విద్యా ప్రమాణాల పెంపునకు కృషి | The effort to increase education standards in public schools | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాల పెంపునకు కృషి

Published Wed, Jul 12 2017 4:55 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

విద్యా ప్రమాణాల పెంపునకు కృషి - Sakshi

విద్యా ప్రమాణాల పెంపునకు కృషి

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
నకిరేకల్‌లో అట్టహాసంగా ‘ఉద్దీపన’
ప్రారంభోత్సవం  రాష్ట్రంలోనే విద్యలో ఆదర్శం


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు  కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.  నకిరేకల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 115 పాఠశాలల్లో చేపట్టిన ఉద్దీపన కార్యక్రమాన్ని మంత్రి మంగళవారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసు కుంటున్నామని, ఇందులో భాగంగా ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు.
నకిరేకల్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ పాఠశాలల బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. గ్రామీణ నిరుపేద పిల్ల లకు సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు, విద్యా ప్రమాణాల పెంపు కోసం ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. నకిరేకల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 115 ప్రాథమిక పాఠశశాలల్లో చేపట్టిన ఉద్దీపన కార్యక్రమాన్ని ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఉద్దీపన ప్రచార బ్రోచర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఉద్దీపన సదస్సులో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అందరూ సమిష్టిగా కాపాడుకుంటే సత్ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పాలకులమైన తాము కూడా ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలన్నారు. ప్రత్యేకించి నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయం అన్నారు.

సమాజంలో అసమానతలు, పేదరికం,అస్పష్టత చూసిన ఆయన అందరికీ నాణ్యమైన విద్య అందాలని విద్యా ద్వారానే సకల సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆలోచనలతో ఎమ్మెల్యే వీరేశం తన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి పూనుకోవడం సంతోషదాయకం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాలు కూడా విద్య ప్రమాణాల పెంపు విషయంలో నకిరేకల్‌ వైపు దృష్టి సారించనున్నారని తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా కేజీ టు పీజీ అమలు చేస్తామని చెప్పిన విధంగానే నేడు తెలంగాణ వ్యాప్తంగా గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలలను పెద్ద ఎత్తున ప్రారంభించామన్నారు. వీటితో పాటు కస్తూర్భా, జూనియర్, డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాలలు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలను కలుపుకుని మొత్తం 525 పాఠశాలలు, కళాశాలలను తెలంగాణ వచ్చాక ప్రారంభించామని వివరించారు.
తెలంగాణ శాసన మండలి చీఫ్‌విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు చిత్తశుద్ధి, బాధ్యతతో పని చేసి విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ విద్యా, వైద్యం మనిషికి రెండు కళ్లు వంటివన్నారు. తెలంగాణ ప్రస్తుతం అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా ఉందని, టీచింగ్‌లో కూడా నంబర్‌వన్‌లో ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యావ్యవస్థలో మంచి మార్కులు వస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలు విద్యకు దూరమవుతున్నారన్నారు. ఆ పరిస్థితిని చూసి ఇంగ్లీష్‌ విద్య తప్పనిసరిగా భావించి ప్రభుత్వ పాఠశాలలను బతికించుకునేందుకు ఈ ఉద్దీపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని తెలిపారు.

గత ఏడాది నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల్లో అమలు చేశామని, అక్కడ మంచి ఫలితాలు రావడంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో 115 పాఠశాలల్లో ఇంగ్లీష్‌ బోధనను ప్రారంభించామన్నారు. 120 మంది వాలంటీర్లను 10 మం ది కేరళ టీచర్లను కూడా సమకూర్చి ఇంగ్లీష్‌ విద్యను అందిస్తున్నామన్నారు. ఉద్దీపన అమలు కోసం వేముల ఫౌండేషన్‌ నుంచి రూ.25 లక్షల చెక్కును మంత్రి సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ చంద్రమోహన్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య, రాజేంద్రనగర్‌ ఈటీసీ సీనియర్‌ ఫ్యాకల్టీ బి.రాఘవేంద్రరావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్, డైట్‌ లెక్చరర్‌ మంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మొగిలి సుజాత, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, లింగాల మల్లీశ్వరి, గుత్తా మంజుల, బట్టు అరుణ, కొండ లింగస్వామి, మాద యాదగిరి, పెండెం ధనలక్ష్మి సదా నందం, శేపూరి రవీందర్, స్థానిక సర్పంచ్‌ పన్నాల రంగ మ్మ రాఘవరెడ్డి, ఉపసర్పంచ్‌ మంగినపల్లి రాజు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బాణాల రాంరెడ్డి, ఎస్‌.వెంకటేశ్వరరావు, తిరుమలయ్య, నర్సయ్య, ఎంపీడీఓలు, ఎంఈఓలు తదితరులు ఉన్నారు.

ఉపాధ్యాయుడైన మంత్రి కడియం
నార్కట్‌పల్లి (నకిరేకల్‌) : ప్రజాప్రతినిధులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులందరూ సమిష్టిగా కృషి చేస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచొచ్చని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితో పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం కొనసాగుతున్న విధానాన్ని, మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు ఇంగ్లీష్‌ బోధన చేసి విద్యార్థుల చదువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్‌లో పాఠాలు బోధించి అంగన్‌వాడీ టీచర్‌ ఎం.మౌనికను విద్యార్థులకు బోధించిన పాఠాల గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు యూనిఫామ్‌ వేసుకునే విధానం, పాఠశాలలో గతంలో 60 మంది విద్యార్థుల సంఖ్య నుంచి ఈ సంవత్సరంలో 110 మందికి పెంచడంలో ఉపాధ్యాయుల చేసిన కృషి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి మౌలిక వసతులు పరిశీలించారు. అనంతరం ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెం పాఠశాలలో అదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాలని కోరగా, తక్షణమే సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో రెండు గదులు మంజూరు చేయాలని డీఈఓకు సూచించారు. కార్యక్రమంలో జేసీ నారాయణరెడ్డి, ఆర్డీఓ వెంకటాచారి, డీఈఓ చంద్రమోహన్, సర్పంచ్‌ సునీతధర్మయ్య, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీడీఓ గుర్రం సురేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భానుప్రసాద్, వీఆర్‌ఓ ముబిన్, గుత్తా నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement