అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణా రెడ్డి (55) అనే రైతు అప్పుల బాధతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకటరమణారెడ్డి తన తల్లి వెంకటమ్మ పేరున ఉన్న ఎకరా పొలంలో బోరు వేయించి.. మోటారు అమర్చాడు. కొద్ది రోజులకే బోరు ఎండిపోయింది.
అదే గ్రామానికి చెందిన తిరుపాల్‌రెడ్డి, శ్రీరామరెడ్డి, రామిరెడ్డి పొలాలను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసేవాడు. నాలుగేళ్లుగా పంటలు చేతికందలేదు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. ప్రై వేటు వ్యక్తుల వద్ద రూ.7 లక్షల వరకు అప్పులు చేశాడు. బ్యాంకు రుణాలేవీ లేవు. రుణదాతల ఒత్తిళ్లు పెరగడంతో బుధవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటరమణారెడ్డికి భార్య నీలమ్మ, కుమారుడు రాజవర్ధన్‌రెడ్డి ఉన్నారు. రైతు కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి పరామర్శించారు.