సాక్షి , కరీంనగర్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది... టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన కరీంనగర్ గడ్డపై రసవత్తర రాజకీయ చిత్రం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా నలుగురు మంత్రులు ఇక్కడి నుంచే రాష్ట్ర కేబినెట్‌లో కొలువుదీరారు. పునర్విభజన తరువాత కరీంనగర్ నాలుగు జిల్లాలుగా విడిపోగా... నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహించడం విశేషమే. ఇందులో విభజన తరువాత మిగిలిన కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్‌కు తోడు కరీంనగర్ నుంచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్న గంగుల కమలాకర్‌కు అవకాశం కల్పించడం విశేషం. ఆయనకు గతంలో ఈటల రాజేందర్ నిర్వహించిన పౌర సరఫరాల శాఖతోపాటు ఇప్పటి వరకు జిల్లాకే చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను కూడా కేటాయించారు.
ఇక అందరూ ఊహించినట్టే... టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, గత ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన కల్వకుంట్ల తారక రామారావును మరోసారి కేబినెట్‌లోకి తీసుకొన్న కేసీఆర్ గతంలో ఆయన నిర్వహించిన శాఖలే కేటాయించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆరుగురుకు చోటు కల్పిస్తే, అందులో ఇద్దరు కరీంనగర్ నుంచే చోటు దక్కించుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్ రాజకీయ అంచనాలతోనే కేసీఆర్ కరీంనగర్ నుంచే నలుగురు మంత్రులను ఎంపిక చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయాలకు కేంద్రంగా కరీంనగర్
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా ఇప్పటికే అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వంలో తొలివిడత కేటీఆర్‌కు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన సిరిసిల్లకే పరిమితమయ్యారు. మంత్రివర్గ విస్తరణలో మునిసిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా నియమితులైన నేపథ్యంలో తన నియోజకవర్గంతోపాటు కరీంనగర్ కేంద్రంగా ఆయన కార్యకలాపాలు సాగుతాయని భావిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కరీంనగర్ లోక్‌సభ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, మోదీ ప్రభావంతోపాటు సంజయ్ సానుభూతి కారణంగా టీఆర్‌ఎస్ కరీంనగర్‌ను కోల్పోయింది. కరీంనగర్, వేములవాడ, చొప్పదండి, మానకొండూరులలో బీజేపీకి భారీ మెజారిటీ లభించింది. సిరిసిల్లలో అనూహ్యంగా టీఆర్‌ఎస్‌కు కేవలం 5వేల ఆధిక్యత మాత్రమే లభించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కరీంనగర్ లోక్‌సభ స్థానంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నారు. ఎక్కువ సమయం కరీంనగర్‌కు కేటాయిస్తే, ఇక్కడి నుంచే రాష్ట్ర రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంటుంది.
బీజేపీకి గంగులతో చెక్
కొత్త కరీంనగర్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం వెనుక బీజేపీకి చెక్‌పెట్టే వ్యూహం కనిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు 40 వేల మెజారిటీ రాగా, పక్కన హుస్నాబాద్‌లో కూడా టీఆర్‌ఎస్ మంచి ఆధిక్యత సాధించింది. కానీ మిగతా నియోజకవర్గాల్లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు పొందింది. ఈ ఉత్సాహంతో కరీంనగర్ కార్పొరేషన్ మీద బీజేపీ దృష్టి సారించి రాజకీయంగా పావులు కదుపుతోంది. వేములవాడ, చొప్పదండి వంటి మునిసిపాలిటీలపైనా కన్నేసింది. ఈ నేపథ్యంలో ఈటల ఉన్నప్పటికీ, కరీంనగర్ జిల్లాకు మరో పదవిని ఇవ్వడానికి కేసీఆర్ వెనుకాడలేదు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బలమైన ‘మున్నూరుకాపు’ సామాజికవర్గం టీఆర్‌ఎస్‌ను కాదని బీజేపీ వైపు నిలిచిందని పార్టీ భావిస్తోంది. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన సంజయ్‌కు చెక్ పెట్టాలంటే గంగులను తెరపైకి తేవడం తప్పని సరైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రామగుండం మునిసిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి మునిసిపాలిటీలలో సత్తా చాటాలని మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తదితరులు కంకణాలు కట్టుకున్నారు. అవసరమైతే మంత్రి పదవి లేని పెద్దపల్లి జిల్లాకు ఈటలను ఇన్‌చార్జిగా నియమించి అక్కడ బీజేపీతోపాటు కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలనే యోచనలో టీఆర్‌ఎస్ ఉన్నట్లు సమాచారం.
బీజేపీ, కాంగ్రెస్ తర్జన భర్జన
ఉమ్మడి జిల్లాకు ఏకంగా నలుగురిని మంత్రులుగా చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల విజయ పరంపరను కొనసాగించాలని భావించిన బీజేపీకి కొత్తగా ఇద్దరు కీలక మంత్రులను నియమించడం షాక్ ఇచ్చినట్లయింది. ఈ మునిసిపల్ ఎన్నికల ద్వారా పూర్వ వైభవం స్థాయిలో కాకపోయినా... ఉనికి చాటుకోవాలని భావించిన కాంగ్రెస్ కూడా నీరసించినట్లయింది. ఈసారి మునిసిపల్ ఎన్నికల్లో నలుగురు మంత్రులు నాలుగు దిక్కుల బాధ్యతలు తీసుకోనున్నారు. గంగుల కరీంనగర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టనుండగా, చొప్పదండి కూడా ఆయనకు సవాలే. కేటీఆర్‌కు సిరిసిల్లతోపాటు వేములవాడను కైవసం చేసుకోవడం పెద్ద సమస్య కాదు. కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్ మునిసిపాలిటీలపై దృష్టిని కేంద్రీకరించనున్నారు. ఈటలకు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంటలలో తిరుగులేని పరిస్థితి. పెద్దపల్లి జిల్లా బాధ్యతలు సైతం అప్పగిస్తే నాలుగు జిల్లాల్లో విపక్షాలకు చక్రబంధం వేసినట్టేనని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టే అంశాలపై దృష్టి సారించాయి.
Comments
Please login to add a commentAdd a comment