కలకలం రేపిన బాలిక కిడ్నాప్‌ | Girl Kidnap And Found Anantapur | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన బాలిక కిడ్నాప్‌

Published Wed, Aug 14 2019 7:56 AM | Last Updated on Wed, Aug 14 2019 7:57 AM

Girl Kidnap And Found Anantapur - Sakshi

వివరాలు తెలియజేస్తున్న బాలిక తల్లి ఆరోగ్యమేరీ     

సాక్షి, గుంతకల్లు : గుంతకల్లు పట్టణంలో బాలిక కిడ్నాప్‌ కలకలం రేపింది. అరగంటలోనే తిరిగి బాలిక ప్రత్యక్షం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలిక తల్లి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఆచారమ్మ కొట్టాల ఏరియాకు చెందిన ఆరోగ్యమేరీ, శాంతరాజ్‌ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె ఎం.అఖిలమేరీ సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతోంది. తల్లి స్కూల్‌ ఆవరణలో ఉన్న మదర్‌థెరిస్సా చారిటబుల్‌ ట్రస్ట్‌లో ఆయాగానూ, తండ్రి రైల్వే హాస్పిటల్‌ క్యాంటీన్‌లోను పనిచేస్తున్నారు. రోజుమాదిరిగానే వారిద్దరూ మంగళవారం ఉదయాన్నే పనులకు వెళ్లిపోయారు. అఖిల మేరీ ఉదయం 8 గంటలకు స్కూల్‌ వెళ్లింది. హెల్మెట్, మాస్క్‌ ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అఖిలమేరీని మధ్యలో కూర్చోపెట్టుకుని, నోటికి గుడ్డ అడ్డంగా పెట్టి పోర్టర్స్‌లైన్, ధర్మవరం గేట్, బీరప్పగుడి సర్కిల్‌ మీదుగా చిప్పగిరి బ్రిడ్జి వరకు తీసుకెళ్లారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చిప్పగిరి బ్రిడ్జి వద్ద వదిలిపెట్టి పరారయ్యారు.

ఉపాధ్యాయుడు గుర్తించి.. బాలికను చేరదీసి 
బెల్డోనాలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహహ్మద్‌ రఫీ ఉదయం 8:30 గంటల సమయంలో ఆటోలో స్కూల్‌కు వెళ్తున్నాడు. ఒంటరిగా రోదిస్తున్న బాలిక అఖిలమేరీని గమనించాడు. ఆటో దిగి ఆ పాప ఆచూకీ, ఇతర వివరాలను ఆరాతీశారు. వెంటనే ఆ పాపను ఆటోలో ఎక్కించుకుని తనతో పాటు స్కూల్‌కు తీసుకెళ్లాడు. బాలిక మెడలోని స్కూల్‌ ఐడీ కార్డు ఆధారంగా బాలిక తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేశాడు. దీంతో స్కూల్‌కు వచ్చిన తల్లిదండ్రులకు బాలికను అప్పగించి విషయాన్ని గుంతకల్లు వన్‌టౌన్‌ పోలీసులకు తెలియజేశారు.

పొంతన సమాధానాలు 
వన్‌టౌన్‌ సీఐ ఉమామహేశ్వరరెడ్డి ఆ బాలికను వెంటపెట్టుకుని కిడ్నాపర్లు బైక్‌ మీద తిప్పిన పరిసరాలను పరిశీలించారు. అయితే ఆ బాలిక మొదట ఆలూరు పక్కనున్న తన అమ్మమ్మ గ్రామానికి వెళ్తున్నానని ఓసారి, కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారని మరోసారి పొంతన లేకుండా చెప్పడంతో కిడ్నాప్‌ జరిగిందా లేక తల్లిదండ్రులేమైనా మందలించి ఉంటే తనే అమ్మమ్మ దగ్గరకు వెళ్లడానికి ఈ విధంగా చెబుతోందా అనే కోణంలో విచారించారు. అయితే ఇప్పటివరకు బాలిక తల్లిదండ్రుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని, ప్రాథమికంగా తమకు అందిన సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం గాలించామని సీఐ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement