సోదరులే కాలయుములు
సోదరులే కాలయుములు
Published Tue, Jul 19 2016 9:24 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో భయానక హత్య
ప్రాణం తీసిన పొలం వివాదం
సోదరులే కాలయములయ్యారు. పొలం వివాదం నేపథ్యంలో పెదతండ్రి కొడుకునే చంపేశారు. తల నుంచి మొండేన్ని వేరుచేసి భయానకంగా హత్య చేశారు. కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో మంగళవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
పేటసన్నెగండ్ల (కారంపూడి) : పొలం వివాదం అన్నదమ్ముల కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. ఒకరి హత్యకు దారితీసింది. మండలంలోని పేటసన్నెగండ్ల గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చప్పిడి మల్లయ్య, వెంకటేశ్వర్లు అన్నదమ్ములు. వారికి భాగపంపకాల్లో భాగంగా కొండ కింద ఉన్న రెండెకరాల పొలంలో చెరో ఎకరం వచ్చింది. గతంలో దాయాది భాగాన్ని కూడా తాను కొన్నానని, రెండెకరాలు తనదేనని వెంకటేశ్వర్లు కుమారుడు వెంకట నర్సయ్య కోర్టుకు వెళ్లడంతో ఇటీవల కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. దీంతో వెంకటనర్సయ్య మంగళవారం పొలంలో జూట్ విత్తనాలు వేసేందుకు చెల్లెలు ఆదిలక్ష్మితో కలిÜ పొలం వెళ్లాడు. అంతకుముందే తండ్రి వెంకటేశ్వర్లు బాడుగ అరకతో పొలంలో ఉన్నాడు. ఇంతలో ట్రాక్టర్‌పై వచ్చిన పెదనాన్న మల్లయ్య కుమారులు విత్తనం వేయడాన్ని అడ్డుకున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో తేల్చుకుందామని వాదులాడుకున్నారు. దీంతో వెంకట నర్సయ్య విత్తనం వేసే పనిని వాయిదా వేసుకుని బైక్‌పై చెల్లిని ఎక్కించుకుని ఇంటికి వెళ్లాలని యత్నిస్తుండగా అకస్మాత్తుగా ట్రాక్టర్‌తో బైక్‌ను ఢీకొట్టి వెంకటనర్సయ్య కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా నరికేశారు. తలను మొండెం నుంచి వేరు చేసి దారుణంగా హత్యచేశారు. ఆ వెంటనే అతని చెల్లెలు ఆదిలక్ష్మిపై దాడికి సిద్ధమయ్యారు. దీంతో ఆమె ప్రాణభయంతో తప్పించుకుని పారిపోయింది. అతని తండ్రి వెంకటేశ్వర్లుపై దాడి చేయడంతో ఆయన గాయాలతో తప్పించుకుని పారిపోయాడు.
నలుగురు నిందితులు...
ఈ కేసులో నలుగురు నిందితులు ఉన్నారని ఎస్‌ఐ నారాయణస్వామి తెలిపారు. చప్పిడి మల్లయ్య కుమారులు నరసింహారావు, అంజయ్య, అయ్యప్ప, శంకర్ హత్యకు పాల్పడ్డారని ఆయన వివరించారు. ఘటనాస్థలిని గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు పరిశీలించారు. హతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం ఏర్పడింది.
ఆస్తి వద్దన్నా వదల్లేదు...
హత్యకు ప్రత్యక్ష సాక్షులైన హతుని తండ్రి వెంకటేశ్వర్లు, సోదరి ఆదిలక్ష్మి సంఘటనను పోలీసులకు వివరించారు. నరసింహారావు తన సోదరుని కళ్లలో కారం చల్లాడని, అంజయ్య వేటకొడవలితో తలపై నరికాడని ఆదిలక్ష్మి వివరించింది. తమ ఇద్దరిపైనా దాడికి దిగగా, తన తండ్రి, తాను తప్పించుకుని పారిపోయామని వివరించింది. ఇంట్లో పిల్లలను స్కూల్లో వదలి పెట్టి సోదరుడు చేనుకు వెళుతుంటే తాను కూడా వస్తానని బండి ఎక్కానని, ఇలా జరుగుతుందని ఊహించలేకపోయామని ఆమె కన్నీటి పర్యంతమైంది. ‘అయ్యా.. మాకీ ఆస్తి వద్దు.. మా తమ్ముడిని వదిలేయండని వేడుకున్నా వారు వినలేదని ఆదిలక్ష్మి బోరున విలపించింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి సైదమ్మ, వెంకటేశ్వర్లు దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వెంకటనర్సయ్యకు భార్య సౌజన్య, కుమారుడు తనయ్ ఉన్నారు. సౌజన్య గర్భిణి.
ఈ పొలం విషయంలో ఇది రెండో హత్య...
ఈ పొలం వివాదం నేపథ్యంలో గతంలోనూ ఒక హత్య జరిగినట్లు తెలిసింది. తొమ్మిదేళ్ల క్రితం ఇదే పొలాన్ని చిన్నాన్న వెంకటేశ్వర్లు వద్ద కౌలుకు తీసుకుని మల్లయ్య కుమారుల్లో ఒకరైన చప్పిడి పాలయ్య సేద్యం చేస్తుండగా అప్పట్లో రేగిన వివాదం నేపథ్యంలో అతని కుటుంబ సభ్యుల్లోనే ఒకరు హత్యకు పాల్పడినట్లు సమాచారం.
Advertisement
Advertisement