ఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న దసరా వేడుకల్లో దిష్టిబొమ్మలకు సనాతన ధర్మ వ్యతిరేకులపై పోస్టర్లు వెలిశాయి. 'సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్లు నశించిపోతారు', 'సనాతన ధర్మ విమర్శకులు అంతరించిపోతారు' అని పేర్కొన్న పోస్టర్లను దిష్టిబొమ్మలకు అంటించారు. కానీ వేడుకల ప్రారంభానికి ముందే వాటన్నింటిని తొలగించారు.
కాగా ఈ ఏడాది ఎర్రకోటలో జరుగుతున్న దసరా ఉత్సవాలకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా హాజరుకానున్నారు. 50 ఏళ్లుగా జరుగుతున్న ఎర్రకోట ఉత్సవాల చరిత్రలో తొలిసారి ఓ మహిళ కంగనా రనౌత్ ఈ సారి దిష్టిబొమ్మను దహనం చేయనుంది.
ఎర్రకోట వద్ద జరుగుతున్న ఉత్సవాల్లో రావణ, కుంభకర్ణ, మేఘనాథ్ ల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. రావణ దహనం పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం దసరా వేడుకల్లో ఓ సాంప్రదాయంగా వస్తోంది. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ వేడుకలను జరుపుతున్నారు.
సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణించింది.
ఇదీ చదవండి: మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..!
Comments
Please login to add a commentAdd a comment