లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీ
- లెక్క తేల్చిన రాష్ట్ర సర్కారు..
- ఈ ఏడాదిలోనే భారీగా నోటిఫికేషన్లు
- వచ్చే ఏడాది ఖాళీ అయ్యేవి కూడా భర్తీ
- ఇప్పటివరకు భర్తీ చేసినవి 27,660
- నియామక దశలో ఉన్నవి 36,806
- కొత్తగా భర్తీ చేయాల్సినవి 48,070
సాక్షి, హైదరాబాద్
మూడేళ్లుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ ఏడాదిలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం కానుందని ప్రకటించింది. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే పోస్టులకు కూడా ఈ ఏడాదే నియామక నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.
మంగళవారం గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రసంగించిన సీఎం.. కొత్త ఉద్యోగాలు, ఖాళీలు, నియామకాల వివరాలను ప్రస్తావించారు. ఉద్యమ సమయంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా లక్షకు మించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. వివిధ నియామకాలపై కోర్టు కేసులు, పరీక్షలు, ఫలితాల వివాదాలు, నోటిఫికేషన్ల జారీలో జాప్యంతో రెండేళ్లుగా ఆందోళన చెందుతున్న నిరుద్యోగులకు తాజా ప్రకటన కొత్త ఆశలు చిగురించాయి.
మొత్తం 1.12 లక్షల ఖాళీలు
వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 19 విభాగాల్లో 1,12,536 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. వీటిలో ఇప్పటివరకు 27,660 పోస్టులు భర్తీ చేసినట్లు ప్రకటించింది. మరో 36,806 పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని, కొత్తగా 48,070 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
పూర్తయిన నియామకాలు
ఇప్పటివరకు 27,660 పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే విభాగాల వారీగా 22,468 పోస్టుల వివరాలను మాత్రమే వెల్లడించింది. మిగతా 5 వేల పోస్టులపై అస్పష్టత నెలకొంది. పోలీసు విభాగంలో 10,499 పోస్టులు, సింగరేణిలో 5,515, ఆర్టీసీలో 3,950, వ్యవసాయ ఉద్యానవన శాఖలో 1,757, భూగర్భ జల విభాగంలో 102, ఎక్సైజ్‌లో 340, రవాణా శాఖలో 182, పంచాయతీరాజ్ విభాగంలో 123 పోస్టులు భర్తీ చేసినట్లు ప్రకటించింది.