ప్రొద్దుటూరు క్రైం: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ, జమ్మలమడుగు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లాలోని బార్ అసోసియేషన్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఉద్యమం చేసే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవాల్సిన అవసరం ఉందన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళితే బాగుంటుందని చెప్పారు. ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్‌వి.భాస్కర్‌రావు మాట్లాడుతూ త్వరలో ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలన్నారు. అమరావతిలో నిర్మాణాలు మొదలు పెడితే తర్వాత ఎన్ని ఉద్యమాలు చేసినా ఉపయోగం ఉండదని కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి పేర్కొన్నారు. పులివెందుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కరుణాకర్, ఇవి.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దసరా అయిపోయిన వెంటనే సీఎంను కలిసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఉద్యమంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బార్ అసోసియేషన్ నాయకులు ముక్తకంఠంతో నినదించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ముడిమెల కొండారెడ్డి, గొర్రె శ్రీనివాసులు, జిలాని బాషా, దాదాపీర్, మల్లేల లక్ష్మీప్రసన్న, ఓబులేసు, కమలాపురం, మైదుకూరు బార్ అసోసియేషన్ల అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఇస్మాయిల్, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
Published Mon, Sep 26 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
Advertisement