
ట్రాక్టర్ కింద పడి యువకుడి మృతి
గుంతకల్లు రూరల్: కుటుంబ పోషణలో తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచిన కుమారుడు తండ్రి కళ్లముందే ట్రాక్టర్ కింద పడి మృతిచెందిన ఘటన సోమవారం మండలంలోని మొలకలపెంట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఘటనలో రాయలచెరువు కు చెందిన రామాంజనేయులు(18) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు..
రాయల చెరువుకు చెందిన కిష్టప్ప ఫైనాన్స్‌లో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి బాడుగలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కిష్టప్ప పెద్దకుమారుడు రామాంజనేయులు ఎనిమిదో తరగతితో చదువు మానేసి తండ్రితో పాటు ట్రాక్టర్ పనులకు వెళ్లేవాడు. గుంతకల్లులో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి ఇసుకను తోలే క్రమంలో కిష్టప్ప, అతడి కుమారుడు రామాంజనేయులు ఇద్దరూ సోమవారం గుంతకల్లుకు వచ్చారు. సోమవారం సాయంత్రం ఇసుకను అన్‌లోడ్ చేసిన తండ్రీ కొడుకులు మొలకలపెంట, అమీన్‌పల్లి మీదుగా రాయలచెరువుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో మొలకలపెంట, అమీన్‌పల్లి గ్రామాల మధ్యలో ఉన్న గతుకుల రోడ్డు కారణంగా కుదుపులు ఏర్పడి డ్రైవింగ్ చేస్తున్న కిష్టప్ప పక్కనే కూర్చున్న రామాంజనేయులు అదుపు తప్పి కిందపడిపోయాడు.
కొడుకు ట్రాక్టర్‌నుండి కిందకు పడిపోవడంతో కిష్టప్ప ట్రాక్టర్‌ను వదిలి కొడుకును కాపాడే ప్రయత్నంలో కిందకు దూకేశాడు. అదే సమయంలో ట్రాక్టర్ రామాంజనేయులు మీదుగా వెళ్లిపోవడంతో అతడు తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గాయపడిన యువకుడు రామాంజనేయులును 108 వాహనంలో గుంతకల్లు ప్రభుత్వ ఆసుçపత్రికి తరలించాగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కసాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.