దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు
ఖమ్మం సిటీ : ఇల్లెందు ఏరియాలో పోడు భూముల్లో పంటల విధ్వంసం, ఆదివాసీలపై పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. తొలుత ఆ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలు దేరి బైపాస్ రోడ్డు వరకు చేరుకుని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కెచ్చెల రంగయ్య మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో ఆదివాసీల పంటలను ధ్వంసం చేస్తోందని విమర్శించారు. అడ్డు వచ్చిన మహిళలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి వారికి పట్టాలివ్వాలని ప్రభుత్నాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య పాల్గొన్నారు.