‘పార్టీలు ఉండకపోవచ్చు... జెండాలు ఉండకపోవచ్చు... కానీ ప్రజలు ఎప్పటికీ ఉంటరు. ఆ ప్రజల పక్షాన ఈటల రాజేందర్ అనే నేను ఎల్లప్పుడు ఉంటా. ఆరుసార్లు మీ బిడ్డగా ఆదరించి గెలిపించారు. మీ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తా’ – మంగళవారం ఇల్లందకుంట రైతువేదికల ప్రారంభసభలో మంత్రి ఈటల రాజేందర్. ‘నేను మంత్రిగా ఉండొచ్చు... లేకపోవచ్చు... రైతు ఉద్యమం ఎక్కడ ఉన్నా నా మద్దతు ఉంటుంది. రైతుబంధు పథకం మంచిదే కానీ... ఇన్‌కంటాక్స్ కట్టే వాళ్లకు, రియల్ ఎస్టేట్ భూములు, వ్యవసాయం చెయ్యని గుట్టలు, లీజుకిచ్చే భూములకు రైతుబంధు ఇవ్వొద్దు అని వీణవంక మండలం రైతులు కోరుతున్నారు. మీ మాటగా ఈ విషయం సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తా. – సోమవారం వీణవంక సభలో ఈటల
గత కొంత కాలంగా మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో మంత్రి ‘ఈటె’ల్లాంటి మాటలపై రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. సోమవారం వీణవంక సభలో ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతుబంధు పథకంలోని లోపాలు, రైతు ఉద్యమంలో తన పాత్ర’ గురించి స్పష్టంగా వివరించిన ఆయన మంగళవారం మరో ‘ఈటె’ వేశారు. రైతులకు అండగా తానుంటానని చెబుతూనే ‘పార్టీలు, జెండాలు ఉండకపోయినా... ప్రజల పక్షాన నేను ఉంటా’ అని వ్యాఖ్యానించడం వెనుక గల ఆంతర్యాన్ని సొంత పార్టీ వారే వెతుక్కుంటున్నారు.
రైతు పక్షపాతిగా ‘ఈటె’ల బాణాలు
రైతువేదికల ప్రారంభోత్సవాల సందర్భంగా మంత్రి ఈటల తాను రైతుబిడ్డనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘మంత్రిగా ఉన్నా లేకపోయినా... రైతుల కోసం ఉద్యమిస్తా’ అని సోమవారం వీణవంకలో చెప్పిన ఆయన ‘పార్టీలు, జెండాలు లేకపోయినా తాను రైతుల కోసం, ప్రజల కోసం ఎల్లప్పుడు ఉంటా’ అని మంగళవారం ఇల్లందకుంటలో వ్యాఖ్యానించి కొత్త చర్చకు దారితీశారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకంలోని లోపాలను వీణవంక సభలో రైతుల మాటలుగా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అనర్హులైన కొన్ని వర్గాలకు రైతుబంధు నిలిపివేయమని రైతులు కోరిన విషయాన్ని ము ఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. రైతుబంధు విషయంలో గత కొన్నేళ్లుగా సామాన్యులు, మేధావులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలను మంత్రి హోదాలో ఈటల మాట్లాడడం ద్వారా కొత్త చర్చ ప్రారంభమైనట్టయింది. అలాగే ఖాళీ స్థలాలు, గుట్టలు, లీజు భూములకు పెట్టుబడి కింద ప్రభుత్వం డబ్బులు చెల్లించడమనే అంశాన్ని మంత్రి తెరపైకి తెచ్చారు. భూస్వాములు, ఐటీ చెల్లింపుదారులకు రైతుబంధు అవసరం లేదనే ధోరణిలో ఆయన మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య జనంలో కూడా చర్చనీయాంశంగా మారాయి.
గులాబీ జెండాకు ఓనరుగా సంచలనం..
2019 ఆగస్టులో హుజూరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ పార్టీలోనే సంచలనం అయ్యాయి. తన విషయంలో పార్టీలో, ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ... ‘మంత్రి పదవి నాకు భిక్ష కాదు. కులం పేరుతో కొట్లాడి పదవి తెచ్చుకోలేదు. తెలంగాణ కోసం చేసిన ఉద్యమమే నన్ను మంత్రిని చేసింది... గులాబీ జెండాకు ఓనర్లం మేం’ అని ఆవేశంగా చేసిన ప్రసంగం అప్పట్లో సంచలనమైంది. తాజాగా ఇల్లందకుంట, వీణవంకలో సోమవారం జరిగిన రైతువేదిక సభలో రైతుల పక్షాన స్పష్టమైన వైఖరి ప్రకటించి మరోసారి పార్టీలో ఫైర్‌బ్రాండ్ అనిపించుకున్నారు.
‘కేటీఆర్ సీఎం’ చర్చ కూడా ఈటల నుంచే
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమనే చర్చ కూడా మంత్రి ఈటల వ్యాఖ్యలతోనే మొదలైంది. గత నెలలో ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వూ్యలో మాట్లాడుతూ ‘కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం అవుతారు. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో చురుకైన పాత్ర పోషిస్తున్న కేటీఆర్ సీఎం అయితే తప్పేముంది?’ అది మొదలు సోషల్ మీడియాతోపాటు ప్రసార మాధ్యమాల్లో ‘సీఎంగా కేటీఆర్ సమర్థుడు’ అనే చర్చ మొదలైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్‌నే భావి సీఎంగా భావిస్తూ ప్రకటనలు చేశారు.
ఈటల మాటల మతలబు ఏమిటో?
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన సీనియర్ నేత, ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల రాజేందర్ 2018 ఎన్నికల్లో గెలిచిన తరువాత నుంచి తన ఆలోచనా ధోరణిలో కొంత మార్పు వచ్చినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రెండోసారి మంత్రి పదవి విషయంలో కొనసాగిన ఉత్కంఠతతో సీనియర్ నేత ఈటల కొంత ఆవేదనకు గురైనట్లు ప్రచారం జరిగింది. దానికనుగుణంగా ఎక్కడ అవకాశం లభించినా, ప్రస్తుత రాజకీయాల తీరుపై నిర్మొహమాటంగా మాట్లాడుతూ వస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల విధేయతను కూడా తన ప్రసంగాల్లో చూపిస్తున్నారు. అయితే రైతుబంధు, ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో పార్టీ లైన్‌తో సంబంధం లేకుండా ఈటల సొంతంగా చేసిన వ్యాఖ్యానాలు చర్చనీయాంశంగా మారాయి. ‘పార్టీ లేకపోయినా, జెండా లేకపోయినా... నేనున్నా’ అని మంగళవారం చేసిన వ్యాఖ్యల మర్మం ఏమిటో తెలియని పరిస్థితి. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఓ వైపు బీజేపీ దూకుడు... మరోవైపు అధికార మార్పిడిపై చర్చ సాగుతుండగా మంత్రి ఈటల రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నేతలు దృష్టి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment