ప్రభుత్వోద్యోగులకు ‘స్వగృహా’లు
భారీ రాయితీపై విక్రయం!
బండ్లగూడలో చ.అ. రూ.1,900, పోచారంలో చ.అ. రూ.1,700
సాక్షి, హైదరాబాద్: అవి రాజీవ్ స్వగృహ ఇళ్లు.. సాధారణ ప్రజలు కొనాలంటే చదరపు అడుగుకు రూ.2,700 చెల్లించాలి.. ప్రభుత్వ ఉద్యోగులు మా త్రం రూ.1,900 చెల్లిస్తే సరి. ఈ మేరకు భారీ రాయితీపై స్వగృహ ఇళ్లను ప్రభుత్వోద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూమి విలువ, పన్నులు, ఇతర చార్జీలు లేకుండా, నిర్మాణ వ్యయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసు కుని కేటాయించబోతోంది. ఇంత తక్కువ ధరకు కేటాయిస్తే తీవ్ర నష్టమని అధికారులు విన్నవిం చినా ఆ ధరలనే ఖరారు చేసింది.
వేలాది ఇళ్లు ఖాళీ
బండ్లగూడ, పోచారం వెంచర్లలో రాజీవ్ స్వగృహ వేల సంఖ్య లో ఇళ్లను నిర్మించగా వేయికి మించి అమ్మలేకపోయారు. నిధులు లేవంటూ కొన్ని ఇళ్లను అసంపూర్తిగా ఆపేశారు. ఎలాగోలా పూర్తి చేసి అమ్మేందుకు అధికారులు యత్నిస్తున్న తరు ణంలో ఉమ్మడి రాష్ట్రంలో వారిని బదిలీ చేసి కొత్తవారిని నియమించారు. కొందరు నేతలు, ఆ అధికారులు కుమ్మక్కై ఎస్కలేషన్ చార్జీల పేరుతో దాదాపు రూ.వంద కోట్ల వరకు పక్కదారి పట్టిం చారు. ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లించినట్టు తేల్చి సర్దుబాటు పేరుతో ఇళ్ల ధరను ఒక్కసారిగా పెంచారు.
మార్కెట్ ధర చదరపు అడుగుకు రూ.2,400 ఉంటే స్వగృహ ధరలను రూ.2,700 మార్చారు. దీంతో వాటిని కొనేం దుకు ప్రజలు ముందుకు రాలేదు. వాటిని తమకు కేటాయిం చాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరగా.. తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. చివరకు ప్రభుత్వం చదరపు అడుగు ధర బండ్ల గూడలో రూ.1,900, పోచారంలో రూ.1,700గా నిర్ధారిం చింది. అసంపూర్తిగా ఉన్నవాటికి రూ.1,700, రూ.1,500 ఖరారు చేసింది. బండ్లగూడలో 2,443, పోచారంలో 1,470 ఇళ్లు విక్రయిస్తారు.
పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య గురువారం స్వగృహ ఇళ్లను పరిశీలించారు. ఉన్నఫళంగా ప్రభుత్వ ఉద్యోగు లకు వాటిని కేటాయించాలంటే చేపట్టాల్సిన పనుల గురించి వాకబు చేశారు.