ఆదిలాబాద్ @ 6 డిగ్రీలు
- రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి
- మెదక్‌లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు
- నేడు రేపు చలి తీవ్రత.. ఆ తర్వాత మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం చలితో గజగజలాడుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అక్కడ పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతకు రాత్రి ఉష్ణోగ్రతకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.
మెదక్‌లోనూ కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలు రికార్డయింది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్, నిజామాబాద్‌ల్లో 12 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హకీంపేట, హన్మకొండ, ఖమ్మం, రామగుండంలలో 13 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆది, సోమవారాల్లోనూ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని, దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తుపాను కారణంగా ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.