వాయుగండం..
♦ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రెండో రోజూ భారీ వర్షాలు
♦ తిరుమలలో 30 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం
♦ చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు గల్లంతు
♦ చలి తీవ్రతకు ముగ్గురి బలి .. తమిళనాడులో 22 మంది మృతి
సాక్షి నెట్‌వర్క్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో సోమవారం మొదలైన వర్షాలు మంగళవారం ఉధృతరూపం దాల్చా యి. తిరుమలలో రికార్డుస్థాయిలో 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో వాగులు, వంక లు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. వర్షాల ధాటికి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరి, వేరుశనగ, టమాట, అరటి, బొప్పాయి వంటి పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో అపారమైన నష్టం సంభవించింది. జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. చలి తీవ్రతకు తట్టుకోలేక నెల్లూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అన్నంగారి పల్లె చిన్నతోపునకు చెందిన మంచూరి వెంకటస్వామి(55), ఆయన కుమార్తె రజిత(15) గార్గేయ వాగులో కొట్టుకుపోయారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో గుండ్లకండ్రిగ దగ్గర కార్తీక్ అనే చిన్నారి నీటిలో కొట్టుకుపోయాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండ లం దగ్గవోలు సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ పోలంరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి(33) కందలవారిపల్లి వాగులో కొట్టుకుపోయాడు. కలువాయి మండలం లలితానగర్ వద్ద వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు తమిళనాడులో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 50వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. 500 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
తిరుమల రెండో ఘాట్ ధ్వంసం
వర్షాలకు తిరుమల రెండో ఘాట్‌రోడ్డు ధ్వంసమైంది. 7 నుంచి 16వ కిలోమీటర్ మార్గం లో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి వందకుపైగా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై అడ్డంగా భారీగా రాళ్లు పడ్డాయి. పది మీటర్ల ఎత్తులో రాళ్లు కూలిపోవడంతో పైభాగంలో ఉండే రోడ్డు కూడా కూలే పరిస్థితి నెలకొంది. రెండో ఘాట్‌లో 13వ కిలోమీటర్ నుంచి లింకురోడ్డు మీదుగా తిరుమలకు వెళ్లేదారిని రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి రాత్రి 11 నుంచి ఉదయం 4 గంటల వరకు లేదా అరగంట ఇటూఅటుగా మూసివేసే అధికారాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులకు కల్పించారు.