
పది శాతం పని.. 90 శాతం గొప్పలు :జీవన్ రెడ్డి
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
జగిత్యాల అగ్రికల్చర్: కేసీఆర్ ప్రభుత్వం పది శాతం పనులు చేసి.. 90 శాతం గొప్పలు చెప్పుకుంటోందని సీఎల్పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ రైతులు, రైతుకూలీలను విస్మరిస్తోందని ఆరోపించారు. రుణమాఫీకి ఇంకా నిధులు విడుదల చేయలేదని, ఇన్‌పుట్ సబ్సిడీ అందించలేదని, కరువు మండలాల గుర్తింపులో అలసత్వం ప్రదర్శించి రైతులకేదో మేలు చేసినట్లు మాట్లాడుతోందన్నారు. వారంలో మూడు రోజులు తన వ్యవసాయక్షేత్రాన్నే చూసుకుంటున్న ముఖ్యమంత్రి..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల గురించి ఒక్కసారైనా ఆలోచిస్తే బావుంటుందని హితవుపలికారు. పంటల బీమా పథకం గడువు ఈనెల 14 వరకే ఉన్నా.. బ్యాంకర్లు ఇప్పటివరకు రుణ పంపిణీ ప్రారంభించలేదని తెలిపారు. గడువు లోపు ప్రీమియం చెల్లిస్తేనే పంట నష్టపోయిన రైతుకు మేలు జరుగుతుందన్నారు. రెండేళ్లుగా విత్తనోత్పత్తి అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం.. ఇంకా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి విత్తనాలను దిగుమతి చేసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జిల్లాలోని కరువు మండలాల్లో 53,965 హెక్టార్లలో పంటనష్టం జరిగితే రూ.36.92 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చినా ఇతర పనులకు ఖర్చు పెట్టడం శోచనీయమన్నారు.