మాల సామాజిక వర్గంలో ఆవేదన ఉన్నమాట వాస్తవమేనని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన సోమవారం ఉదయం కేసీఆర్తో భేటీ అయ్యారు.
హైదరాబాద్ : మాల సామాజిక వర్గంలో ఆవేదన ఉన్నమాట వాస్తవమేనని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన సోమవారం ఉదయం కేసీఆర్తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. తన భవిష్యత్ను కేసీఆరే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. సాయంత్రంలోగా ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వస్తుందని కొప్పుల తెలిపారు.
చీఫ్‌విప్ పదవి అప్పగించడంపై కొప్పుల ఈశ్వర్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. నమ్మినందుకు నట్టేట ముంచారని ఆయన ఆవేదన చెందిన నేపథ్యంలో ఆయనకు కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి కలవాల్సిందిగా సూచించారు. మరోవైపు కొప్పులకు మంత్రి పదవిగాకుండా చీఫ్ విప్ పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుయాయులు కరీంనగర్ జిల్లాలో ఆదివారం పలుచోట్ల ఆందోళనకు దిగారు.
కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మాల మహానాడుకు చెందిన నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. నలుగురు కార్యకర్తలు కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అలాగే ధర్మపురికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.