైన వాహనాలు లేకపోతే నూతన వాహనాలను అందజేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని ప్రశంసించారు. చదవండి: రిసెప్షన్‌కు హెలికాప్టర్లో వచ్చాడు! ‘ఆశ వర్కర్ల నుంచి అన్ని రకాల వర్కర్లకు అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అందరిని ఆదుకుని ఎన్నో విధాలుగా ఆదుకున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే కానీ ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ ఏమి గమనించకపోవడం చాలా బాధకరం. దుబ్బాకలో గెలవడం జీహెచ్ఎంసీ ఎన్నికలలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో సగం పైగా గెలిచాం అని చెప్పుకొంటున్నారు. ఆరున్నర ఏళ్లలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసి మీడియా ముందుకి వచ్చి చెప్తున్నాము. ప్రజలు గమనిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. -
గద్దర్‌ను కలిసిన టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్‌ను టీఆర్ఎస్ నేతలు కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వెంకటాపురం డివిజన్‌కు ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న కొప్పుల ఈశ్వర్, మరికొంత మంది నేతలు గద్దర్‌ను కలిశారు. కేవలం మర్వాదపూర్వకంగానే కలిసినట్లు మంత్రి కొప్పుల తెలిపారు. టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా వెంకటాపురం డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని గద్దర్‌కు పరిచయం చేశారు. ఆయన నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ అనంతరం కేటీఆర్‌తో పలు సందర్భాల్లో విభేదించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆయన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై శ్రీధర్ బాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంలో జరిగే సమీక్షలకు కూడా పిలవడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు బుధవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘వ్యక్తిగతంగా ప్రభుత్వానికి నా పై కోపం ఉండొచ్చు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ...లియోనియా రిసార్ట్స్‌లో సింగరేణి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతంలో నా నియోజకవర్గం కూడా ఉంది. సమీక్ష నిర్వహించాలంటే సింగరేణి భవన్ పెద్దగా ఉంది. అది కాదంటే మంత్రిగారి ఛాంబర్ ఉంది. మరి రిసార్ట్స్‌లో సమీక్ష ఎందుకు పెట్టారు. మేము అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదా?. ఆ సమావేశానికి ఎందుకు పిలవలేదు?. ఆ సమావేశానికి మమ్మల్ని పిలిస్తే వారసత్వ ఉద్యోగాలపై అడిగే అవకాశం ఉండేది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. దాన్ని విరమించుకోవాలని మేము సమావేశంలో చెప్పేవాళ్లం. ప్రభుత్వం తాను చేసే పనులు గోప్యంగా ఉంచుతోంది. ఓ వైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంటే... మరోవైపు సింగరేణిపై రిసార్ట్స్‌లో రివ్యూ చేశారు. మంత్రులు, అధికారులు ఎందుకు భయపడుతున్నారు. శాసన సభ్యుల హక్కులను కాలరాస్తున్నారు. స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. అధికారులు కూడా ఒక పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారు. సీఎండీ, సింగరేణి అధికారులకు నోటీసులు ఇస్తా’ అని తెలిపారు. -
జిల్లా రంగు మారుతోంది!
సాక్షి , కరీంనగర్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది... టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన కరీంనగర్ గడ్డపై రసవత్తర రాజకీయ చిత్రం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా నలుగురు మంత్రులు ఇక్కడి నుంచే రాష్ట్ర కేబినెట్లో కొలువుదీరారు. పునర్విభజన తరువాత కరీంనగర్ నాలుగు జిల్లాలుగా విడిపోగా... నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహించడం విశేషమే. ఇందులో విభజన తరువాత మిగిలిన కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్‌కు తోడు కరీంనగర్ నుంచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్న గంగుల కమలాకర్‌కు అవకాశం కల్పించడం విశేషం. ఆయనకు గతంలో ఈటల రాజేందర్ నిర్వహించిన పౌర సరఫరాల శాఖతోపాటు ఇప్పటి వరకు జిల్లాకే చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను కూడా కేటాయించారు. ఇక అందరూ ఊహించినట్టే... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, గత ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన కల్వకుంట్ల తారక రామారావును మరోసారి కేబినెట్లోకి తీసుకొన్న కేసీఆర్ గతంలో ఆయన నిర్వహించిన శాఖలే కేటాయించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆరుగురుకు చోటు కల్పిస్తే, అందులో ఇద్దరు కరీంనగర్ నుంచే చోటు దక్కించుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్ రాజకీయ అంచనాలతోనే కేసీఆర్ కరీంనగర్ నుంచే నలుగురు మంత్రులను ఎంపిక చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాలకు కేంద్రంగా కరీంనగర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా ఇప్పటికే అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వంలో తొలివిడత కేటీఆర్‌కు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన సిరిసిల్లకే పరిమితమయ్యారు. మంత్రివర్గ విస్తరణలో మునిసిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా నియమితులైన నేపథ్యంలో తన నియోజకవర్గంతోపాటు కరీంనగర్ కేంద్రంగా ఆయన కార్యకలాపాలు సాగుతాయని భావిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కరీంనగర్ లోక్‌సభ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, మోదీ ప్రభావంతోపాటు సంజయ్ సానుభూతి కారణంగా టీఆర్ఎస్ కరీంనగర్‌ను కోల్పోయింది. కరీంనగర్, వేములవాడ, చొప్పదండి, మానకొండూరులలో బీజేపీకి భారీ మెజారిటీ లభించింది. సిరిసిల్లలో అనూహ్యంగా టీఆర్ఎస్కు కేవలం 5వేల ఆధిక్యత మాత్రమే లభించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కరీంనగర్ లోక్‌సభ స్థానంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నారు. ఎక్కువ సమయం కరీంనగర్‌కు కేటాయిస్తే, ఇక్కడి నుంచే రాష్ట్ర రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంటుంది. బీజేపీకి గంగులతో చెక్ కొత్త కరీంనగర్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్‌ను కేబినెట్లోకి తీసుకోవడం వెనుక బీజేపీకి చెక్‌పెట్టే వ్యూహం కనిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌లో టీఆర్ఎస్కు 40 వేల మెజారిటీ రాగా, పక్కన హుస్నాబాద్‌లో కూడా టీఆర్ఎస్ మంచి ఆధిక్యత సాధించింది. కానీ మిగతా నియోజకవర్గాల్లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు పొందింది. ఈ ఉత్సాహంతో కరీంనగర్ కార్పొరేషన్ మీద బీజేపీ దృష్టి సారించి రాజకీయంగా పావులు కదుపుతోంది. వేములవాడ, చొప్పదండి వంటి మునిసిపాలిటీలపైనా కన్నేసింది. ఈ నేపథ్యంలో ఈటల ఉన్నప్పటికీ, కరీంనగర్ జిల్లాకు మరో పదవిని ఇవ్వడానికి కేసీఆర్ వెనుకాడలేదు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బలమైన ‘మున్నూరుకాపు’ సామాజికవర్గం టీఆర్ఎస్ను కాదని బీజేపీ వైపు నిలిచిందని పార్టీ భావిస్తోంది. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన సంజయ్‌కు చెక్ పెట్టాలంటే గంగులను తెరపైకి తేవడం తప్పని సరైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రామగుండం మునిసిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి మునిసిపాలిటీలలో సత్తా చాటాలని మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తదితరులు కంకణాలు కట్టుకున్నారు. అవసరమైతే మంత్రి పదవి లేని పెద్దపల్లి జిల్లాకు ఈటలను ఇన్చార్జిగా నియమించి అక్కడ బీజేపీతోపాటు కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలనే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ తర్జన భర్జన ఉమ్మడి జిల్లాకు ఏకంగా నలుగురిని మంత్రులుగా చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల విజయ పరంపరను కొనసాగించాలని భావించిన బీజేపీకి కొత్తగా ఇద్దరు కీలక మంత్రులను నియమించడం షాక్ ఇచ్చినట్లయింది. ఈ మునిసిపల్ ఎన్నికల ద్వారా పూర్వ వైభవం స్థాయిలో కాకపోయినా... ఉనికి చాటుకోవాలని భావించిన కాంగ్రెస్ కూడా నీరసించినట్లయింది. ఈసారి మునిసిపల్ ఎన్నికల్లో నలుగురు మంత్రులు నాలుగు దిక్కుల బాధ్యతలు తీసుకోనున్నారు. గంగుల కరీంనగర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టనుండగా, చొప్పదండి కూడా ఆయనకు సవాలే. కేటీఆర్‌కు సిరిసిల్లతోపాటు వేములవాడను కైవసం చేసుకోవడం పెద్ద సమస్య కాదు. కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ మునిసిపాలిటీలపై దృష్టిని కేంద్రీకరించనున్నారు. ఈటలకు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంటలలో తిరుగులేని పరిస్థితి. పెద్దపల్లి జిల్లా బాధ్యతలు సైతం అప్పగిస్తే నాలుగు జిల్లాల్లో విపక్షాలకు చక్రబంధం వేసినట్టేనని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే అంశాలపై దృష్టి సారించాయి. -
అభివృద్ధికి ప్రాధాన్యం
సాక్షి, జగిత్యాల: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి జిల్లాను ప్రగతిపథంలో నడిపించాలని కోరారు. రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఖిలాలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లావాసులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కొప్పుల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన కేసీఆర్‌యే సీఎం కావడం ప్రజలందరి అదృష్టమన్నారు. ప్రజలకు ఏంఏం కావాలో గుర్తించి సమకూరుస్తున్నారని.. ఇందులో భాగంగా అనేక ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఒంటరి మహిళలకు రూ. వెయ్యి జీవనభృతి పథకానికి ఈ నెల 4న శ్రీకారం చుట్టనున్నామని ఈ క్రమంలో జిల్లాలో 3,757 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే.. మాతాశిశు సంరక్షణకు సంబంధించి మూడో తేదీన గర్భిణులకు మూడు విడతలుగా రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే మరో రూ. వెయ్యి అందించడం జరుగుతుందన్నారు. ప్రవాసనాంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా 16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేలా గొర్రెల పెంపకం దార్లకు సబ్సిడీ గొర్రెల పథకానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు. జిల్లాలో 21,048 దరఖాస్తులు చేసుకోగా లాటరీ పద్ధతి ద్వారా 10,552 మందిని ఎంపిక చేశామని, వచ్చే సంవత్సరం మిగతా వారిని ఎంపిక చేస్తామన్నారు. మత్య్సకారుల సంక్షేమాభివృద్ధి కోసం చేపల అభివృద్ధి కింద 100 శాతం సబ్సిడీపై 168 చెరువుల్లో 49,23,400 చేప పిల్లలను వదిలామని చెప్పారు. గ్రామాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ మొదటి విడత కింద రూ.29.39 కోట్లతో 195 చెరువు, రెండో విడతలో రూ.76.98 కోట్లతో 97 చెరువుల పనులు పూర్తి చేశామన్నారు. మూడో విడతలో 162 చెరువులు రూ.32.11 కోట్ల అంచనాలతో మంజూరు పొందగా టెండర్ల ప్రక్రియ చేపట్టి 141 చెరువులు పురోగతిలో ఉన్నాయన్నారు. హరితాహారం పథకంలో భాగంగా 2015–16 సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర స్థలాల్లో 109 లక్షల మొక్కలు నాటామన్నారు. 2017 సంవత్సరానికి గాను 132 లక్షలు నర్సరీలో పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లానీరు అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.1430 కోట్లతో పనులు చేపట్టి 18 మండలాల్లోని 482 ఆవాసాల్లోని 9.82 లక్షల జనాభాకు మంచినీరు సరఫరాకు పనులు జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్ గ్రామ పరిధిలో ఎస్సారెస్పీ చేపట్టిన ఇంటెక్వెల్ నుంచి ఇబ్రహీంపట్నం మండలం డబ్బ గ్రామం వద్ద 145 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మాణం అవుతున్న నీటిశుద్ధి కేంద్రం ద్వారా మంచినీటి సరఫరా పనులు 90 శాతంపూర్తయ్యాయన్నారు. ఇప్పటి వరకు 320.64కోట్లు ఖర్చు చేశామన్నారు. పేద ప్రజల సొంతింటి కల సాకారం చేసేలా గత ఆర్ధిక సంవత్సరంలో 1400 డబుల్ బెడ్రూంలు మంజూరు కాగా 900 ప్రగతిలో ఉన్నాయన్నారు. మిగతా 500 టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. స్థలాల ఎంపిక జరుగుతుందన్నారు. జగిత్యాల పట్టణానికి అదనంగా 4 వేల ఇళ్లు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సాదాబైనామా దరఖాస్తులు 32,767 వచ్చాయని, వాటిలో నేటి వరకు 24,185 దరఖాస్తులు ఆమోదించి 23,255 దరఖాస్తు ఫాంలు 13బీ జనరేట్ చేసి 22,377 దరఖాస్తులు అప్లోడ్ చేశామన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన జమీన్‌బందీ కార్యక్రమానికి 167 దరఖాస్తులు రాగా పరిశీలనలో ఉన్నాయన్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పంచాయతీరాజ్ శాఖచే రూ. 53.4 కోట్లతో 763 పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు 414 పనులు పూర్తయ్యాయన్నారు. టీఎస్ ఐ–పాస్ కింద జిల్లాలో రూ. 474 కోట్ల పెట్టుబడితో 92 కంపెనీలకు అనుమతులిచ్చామన్నారు. జిల్లాలోగుడుంబా వ్యాపారం మానేసిన వారికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి 159 మందిని గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేశామన్నారు. కులాంతర వివాహ ప్రోత్సహక బహుమతి కింద ప్రభుత్వపరంగా ఒక జంటకు రూ.50 వేలు అందజేస్తున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బీసీ వర్గాల వారి కోసం ఆర్థికంగా ఆదుకోవాలని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మైనార్టీ సంక్షేమంలో భాగంగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడు కొత్త మైనార్టీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో 29,900 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 22 గోదాంలు ఏర్పాటు చేశామన్నారు. నాబార్డ్ కింద 47,500 మెట్రిక్ టన్నుల 10 గోదాంలు, రూ.28.50 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాన్ని తమ పొలంలోనే ఉత్పత్తికి ప్రొత్సహించేందుకు జిల్లాలో వినూత్నంగా మన ధాన్యం మన విత్తనం కార్యక్రమం చేపట్టామన్నారు. 275 మంది రైతులు 276 ఎకరాల్లో 6875 విత్తనాలు సిద్ధం చేశారన్నారు. జిల్లాలో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు 1,97,880 ఉన్నాయన్నారు. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో 7826 శ్రమశక్తి సంఘాలకు 1,61,563 జాబ్‌కార్డులను మంజూరు చేయడం జరిగిందన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 63,458 కుటుంబాలకు రూ.55.10 కోట్లతో 22 లక్షల 48 వేల పని దినాలు కల్పించామన్నారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ఉత్తమ అవార్డులతో పాటు రూ. 51 వెయ్యి నగదు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్, జిల్లా జడ్జి రంజన్‌కుమార్, మొదటి అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మధు మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. -
'గొడవ చేయాలని ముందే వ్యూహం పన్నారు'
హైదరాబాద్: సభలో గొడవ చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంచెలంచెలుగా గొడవ చేయాలనివారు ముందే వ్యూహం పన్ని సభ కొనసాగకుండా కుట్ర చేశారని ఆరోపించారు. చేతనైతే గ్రామాల్లో తిరిగి ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దని భరోసా కల్పించాలి తప్ప ఇలా రైతుల సమస్యల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం ప్రత్యారోపణలతో ఆందోళనకు దిగితే రైతులే ప్రతిపక్షాలపై తిరగబడతారని చెప్పారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని చెప్పారు. ఇలాంటి రోజులు చూసేందుకు కొత్త రాష్ట్రం ఏర్పడలేదని, రైతులకు ప్రభుత్వం పూర్తి భరోసాగా ఉంటుందని ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని అన్నారు. ప్రధాన అంశం తెలంగాణ రైతుల ఆత్మహత్యలు, కరువు అని భావించి వెంటనే రెండు రోజులపాటు ఆ అంశాలపై చర్చ జరిపి అన్ని పార్టీల నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేశామని తెలిపారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తామేమన్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నామా అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల నివారణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడింది రైతుల ఆత్మహత్యలు చూసేందుకు కాదని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. రుణమాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడం సరికాదని, రైతుల ఆత్మహత్యలు రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. -
'గొడవ చేయాలని ముందే వ్యూహం పన్నారు'
-
'నా భవిష్యత్ కేసీఆరే నిర్ణయిస్తారు'
హైదరాబాద్ : మాల సామాజిక వర్గంలో ఆవేదన ఉన్నమాట వాస్తవమేనని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన సోమవారం ఉదయం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. తన భవిష్యత్‌ను కేసీఆరే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. సాయంత్రంలోగా ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వస్తుందని కొప్పుల తెలిపారు. చీఫ్‌విప్ పదవి అప్పగించడంపై కొప్పుల ఈశ్వర్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. నమ్మినందుకు నట్టేట ముంచారని ఆయన ఆవేదన చెందిన నేపథ్యంలో ఆయనకు కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి కలవాల్సిందిగా సూచించారు. మరోవైపు కొప్పులకు మంత్రి పదవిగాకుండా చీఫ్ విప్ పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుయాయులు కరీంనగర్ జిల్లాలో ఆదివారం పలుచోట్ల ఆందోళనకు దిగారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మాల మహానాడుకు చెందిన నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. నలుగురు కార్యకర్తలు కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అలాగే ధర్మపురికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. -
అలిగిన కొప్పుల!
చీఫ్‌విప్ పదవి అప్పగించడంపై ఈశ్వర్ అసంతృప్తి నమ్మినందుకు నట్టేట ముంచారని ఆవేదన కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం కొప్పులకు కేసీఆర్ ఫోన్! సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో మంత్రి పదవుల చిచ్చు మొదలైంది. కేబినెట్లో స్థానాన్ని ఆశించిన కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి కాకుండా చీఫ్‌విప్ బాధ్యతలు అప్పగించడంతో అసంతృప్తికి బీజం పడింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, 2004 నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న తనకు తొలి మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని భావించిన కొప్పులకు సామాజిక సమీకరణాల నేపథ్యంలో టి.రాజయ్య రూపంలో మొదటి దెబ్బ తగిలింది. అప్పుడే స్పీకర్, చీఫ్ విప్ పదవుల్లో ఏదైనా తీసుకోమని సీఎం కేసీఆర్ కోరినా... మంత్రి పదవే కావాలని పట్టుపట్టారు. అప్పుడు విస్తరణలో అవకాశం ఉం టుందని సీఎంతో పాటు కేటీఆర్ కూడా హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కానీ విస్తరణకు రెండ్రోజుల ముందు తాను వద్దన్న చీఫ్ విప్ పదవిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొప్పుల జీర్ణించుకోలేకపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి రాకపోయినా కేబినెట్లో ప్రాధాన్యం గల శాఖ ఇస్తారనుకున్నానని, కానీ మళ్లీ చీఫ్విప్నే ఇవ్వడమంటే నమ్మినందుకు నట్టేట ముంచడమేనని కొప్పుల తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ఈ పరిణామాలపై స్పందించేందుకు ఈశ్వర్ మీడియాకు అందుబాటులో లేరు. మరోవైపు కొప్పులకు మంత్రి పదవిగాకుండా చీఫ్ విప్ పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుయాయులు కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఆందోళనకు దిగారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మాల మహానాడుకు చెందిన నాయకులు, కార్యకర్తలు క రీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. నలుగురు కార్యకర్తలు కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అలాగే ధర్మపురికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్లమెంటరీ కార్యదర్శుల్లోనూ అసంతృప్తి! చీఫ్ విప్‌గా నియమితులైన కొప్పుల ఈశ్వర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలిసింది. కరీంనగర్లో ఉన్న ఈశ్వర్‌కు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్‌కు రమ్మని పిలిచినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో స్థానం ఆశిస్తున్న కొందరు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రెటరీలుగా నియమించాలని సీఎం భావిస్తుండడం కూడా అసంతృప్తులు పెరిగేందుకు కారణమవుతోందని తెలుస్తోంది. మంత్రి పరిధిలో పార్లమెంటు సెక్రెటరీగా పనిచేయడాన్ని కేబినెట్లో స్థానాన్ని ఆశించిన ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. విప్‌లుగా నియమితులైన వారిలో కూడా ఒకరిద్దరు అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. గంప గోవర్ధన్, నల్లాల ఓదెలు సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నా... విప్లుగానే పరిమితం చేశారని వారి అనుయాయులు అసంతప్తితో ఉన్నా రు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారిని కాద ని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై ఇప్పటికే చర్చకు తెరలేపిన ఎమ్మెల్యేలు విస్తరణ తర్వాత ఎలా స్పందిస్తారనేది టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. కొప్పులకు తీరని అన్యాయం: కారెం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొప్పుల ఈశ్వర్‌కు మంత్రిపదవి ఇవ్వకుండా తీరని అన్యాయం చేశారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ విమర్శించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి క్రమశిక్షణ గల కార్యకర్తగా టీఆర్ఎస్కు సేవలందించిన ఈశ్వర్‌కు చీఫ్ విప్ పదవి ఇవ్వడం ద్వారా మాలలను అవమానించారని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. మాలలపై కేసీఆర్ వివక్షకు నిరసనగా ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో ‘మాలల ధూంధాం’ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
తెలంగాణ ప్రభుత్వ విప్‌గా కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్‌గా కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ నియమితులయ్యారు. విప్‌లుగా కామరెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్‌రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే, నల్లాల ఓదేలును తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ పార్లమెంటరీ సెక్రటరీలుగా కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. అలాగే మరో అయిదు లేదా ఆరుగురు ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించనున్నట్లు తెలుస్తోంది.