త్వరలో 84,876 పోస్టులు | More than one lakh jobs will fulfilled, cm kcr | Sakshi
Sakshi News home page

త్వరలో 84,876 పోస్టులు

Published Wed, Aug 16 2017 1:54 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

త్వరలో 84,876 పోస్టులు - Sakshi

త్వరలో 84,876 పోస్టులు

  • లక్ష కాదు అంతకుమించి ఉద్యోగాలు భర్తీ చేస్తాం: ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ఇప్పుడు ఆర్థిక వృద్ధిరేటులో తెలంగాణే నంబర్‌ వన్‌
  • అన్ని వర్గాల సంక్షేమమే మా లక్ష్యం.. ఆ దిశగా పురోగమిస్తున్నాం
  • ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకునేందుకు దుష్టశక్తుల యత్నం
  • ఆ క్షుద్ర ప్రయత్నాలను విచ్ఛిన్నం చేస్తూ ముందుకెళుతున్నాం
  • రైతుల బాగుకోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నాం
  • వచ్చే బతుకమ్మ పండుగ నుంచి పేద మహిళలకు చీరలు
  • గోల్కొండలో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రసంగించిన సీఎం 
  • సాక్షి, హైదరాబాద్‌:
    తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే లక్ష కొత్త ఉద్యోగాలు వస్తాయని ఉద్యమ సమయంలో చెప్పామని... కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ఉద్యోగాల భర్తీ జరగబోతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన 27,660 నియామకాలతో పాటు త్వరలో మరో 84,876 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించారు.

    స్వాతంత్య్ర దినోత్సవం రోజున నిరుద్యోగులకు శుభవార్త చెబుతున్నానని.. మొత్తంగా 1,12,536 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. వచ్చే సంవత్సరం ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి కూడా ఈ సంవత్సరమే నియామక ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆయన మంగళవారం 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రసంగం కేసీఆర్‌ మాటల్లోనే...

    దీక్షతో ముందుకు సాగుతున్నాం..
    ‘‘సకల జనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతోంది, ప్రజల అండదండలే మాకు తిరుగులేని ఆత్మబలాన్ని అందిస్తున్నాయి. అంకితభావాన్ని పెంపొందిస్తున్నాయి. అట్టడుగు వర్గాల దాకా అభివృద్ధి ఫలాలను చేరవేసి.. ప్రజల ముఖాలపై చిరునవ్వులు విరబూసే బంగారు తెలంగాణను సాకారం చేసే మా ప్రయత్నంలో కలసి వస్తున్న వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..  

    ఎన్ని శక్తులు మా ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నా ప్రజల ఆశీర్వాదంతో వాటన్నింటినీ ఛేదిస్తూ ముందడుగు వేయగలుగుతున్నాం. తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం పాటు పడే మా ఏకాగ్రతను అటువంటి క్షుద్ర ప్రయత్నాలతో మరల్చలేరని వారికి మరోసారి స్పష్టం చేస్తున్నా..  

    దేశంలోనే అగ్రభాగాన నిలిచాం..
    ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆశయాల దిశలోనే రాష్ట్రం పురోగమిస్తోంది. సాధారణంగా కొత్త రా>ష్ట్రాలు తొందరగా కుదురుకోలేవు. కానీ 21.7శాతం ఆదాయ వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలవటం మనందరికీ గర్వకారణం. పారదర్శక విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ వల్లే ఇది సాధ్యమైంది. తెలంగాణ విధానాలను ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. సమానత్వం, సామాజిక న్యాయం అనే ఉదాత్త లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించుకుని ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులతో పాటు ఇటీవలే ఒంటరి మహిళలకూ జీవన భృతి కల్పిస్తూ వారికి సామాజిక, ఆర్థిక భద్రతను కల్పిస్తున్నాం.

    ‘విద్యుత్‌’లో విప్లవాత్మక మార్పు
    రాష్ట్ర పురోగతికి దోహదపడేలా ఒక్క నిమిషం కూడా కోతల్లేని నాణ్యమైన కరెంటు అందిస్తూ విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పు సాధించాం. పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్‌ అందిస్తున్నాం. వచ్చే యాసంగి నుంచి అన్ని ప్రాంతాలకు దాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. పరిశ్రమలు మూడు షిఫ్టులు నడవడం వల్ల కార్మికులకు ఎక్కువ పని దొరుకుతోంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు రూ.1.01 లక్షల కోట్ల మేర పెట్టుబడులు సమకూరాయి. 4,118 నూతన పరిశ్రమలు అనుమతులు పొందాయి.

    సంక్షేమానికి ప్రాధాన్యం
    రాష్ట్రంలో పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించే డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. ప్పటివరకు 259 గురుకుల పాఠశాలలుంటే కేవలం మూడేళ్లలో మెరుగైన వసతులతో 522 గురుకులాలను ప్రారంభించాం. ఒక్కో విద్యార్థి మీద ఏటా రూ.1.25 లక్షలు వెచ్చిస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్నాం. చిరుద్యోగుల వేతనాలను సముచితంగా పెంచి ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు శ్రమదోపిడీకి గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. ఇటీవల గాంధీ ఆస్పత్రికి గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసే దీనికి నిదర్శనం.

    కేసీఆర్‌ కిట్‌ పథకం వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెరిగింది. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం విజయవంతమవుతోంది. పోలీసు వ్యవస్థను పటిష్టపర్చడంతో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. పేకాట, గుడుంబా మహమ్మారులను దాదాపు తరిమికొట్టగలిగాం. జిల్లాల్లో షీ టీమ్స్‌ సంఖ్యను పెంచాలని నిర్ణయించాం. డ్రగ్స్‌ వంటి సామాజిక రుగ్మతలను ఆదిలోనే అంతం చేసేందుకు రాజీలేని వైఖరి అవలంబిస్తున్నాం. మిషన్‌ భగీరథతో వచ్చే డిసెంబర్‌ నాటికే అన్ని గ్రామాలకు శుద్ధిచేసిన నీటిని అందించే అవకాశాలున్నాయి.  

    రైతుల బాగు కోసం చర్యలు
    రైతులకు సంవత్సరంలో రెండు పంటల కోసం ఎకరానికి రూ.8 వేల చొప్పున వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వమే పెట్టుబడిని సమకూరుస్తుంది. ఈ పథకం యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. రైతు పండించిన పంటకు డిమాండ్‌ రావడం కోసం ప్రభుత్వం రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా విభజిస్తుంది. రైతులంతా ఒకే పంట వేసి నష్టపోయే పరిస్థితి ఉత్పన్నం కాకుండా.. పంటలకు మార్కెటింగ్‌ సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతాం.

    విద్యుత్తు సరఫరా మెరుగు, చెరువుల పునరుద్ధరణ తదితరాల ఫలితంగా 96 లక్షల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతాంగం నూతన చరిత్రను లిఖించింది. కోటికిపైగా ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాం. భూ సమస్యల పరిష్కారం కోసం రైతాంగం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దూరం చేసేలా చర్యలు చేపట్టాం. విస్తృతస్థాయిలో భూసర్వే జరపబోతున్నాం. దానికి అందరూ సహకరించాలి. సర్వే తర్వాత భూ రికార్డులన్నీ పూర్తిగా సరిచేస్తాం. కొత్త పాస్‌ పుస్తకాలు జారీ చేస్తాం.

    వెనుకబడిన వర్గాలకు చేయూత
    గొర్రెల యూనిట్ల కోసం నాలుగు లక్షల దరఖాస్తులు వస్తాయనుకుంటే ఏకంగా ఏడు లక్షలు వచ్చాయి. అందరికీ సరిపోయేలా 1.47 కోట్ల గొర్రెలను అందించే ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే మత్స్య పరిశ్రమ పురోగతికి చర్యలు తీసుకున్నాం. చేనేత కార్మికులకు అవసరమైన నూలుతో పాటు అద్దకానికి అవసరమైన రసాయనాలను 50 శాతం సబ్సిడీతో అందిస్తున్నాం. నేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. పవర్‌లూమ్‌లను ఆధునీకరించి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకున్నాం.

    వచ్చే బతుకమ్మ పండుగ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెల్లరేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల్లోని 93 లక్షల మంది మహిళలకు చీరలను పండుగ కానుకగా అందించే పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్, సిరిసిల్లలో అపరెల్‌ పార్క్‌ నిర్మాణం త్వరలో చేపడతాం. గ్రామీణ ప్రాంతాల్లో నాయీ బ్రాహ్మణులు ఆధునిక క్షౌ రశాలలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. రజకులకు ఆధునిక యంత్రాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. సంచార జాతులు, యాచకులను ఆదుకునేందుకు రూ.వేయి కోట్ల బడ్జెత్‌తో ‘అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం.

    పారిశ్రామికవేత్తల సదస్సుకు మోదీ, ట్రంప్‌ కుమార్తె
    హైదరాబాద్‌లో నవంబర్‌ 28 నుంచి 30 వరకు జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, ఆ దేశ ప్రభుత్వ సలహాదారు అయిన ఇవాంకా హాజరవుతున్నారని కేసీఆర్‌ చెప్పారు. పారిశ్రామికవేత్తలు పరస్పరం చర్చించుకునేందుకు, సహకరించుకునేందుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్పూర్తినిచ్చేందుకు ఈ సదస్సు వేదిక కాబోతోందన్నారు.

    సైనిక అమరులకు ఘనంగా నివాళి
    71వ స్వాతంత్య్ర దినోత్సవాలన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని అమర సైనికవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్‌ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రా సబ్‌ఏరియా కమాండర్, మేజర్‌ జనరల్, జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఎం.శ్రీనివాస్‌రావు, సైనిక, వైమానిక దళ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement