పోలీసులకు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఫిర్యాదు
సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు
కేసు నమోదు చేస్తామంటున్న పోలీసులు
అనకాపల్లి: అనకాపల్లి పరిధి బీజేపీ శ్రేణుల్లో అంతర్గత విబేధాలు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ ఎదుట బహిర్గతమైన సంగతి విదితమే. ప్రధాని మోదీ మూడేళ్ల పాలనపై సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో అనకాపల్లిలో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీలో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. తమకు గౌరవమివ్వలేదంటూ జిల్లా బీజేపీ ఇన్‌చార్జి మళ్ల వెంకటరావు సిద్ధార్థనాథ్‌సింగ్ ఎదుట ఆదివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న పార్టీ ఫ్లెక్సీలను చించివేయడం ఆ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అనకాపల్లి పట్టణంలోని సుంకరమెట్ట జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని సోమవారం తెల్లవారుజామున 2–02గంటల సమయంలో చించివేస్తున్నట్టు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు సాక్షికి లభించాయి.
4 ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారంటూ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కోలపర్తి శ్రీనుతోపాటు పలువురు అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన అనకాపల్లి పోలీసులకు కీలకమైన సాక్ష్యాలు లభించాయి. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన ఒక నేతతో అనకాపల్లి పోలీసులు మాట్లాడినట్టు సమాచారం. కాగా ఆ పార్టీకి చెందిన ఒక కీలకనేత సహకారంతోనే ఫ్లెక్సీలను చించివేశారని అనకాపల్లిలోని మరో వర్గం ఆరోపిస్తోంది. ఈ ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, మంగళవారం ఆందోళన చేపడతామని బీజేపీలోని మరొక వర్గం పేర్కొంది. ఫిర్యాదు మేరకు సీసీ కెమెరా దృశ్యాలను సేకరించగా కారులో నుంచి ఒక వ్యక్తి దిగి ఫ్లెక్సీలను చించివేస్తున్నట్టుగా నమోదైందని, కోర్టు అనుమతిని కోరామని, ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పట్టణ సీఐ విద్యాసాగర్ తెలిపారు.
బీజేపీ ఫ్లెక్సీలు ధ్వంసం
Published Wed, Jun 14 2017 12:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement