జల్దీ జాబ్స్‌కు దారేది?
- ఉద్యోగాల భర్తీ జాప్యంపై సీఎం ఆదేశాలతో సమీక్ష
- కేలండర్ విధానంలో వేగంగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు
- బాధ్యతలు డిప్యూటీ సీఎంకు అప్పగింత
- సీఎస్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్, ఉన్నత అధికారులతో కడియం అత్యవసర భేటీ
- ఉద్యోగాల భర్తీకి చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష
- పాత జిల్లాలా? కొత్త జిల్లాలా?
- వేటి ప్రాతిపదికన నోటిఫికేషన్లు ఇద్దాం?
- సలహా ఇవ్వాలని న్యాయ శాఖకు విన్నపం
- ఈ నెల 21న మరోసారి భేటీ
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కేలండర్ విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పుడు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామన్న వివరాలను ముందుగానే ప్రకటించి ఆ మేరకు చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా పోస్టుల భర్తీకి అవసరమైన రోడ్ మ్యాప్ రూపొందించేందుకు రంగంలోకి దిగింది. టీఎస్‌పీఎస్సీతో సమన్వయం చేసుకుంటూ నియామకాల్లో జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యతలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి అప్పగించారు. దీంతో కడియం బుధవారం సాయంత్రం సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అదర్‌సిన్హా, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీలో తలెత్తుతున్న పలు సమస్యలపై ఇందులో చర్చించారు. ఉద్యోగాల నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు, న్యాయపరంగా అడ్డంకులు లేని నోటిఫికేషన్లు జారీ చేసేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు. అనంతరం తనను కలసిన విలేకరులతో కడియం శ్రీహరి మాట్లాడారు.
త్వరితగతిన నోటిఫికేషన్లు ఇస్తాం..
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి హామీ ఇచ్చారని, ఆ మేరకు త్వరితగతిన నోటిఫికేషన్లను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కడియం శ్రీహరి తెలిపారు. అందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పనపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. ‘‘నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఎదురవుతున్న న్యాయపరమైన, ఇతర ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పాత 10 జిల్లాల ప్రాతిపదిక నోటిఫికేషన్లను జారీ చేయాలా? లేదా కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని జారీ చేయాలా? అన్న అంశంపై చర్చించాం.
ఒకవేళ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పు చేయాల్సి వస్తే ఏం చేయాలన్న దానిపై న్యాయశాఖ సలహా కోరాం’’అని వివరించారు. పోస్టుల భర్తీలో జాప్యం లేకుండా చూసేందుకు శాఖలు, కేడర్ వారీగా పోస్టుల సంఖ్యను గుర్తించి, వాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హతలు, రోస్టర్ పాయింట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 21న సచివాలయంలో మరోసారి ఇదే అంశంపై సమావేశమై చర్చిస్తామమన్నారు.
బద్నాం చేస్తున్నారు: ఘంటా
ఈ సమావేశం టీఎస్‌పీఎస్సీపై కాదని, సీఎం ప్రకటించిన ఉద్యోగాల భర్తీ కార్యాచరణపైనేనని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. సమావేశం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు భారీగా వేతనాలు పెరిగాయని మీడియాలో ఫొటోలతో వార్తలు ప్రచురించి, బద్నాం చేస్తున్నారని అన్నారు. వేతనం రూ.80 వేలు ఉన్నప్పుడే అలవెన్సులతో కలుపుకొని రూ.1.80 లక్షలు వచ్చేదన్నారు. కేంద్ర పీఆర్‌సీని ప్రభుత్వం తమకు వర్తింపజేసినందున వేతనం మరో రూ.15 వేల వరకు పెరిగిందన్నారు. ఏడో పీఆర్‌సీ ప్రకారం ప్రస్తుతం అన్ని అలవెన్సులు కలుపుకొని రూ.2.25 లక్షలకు వేతనం పెరిగిందన్నారు. ఈ అంశాన్ని పక్కన పెట్టి తమ వేతనాలు భారీగా పెరిగినట్టు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో చూపించడం సరికాదన్నారు.
టీచర్ పోస్టుల భర్తీపై నేడు తేలేనా?
తాజా పరిణామాల నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై కొంత గందరగోళం ఏర్పడింది. కొత్త జిల్లాల ప్రకారం టీచర్ పోస్టులను భర్తీ చేయాలా? పాత జిల్లాల ప్రకారం భర్తీ చేయాలా? అన్న అంశం తెరపైకి రావడంతో ఈ నెల 17న(గురువారం) దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం వెల్లడించారు. అయితే బుధవారమే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అయితే పోస్టులను కొత్త జిల్లాల ప్రకారం భర్తీ చేయాలా? పాత జిల్లాల ప్రకారం భర్తీ చేయాలా? అన్న దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో గురువారం టీచర్ పోస్టుల భర్తీ వ్యవహారంలో స్పష్టత వస్తుందా? లేదా 21వ తేదీ వరకు ఆగాల్సి వస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
ఏమాత్రం ఆలస్యం చేయొద్దు: సీఎం
రాష్ట్రంలో 84 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉన్నందున శాఖల వారీగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నేతృత్వంలోని అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కనీసం వారానికోసారి సమావేశమై నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టంచేశారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యా సంస్థల్లో టీచర్ల నియామకానికి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయమే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఘంటా చక్రపాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తదితరులతో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం ఏ పని చేపట్టినా వాటిని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు కాచుకుని కూచున్నాయని, ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కోర్టు కేసులను సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.
త్వరలోనే గ్రూప్–1, 2 ఫలితాలు
టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే 58 నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నట్లు ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సీఎంకు వివరించారు. కమిషన్ ద్వారా ఇప్పటికే 5 వేల మందికి పైగా నియామకం అయ్యారని, మరో నెలరోజుల్లో 12 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. న్యాయపరమైన వివాదాలు కొలిక్కి వచ్చినందున త్వరలోనే గ్రూప్–1, గ్రూప్–2 ఫలితాలను ప్రకటిస్తామన్నారు. కాగా పని భారం పెరిగినందున టీఎస్‌పీఎస్సీలో కొత్తగా 90 మంది ఉద్యోగులను నియమించడానికి సీఎం అంగీకరించారు.