
పదవుల పందేరం షురూ!
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ నేతలు ఏడాదిగా నిరీక్షిస్తున్న పదవుల పందేరానికి ముహూర్తం ఖరారైంది! వివిధ కారణాలతో వాయిదాపడుతూ వస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు టీఆర్‌ఎస్ అధినాయకత్వం సిద్ధమైంది!! దీంతో ఇన్నాళ్లూ ఆశగా ఎదురు చూసిన నేతలు తమకు తప్పక అవకాశం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. పుష్కర హడావిడి ముగియడంతో పదవుల భర్తీపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిసారించనున్నారని...ఇక పదవుల భర్తీకి మోక్షం కలిగిన ట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆషాఢ మాసం ముగిశాక ఈ నియామకాలు ఖరారవుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు దీనిపై భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలోని 12 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండటంతోపాటు డిసెంబర్ చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు, వరంగల్ లోక్‌సభా స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగాల్సి ఉన్న దృష్ట్యా నామినేటెడ్ పదవులు భర్తీ చేసి కొత్త తలనొప్పులు తెచ్చుకోరని పార్టీలోని కొందరు నేతలు సూత్రీకరించారు. అయితే ఈ ఎన్నికలకు, పదవుల పందేరానికి సంబంధం లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒకవేళ అన్ని ఎన్నికలు పూర్తయ్యాకే పదవులు ఇవ్వాలంటే ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి లెక్కగడితే ఏడాదిన్నర గడిచిపోయినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే పార్టీ నేతలు, శ్రేణుల్లో నిస్తేజం ఆవరించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విభజన జరగని కారణంగానే నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం అయిందని చెబుతున్నా వీటితో సంబంధంలేని సంస్థలు కూడా ఖాళీగానే ఉన్నాయి. ముందు కొన్నింటితో మొదలు పెడితే విడతలవారీగా అన్నింటినీ పూర్తి చెయ్యొచ్చన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఈ కారణంగానే పదవుల పందేరంపై అధినేత కేసీఆర్ దృష్టిపెట్టనున్నారని చెబుతున్నారు.
కేబినెట్‌లో కొత్త వారికి బెర్తులు!
ఇదే సమయంలో మంత్రివర్గంలోనూ కొన్ని మార్పుచేర్పులు తప్పకపోవచ్చన్న ప్రచారమూ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. కొందరికి అవకాశం కల్పించాల్సి రావడంతో మార్పులు ఉంటాయనే అంటున్నారు. కొందరు అమాత్యుల పనితీరూ అనుకున్నంతగా ఆకట్టుకోకపోవడం, వారిపట్ల సీఎం ఒకింత అసంతృప్తిగా ఉండటంతో కొత్తవారికి బెర్తులు దొరుకుతాయని పేర్కొంటున్నారు. కేబినెట్‌లో మహిళా ప్రాతినిధ్యం లేకపోవడంపైనా ఇంటా, బయట చర్చ జరుగుతోంది.
వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టడంలో భాగంగా తొలి నుంచీ పార్టీలో ఉంటున్న వారికీ, వివిధ హామీలపై పార్టీలోకి వచ్చిన వారికీ అవకాశం ఇవ్వడంపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో కనీసం మూడు, నాలుగు మార్పులుండే అవకాశాన్ని పార్టీ వర్గాలు కొట్టిపారేయడం లేదు. అయితే మార్పులకు కచ్చితమైన ముహూర్తంపై మాత్రం ఎవరూ పెదవివిప్పడం లేదు. పార్టీ అవసరాల రీత్యా, ద్వితీయ శ్రేణిలో ఉత్సాహం నింపాల్సిన అవసరం వచ్చిందని, ఈ కారణంగానే అటు నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు, మంత్రివర్గంలోనూ మార్పులు చేర్పుల నిర్ణయం జరగొచ్చని అంటున్నారు.