ప్రమాదం మిగిల్చిన విషాదం
►మృతుల్లో ఒకరు ఎంబీఏ విద్యార్థి
►బోరున విలపించిన సహచర విద్యార్థులు
►మూడు కుటుంబాల్లో ఆవేదనను మిగిల్చిన రోడ్డు ప్రమాదం
►కారులోని వారు పరారీ
కడప అర్బన్ : కమలాపురం మండలం చదిపిరాళ్ల వద్ద గురువారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాల్లో వెళుతున్న నలుగురు యువకులను, కళాశాల బస్సును తప్పించబోయిన కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. మరో యువకుడు ప్రస్తుతం రాయవేలూరుతో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనలో మృత్యువాత పడిన వారంతా స్నేహితులే. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
∙మృతుల్లో కడప రామరాజు పల్లెకు చెందిన పాగాల శ్యాంబాబు (23) ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. కడపలో ఐటీఐ సర్కిల్ సమీపంలో నివసిస్తున్న నాగూరి శివారెడ్డి (22)తో కలిసి మోటార్ బైకులో శ్యాంబాబుతో పాటు వెళ్లి ప్రమాదంలో మృతి చెందాడు.
∙కడప నగరం అంభాభవానీ నగర్‌కు చెందిన మహేష్ (22) తిరుపతి ఎంఎం కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితుడు హరిబాబుతో కలిసి, పై ఇరువురితో పాటు స్నేహితుని వివాహానికి వెళతుండగా ఈ ప్రమాదం జరిగింది. మహేష్ మృతి చెందాడు. హరిబాబును 108లో రిమ్స్‌కు తర్వాత రాయవేలూరుకు తరలించారు. మహేష్ మృతి చెందాడనీ తెలియగానే తిరుపతి నుంచి తోటి విద్యార్థులు రిమ్స్ మార్చురీకి చేరుకున్నారు. బోరున విలపించారు. మహేష్ సోదరుడు హరిశ్చంద్ర ప్రసాద్ తన ఆవేదనను మృతదేహాన్ని స్పృశిస్తూ తెలియజేశాడు.
∙కమలాపురం ఎస్‌ఐ రఫీ రిమ్స్ మార్చురీకి తమ సిబ్బందితో చేరుకుని కేసు నమోదు చేయగా, రిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. రిమ్స్ మార్చురీ వద్ద ముగ్గురి బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.