వేర్వేరుగానే టెట్, డీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లను వేర్వేరుగానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) 2010, 2011 సంవత్సరాల్లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించనుంది. ఉపాధ్యాయ విద్యా కోర్సుల చివరి సంవత్సరం (ఫైనలియర్) విద్యార్థులకు టెట్ రాసే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇప్పటికే ప్రకటించిన టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టవచ్చా, లేదా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌కు సర్కారు లేఖ రాసింది.
ఈసీ నుంచి రెండు మూడు రోజుల్లో సానుకూల వివరణ వస్తే... వెంటనే దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా టెట్, డీఎస్సీలను కలిపి ఒకే పరీక్షగా (ఉపాధ్యాయ అర ్హత, నియామక పరీక్ష-టెర్ట్) నిర్వహించాలన్న డిమాండ్ నేపథ్యంలో దాని సాధ్యాసాధ్యాలపై చర్చించి.. పలు నిర్ణయాలు తీసుకున్నారు.
వేసవి సెలవుల్లోనే డీఎస్సీ
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులకే పరిమితం చేయడంతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు వారు మాత్రమే అర్హులని ఎన్‌సీటీఈ 2010లోనే స్పష్టం చేసింది. ఇక బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే అర్హులని పేర్కొంది. కాబట్టి టెట్‌లో డీఎడ్ అభ్యర్థులు పేపర్-1, బీఎడ్ అభ్యర్థులు పేపర్-2 రాసి, అర్హత సాధించాలని స్పష్టం చేసింది. ఈ అర్హత సర్టిఫికెట్‌కు ఏడేళ్ల చెల్లుబాటు సమయం (వ్యాలిడిటీ) ఉండాలని, ప్రైవేటు పాఠశాలల్లో బోధించేందుకూ టెట్‌లో అర్హత సాధించి ఉండాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో అవసరాల మేరకు ఎప్పుడో ఒకసారి నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షకు, టెట్‌కు సంబంధం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. టీచర్ పోస్టుల నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీని కొనసాగించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాగానే టెట్ దరఖాస్తులకు చర్యలు చేపట్టనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను వచ్చే ఏప్రిల్ నెలాఖరు(వేసవి సెలవులు)లో జారీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు విద్యాశాఖ జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరిస్తోంది. అవి రాగానే ప్రభుత్వ ఆమోదం కోసం ఫైలు పంపించనుంది.