చిన్న వయసులోనే పెద్ద కష్టం
-
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
-
వీధిన పడిన కుటుంబం
జనగామ రూరల్ : 25 ఏళ్లకే నూరేళ్లు నిండాయి ఈ రైతుకు. తల్లిదండ్రుల నుంచి తనకు వచ్చిన రెండెకరాల్లో సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఎర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన కొత్తపల్లి భాస్కర్(25) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు రెండెకరాల భూమి తో పాటు ఉమ్మడి కుటుంబంలో చేసిన అప్పులో భాస్కర్ వాటాకు వచ్చిన రూ.3 లక్షల అప్పు కూడా ఉంది. అయితే రెండేళ్లుగా సరైన దిగుబడి లేక, అప్పు తీర్చే మార్గం లేక మనో వేదనకు గురవుతున్నాడు. వ్యవసాయం కాకుండా వేరే పని చేసుకుందామని కొన్ని రోజుల క్రితం కుటుంబంతో జనగామ వస్తే అక్కడా భం గపాటే ఎదురైంది. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. రెండేళ్ల క్రితమే పెళ్లయిన భాస్కర్‌కు భార్య మహాలక్ష్మి, ఆరునెలల కూతురు ఉన్నారు. ఇప్పుడు వారిద్దరూ వీధిన పడే పరిస్థితి ఏర్పడింది.