మానవతావాదానికి నిదర్శనం లవణం
మానవతావాదానికి నిదర్శనం లవణం
Published Sun, Aug 14 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
జోగిని దురాచారాన్ని నిర్మూలించారు
వర్ని : సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలు, జోగిని దురాచారాన్ని రూపుమాపడానికి జీవితాన్ని త్యాగం చేసిన లవణం, హేమలతలు మానవతావాదులని, వారు చేపట్టిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సంఘ సంస్కర్త లవణం ప్రథమ వర్ధంతిని ఆదివారం అంబం శివారులోని సంస్కార్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే సంస్కార్ ప్లాన్ స్థిరాస్తులను మంత్రి సమక్షంలో బోధన్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డికి సంస్కార్ ప్రతినిధులు సుందరం, సుబ్రహ్మణ్యం అందచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన లవణం– హేమలత స్మారక సభలో మంత్రి పోచారం మాట్లాడారు. నాడు సమాజంలో సవాలుగా మారిన జోగిని దురాచారాన్ని లవణం, హేమలత దంపతులు రూపుమాపారన్నారు. ప్రభుత్వ సహకారం ఆశించకుండానే ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేపట్టారంటూ కొనియాడారు. ప్రజల్లో సామాజిక స్పృహ కలిగించడానికి, సంస్కరించడానికి, పేదలకు అండగా నిలువడానికి కృషి చేశారన్నారు. గ్రామాలను దత్తత తీసుకుని విద్య ప్రాధాన్యతను తెలియ చేసి, పాఠశాలలు ఏర్పాటు చేశారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అడిషనల్ టీచర్లను ఇచ్చారని, వైద్య సేవలు అందించారని, సాగు నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సహకారాన్ని అందించారని గుర్తు చేశారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతికి సంస్కార్ ప్లాన్ ద్వారా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంస్కార్ ప్లాన్ స్వచ్ఛంద సంస్థ అందించిన కోట్ల రూపాయల విలువ చేసే ప్రాంతానికి హేమలత, లవణం నామకరణం చేస్తామని, వారి విగ్రహాలను ఏర్పాటు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో పేదల సంక్షేమం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తామని, పేద పిల్లల కోసం విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. లవణం చేపట్టిన సంస్కార కార్యక్రమాల గురించి సంస్కార్ ప్లాన్ ప్రతినిధులు సుందర్, సుబ్రహ్మణ్యం వివరించారు. స్టువర్టుపురం దొంగల్లో మార్పు తెచ్చారని, జోగిని వ్యవస్థ నిర్మూలనకు, మూఢనమ్మకాల నివారణకు కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్కార్ ప్లాన్ ప్రతినిధులు సుందర్, సుబ్రహ్మణ్యంలను పోచారం శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. సంస్థ ఆధ్వర్యంలో జోగినులకు తొలి దశ సేవా కార్యక్రమాల్లో సహకారాన్ని అందించిన రామ్మోహన్‌రావ్, జయని నెహ్రూ, వీవీ ప్రసాద్ రావ్, పట్టాభిరామ్, జేవీ సుబ్బారావ్, మార్ని రామకృష్ణారావ్, వర లక్ష్మి, సీతారత్నంలను సంస్కార్‌ప్లాన్ ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ చింగ్లీ బజ్యానాయక్, ఏఎంసీ చైర్మన్ నారోజీ గంగారాం, వైస్ చైర్మన్ మేక వీర్రాజు, ఎస్‌ఎన్‌పురం సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, సంస్కార్ కార్యకర్తలు గణపతి, నవీన్, ఆనంద్, మురళి, రమేశ్, మక్కయ్య, దత్తు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement