డ్రైవర్ ఉసురు తీసిన నిద్రమత్తు
కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా) : వేగంగా వస్తున్న కారు.. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి తాటి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ సీటులో ఉన్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా వెనుక సీట్లో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఒంగోలు– గిద్దలూరు రహదారి కొనకనమిట్ల మండలం చినమనగుండం సమీపంలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా కడప నగరం వైవీ స్ట్రీట్‌కు చెందిన మార్కాపురం వెంకట రమణ తన భార్య పద్మావతి, అత్త సావిత్రితో కలిసి ఒంగోలులో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి సొంత కారులో డ్రైవర్‌తో కలిసి బయల్దేరారు. చినమనగుండం సమీపంలోకి వచ్చే సరికి డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న తాటి చెట్టును బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ అబ్దుల్ (24)కు స్టీరింగ్ గుద్దుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కారు వెనుక సీట్లో కూర్చొని ఉన్న వెంకట రమణ, ఆయన భార్య పద్మావతి, అత్త సావిత్రి తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురికి కాళ్లూ, చేతులు విరిగాయి. తలకు బలమైన గాయాలయ్యాయి. కారులో చిక్కుకుని బయటకు రాలేక తీవ్రంగా గాయపడిన వెంకటరమణ, పద్మావతి, సావిత్రిలు గంటసేపు హాహాకారాలు చేశారు. స్థానికులు 108 సిబ్బందికి సమాచాం ఇచ్చారు. వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కపోయిన ముగ్గురినీ బయటకు తీసి పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్నఎస్సై బి.బ్రహ్మనాయుడు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.