- 50 శాతం పింఛన్ పెంచాలని డిమాండ్
రిటైర్డ్ కార్మికుల రాస్తారోకో
Published Sat, Aug 27 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
బెల్లంపల్లి : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమకు 50 శాతం పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం బెల్లంపల్లిలో సింగరేణి రిటైర్డ్ కార్మికులు రాస్తారోకో చేశారు. భారతీయ జనతా మజ్దూర్ మోర్చా, తెలంగాణ సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాంటాచౌరస్తాలోని తెలంగాణ దీక్షా శిబిరం వద్ద నుంచి ఎస్‌బీహెచ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టు వద్ద వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం బజార్‌ఏరియా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 18 ఏళ్ల నుంచి రిటైర్డ్ కార్మికులకు పింఛన్ పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకుతుండగా పింఛన్ మాత్రం ఒక్క శాతం కూడా పెంచడం లేదన్నారు. చాలీచాలని పింఛన్‌తో కుటుంబాలను పోషించుకోవడం దుర్భరంగా మారిందన్నారు. అర్థాకలితో పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. ఆత్మహత్యలు, ఆకలి చావులకు గురవుతున్నా సింగరేణి యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల పట్టించుకోవడం లేదని విమర్శించారు. పదో వేజ్‌బోర్డులో రిటైర్డ్ కార్మికులకు 50 శాతం పింఛన్ పెంచి, రూ.10 లక్షల గ్రాట్యూటీ సీలింగ్‌ను ఎత్తివేయాలని, బొగ్గు గనులలో ప్రైవేట్ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని, వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించి డిపెండెంట్లకు ఉద్యోగవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పింఛన్ పెంపుదలకు జాతీయ కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి రిటైర్డ్‌మెంట్ కార్మిక సంఘం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు జి.వెంకటయ్య, భారతీయ జనతా మజ్దూర్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్.లింగయ్య, నాయకులు ఎల్.రాజమల్లు, డి.రాజలింగు, ఎస్.భూమయ్య, ఎన్.రాజకొమురయ్య, అంజయ్య, బి.కిష్టయ్య, ఎ.డానయ్య, జ్యోతిప్రకాశ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement