మరణంలోనూ వీడని స్నేహబంధం
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల దుర్మరణం
రామచంద్రాపురం : రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్ సమీపంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందారు. ఒకరు అక్కడికక్కడే మరణించగా మరొకరు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. తెల్లాపూర్ పంచాయతీ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీకి చెందిన అనురుత్(24) బీటెక్ పూర్తి చేశాడు. కాగా ఆదివారం వినాయక నిమజ్జనం కావడంతో రామచంద్రాపురం పట్టణంలో శ్రీనివాసనగర్‌లో నివాసముండే అతని మిత్రుడు రాజశేఖర్(23)తో కలిసి పట్టణంలో జరుగుతున్న నిమజ్జనం వద్దకు వచ్చారు. అక్కడ మరో మిత్రుడి బైక్ తీసుకుని ఇద్దరు కలిసి బైక్‌పై పటాన్‌చెరు వైపు బయలుదేరారు.
ఈ క్రమంలో ఇక్రిశాట్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కిందపడింది. దాంతో అనురుత్ అక్కడికక్కడే దుర్మరం చెందగా, రాజశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇద్దరు మిత్రులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అనురుత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.