ఆదిలాబాద్ @ 6 డిగ్రీలు
రాష్ట్రంలో గణనీయంగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఐదు డిగ్రీల మేర తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు పడిపోయింది. దీంతో అక్కడి జనం గజగజ వణికిపోతున్నారు. మరోవైపు అక్కడ పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది.
ఇక హన్మకొండ, మెదక్, రామగుండంలలో ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. హన్మకొండలో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, ఖమ్మంలలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఖమ్మంలో సాధారణం కంటే 5 డిగ్రీలు.. హైదరాబాద్‌లో 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.