
అలిగిన కొప్పుల!
- చీఫ్‌విప్ పదవి అప్పగించడంపై ఈశ్వర్ అసంతృప్తి
- నమ్మినందుకు నట్టేట ముంచారని ఆవేదన
- కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం
- కొప్పులకు కేసీఆర్ ఫోన్!
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో మంత్రి పదవుల చిచ్చు మొదలైంది. కేబినెట్‌లో స్థానాన్ని ఆశించిన కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి కాకుండా చీఫ్‌విప్ బాధ్యతలు అప్పగించడంతో అసంతృప్తికి బీజం పడింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, 2004 నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న తనకు తొలి మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని భావించిన కొప్పులకు సామాజిక సమీకరణాల నేపథ్యంలో టి.రాజయ్య రూపంలో మొదటి దెబ్బ తగిలింది.
అప్పుడే స్పీకర్, చీఫ్ విప్ పదవుల్లో ఏదైనా తీసుకోమని సీఎం కేసీఆర్ కోరినా... మంత్రి పదవే కావాలని పట్టుపట్టారు. అప్పుడు విస్తరణలో అవకాశం ఉం టుందని సీఎంతో పాటు కేటీఆర్ కూడా హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కానీ విస్తరణకు రెండ్రోజుల ముందు తాను వద్దన్న చీఫ్ విప్ పదవిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొప్పుల జీర్ణించుకోలేకపోతున్నారు.
ఉప ముఖ్యమంత్రి పదవి రాకపోయినా కేబినెట్‌లో ప్రాధాన్యం గల శాఖ ఇస్తారనుకున్నానని, కానీ మళ్లీ చీఫ్‌విప్‌నే ఇవ్వడమంటే నమ్మినందుకు నట్టేట ముంచడమేనని కొప్పుల తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ఈ పరిణామాలపై స్పందించేందుకు ఈశ్వర్ మీడియాకు అందుబాటులో లేరు.
మరోవైపు కొప్పులకు మంత్రి పదవిగాకుండా చీఫ్ విప్ పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుయాయులు కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఆందోళనకు దిగారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మాల మహానాడుకు చెందిన నాయకులు, కార్యకర్తలు క రీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. నలుగురు కార్యకర్తలు కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అలాగే ధర్మపురికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
పార్లమెంటరీ కార్యదర్శుల్లోనూ అసంతృప్తి!
చీఫ్ విప్‌గా నియమితులైన కొప్పుల ఈశ్వర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలిసింది. కరీంనగర్‌లో ఉన్న ఈశ్వర్‌కు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్‌కు రమ్మని పిలిచినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో స్థానం ఆశిస్తున్న కొందరు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రెటరీలుగా నియమించాలని సీఎం భావిస్తుండడం కూడా అసంతృప్తులు పెరిగేందుకు కారణమవుతోందని తెలుస్తోంది.
మంత్రి పరిధిలో పార్లమెంటు సెక్రెటరీగా పనిచేయడాన్ని కేబినెట్‌లో స్థానాన్ని ఆశించిన ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. విప్‌లుగా నియమితులైన వారిలో కూడా ఒకరిద్దరు అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. గంప గోవర్ధన్, నల్లాల ఓదెలు సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నా... విప్‌లుగానే పరిమితం చేశారని వారి అనుయాయులు అసంతప్తితో ఉన్నా రు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారిని కాద ని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై ఇప్పటికే చర్చకు తెరలేపిన ఎమ్మెల్యేలు విస్తరణ తర్వాత ఎలా స్పందిస్తారనేది టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది.
కొప్పులకు తీరని అన్యాయం: కారెం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొప్పుల ఈశ్వర్‌కు మంత్రిపదవి ఇవ్వకుండా తీరని అన్యాయం చేశారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ విమర్శించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి క్రమశిక్షణ గల కార్యకర్తగా టీఆర్‌ఎస్‌కు సేవలందించిన ఈశ్వర్‌కు చీఫ్ విప్ పదవి ఇవ్వడం ద్వారా మాలలను అవమానించారని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. మాలలపై కేసీఆర్ వివక్షకు నిరసనగా ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో ‘మాలల ధూంధాం’ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.