గోరక్ష పేరుతో దాడులు హేయమైన చర్య
వినాయక్‌నగర్ :
గోరక్ష పేరుతో దేశంలో జరుగుతున్న దాడులు సభ్య సమాజం తలదించుకునే విదంగా ఉన్నయని, దళితులపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని మాజీ రాజ్యసభ సభ్యులు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా అన్నారు. సెప్టెంబర్ 2న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయడానికి పిలుపు నివ్వడంలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల దృష్ట్యా ప్రధాని మోదీ ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఆ ప్రకటనలు రెండు నెలల క్రితం చేసి ఉంటే దళితులపై దాడులు ఆగేవి కదా..? అని అన్నారు. కశ్మీర్ సమస్య చాల సున్నితమైందని, సమస్యపరిష్కారాన్నిప్రతిష్టాత్మకంగా తీసుకుని వాజ్‌పేయ్ విధానాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య తదితరులు పాల్గొన్నారు.