28,796 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఓకే | Telangana cabinet okays 28,796 jobs | Sakshi
Sakshi News home page

28,796 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఓకే

Published Sun, Jun 18 2017 1:32 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

28,796 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఓకే - Sakshi

28,796 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఓకే

- పోలీసు శాఖలో పోస్టులు.. 26,290
- రెవెన్యూ శాఖలో పోస్టులు.. 2,506
- జోనల్‌ వ్యవస్థ రద్దుకు నిర్ణయం
- నాలుగు కీలక ఆర్డినెన్స్‌లకు ఆమోదం
- విత్తనాలు, ఎరువులు, ఆహారంలో కల్తీకి పాల్పడితే పీడీ యాక్ట్‌
- ఆన్‌లైన్‌ పేకాటపై నిషేధం.. వ్యాట్‌ చట్టానికి సవరణ
- ఆర్‌వోఆర్‌ చట్టానికి సవరణలు.. రిజిస్ట్రార్ల విచక్షణ రద్దు
- పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్‌


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలకు మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. పోలీసు, రెవెన్యూ విభాగాల్లో 28,796 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. జోనల్‌ విధానాన్ని రద్దు చేయాలని, దీనిపై రాష్ట్రపతి అనుమతి కోరాలని నిర్ణయం తీసుకుంది. ఇక భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం నేపథ్యంలో రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలు రద్దు చేస్తూ తీసుకువస్తున్న ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

పలు రకాల మోసాలను పీడీ యాక్ట్‌ పరిధిలోకి తెస్తూ ఒక ఆర్డినెన్స్‌.. ఆన్‌లైన్‌ పేకాటను నిషేధిస్తూ, వ్యాట్‌ చట్టానికి సవరణలు చేస్తూ మరో రెండు ఆర్డినెన్స్‌లకు ఓకే చెప్పింది. శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీ వివరాలను డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మీడియాకు వెల్లడించారు.

పోలీసుశాఖలో 26,290 పోస్టులు
పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఆ శాఖలోని వివిధ విభాగాల్లో 26,290 ఉద్యోగ నియామకాలకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8 వేల పోస్టులతో పాటు 18,290 కొత్త పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. మూడేళ్లలో దశలవారీగా ఈ నియామకాలు చేపట్టనుంది. కానిస్టేబుల్‌ మొదలు ఎస్సై, సీఐ, డీఎస్పీల వరకు వివిధ హోదాల్లోని పోస్టులు భర్తీ చేయనుంది.

రెవెన్యూలో 2,506 కొత్త పోస్టులు
రెవెన్యూ విభాగంలో 2,506 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. సీసీఎల్‌ఏ ఆఫీసులో 21 జూనియర్‌ అసిస్టెంట్లు, 8 డిప్యూటీ కలెక్టర్, 38 డిప్యూటీ తహసీల్దార్, 400 జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, 700 వీఆర్వో, వెయ్యి వీఆర్‌ఏ, 100 డిప్యూటీ సర్వేయర్, 50 కంప్యూటర్‌ డ్రాఫ్ట్‌మన్, 7 జిల్లా రిజిస్ట్రార్, 22 సబ్‌ రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో 50 జూనియర్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్, 110 సర్వేయర్‌ పోస్టులకు ఆమోదం తెలిపారు. వెంటనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

జోనల్‌ వ్యవస్థ రద్దుకు నిర్ణయం
ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం జోనల్‌ వ్యవస్థ అమల్లో ఉంది. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చల్లో జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి.. ఇలా మూడంచెల విధానం బదులు జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో రెండంచెల విధానం ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి రెండంచెల విధానాన్ని కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

అయితే, జోనల్‌ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున.. రద్దుకు వీలుగా ‘371డీ అధికారణ’కు సవరణ చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరాలని తీర్మానించింది. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక తయారు చేసే బాధ్యతను సీఎస్‌ ఆధ్వర్యంలో కార్యదర్శుల కమిటీకి అప్పగించింది.

కల్తీకి పాల్పడితే పీడీ యాక్ట్‌
ప్రస్తుతం అమల్లో ఉన్న పీడీ యాక్టులోకి మరో పది అంశాలను చేరుస్తూ ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్‌ ఓకే చెప్పింది. ఆయా మోసాలకు పాల్పడేవారిని కూడా పీడీ యాక్టు కింద అదుపులోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ పది అంశాలు..
– కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రేతలు
– పాలు, నూనె, పçప్పు, కారం తదితర ఆహార కల్తీకి పాల్పడేవారు
– నకిలీ డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు తయారుచేసేవారు
– రేషన్‌ బియ్యం అక్రమార్కులు
– అడవుల నరికివేత
– దురాక్రమణదారులు
– స్మగ్లర్లు, ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసేవారు
– లైంగిక దాడులకు పాల్పడేవారు
– సైబర్‌ నేరాలు, వైట్‌ కాలర్‌ నేరాలు
– గేమింగ్‌ అండ్‌ గ్యాంబ్లింగ్‌కు పాల్పడే వారు

ఆన్‌లైన్‌ పేకాటపై నిషేధం
ప్రభుత్వం పేకాట క్లబ్బులను మూసివేసినా ఆన్‌లైన్‌లో గేమింగ్, గ్యాంబ్లింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో... రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో రమ్మీ, పేకాట ఆడటాన్ని నిషేధించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు గ్యాంబ్లింగ్, గేమింగ్‌ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు ఓకే చెప్పింది.

వ్యాట్‌ చట్టానికి సవరణ
ఆరేళ్ల కిందటి వరకు వ్యాట్‌కు సంబంధించిన చెల్లింపులు, రశీదులను పునః పరిశీలించే అవకాశం కల్పించేలా వ్యాట్‌ చట్టానికి సవరణలు చేసే ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్‌ భేటీ ముగిసిన వెంటనే ఈ ఆర్డినెన్స్‌ జారీ అయింది కూడా.

సబ్‌రిజిస్ట్రార్ల విచక్షణాధికారం రద్దు
రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌) చట్టానికి సవరణలు చేసే ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఓకే చెప్పింది. పదిహేను రోజుల్లోనే భూముల మ్యుటేషన్‌ చేయాలని, ఒకటే పాసు పుస్తకం ఉండాలని సవరణలను పొందుపరిచింది. సబ్‌ రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేసింది. దీనిపై కేబినెట్‌ భేటీ ముగియగానే ఆర్డినెన్స్‌ జారీ అయింది.

కేబినేట్‌లో మరిన్ని నిర్ణయాలు
1. రాష్ట్ర రోడ్‌ కార్పొరేషన్‌కు ప్రస్తుతం రూ.1,000 కోట్ల వరకు రుణ పరిమితి అమల్లో ఉంది. దీనిని రూ.5,000 కోట్లకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకు వీలుగా ప్రభుత్వం తరఫున రూ.1,200 కోట్ల పూచీకత్తు ఇచ్చేందుకు ఓకే చెప్పింది.
2. జిల్లాల వారీగా రైతుల సమగ్ర సర్వే పురోగతిపై కేబినెట్‌ చర్చించింది. గడువు ముగిసినా.. ఇంకా భూముల వివరాలు అందించని రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
3. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గొర్రెల పంపిణీ పథకాన్ని ఈ నెల 20న గజ్వేల్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అదే రోజున అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.
4. జూలైలో రాష్ట్రవ్యాప్తంగా వంద సంచార పశు వైద్యశాలలు ప్రారంభించాలని నిర్ణయించారు.
5. ఈ ఏడాది చేపల పెంపకాన్ని మరింతగా ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. గతేడాది నాలుగు వేల చెరువుల్లో చేపలు పెంచగా.. ఈసారి గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న చెరువులు కూడా కలిపి మొత్తం 24 వేల చెరువల్లో చేపలు పెంచాలని... 70 కోట్ల చేపపిల్లలను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని తీర్మానించింది.
6. హరితహారంలో రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 40 కోట్ల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూలై మొదటివారంలో ప్రారంభించాలని.. వర్షాలను బట్టి తేదీని ఖరారు చేయాలని అభిప్రాయపడింది.
7. ప్రభుత్వం అమలు చేస్తున్న వరుస సంక్షేమ పథకాలు, కార్యక్రమాల దృష్ట్యా మంత్రులు తమ కార్యాలయాల్లో మరో పీఏ లేదా ఓఎస్డీని నియమించుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
8. తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలను అక్టోబర్‌ 22 నుంచి వారం పాటు నిర్వహించాలని తీర్మానించింది.
9. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అక్కడ అభివృద్ధి చెందే మత్స్య సంపదపై హక్కులు కల్పించాలని నిర్ణయించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement