మరణించిన తమలంపూడి సతీష్, కర్రి అభిరామ్
తొస్సిపూడి(తూర్పు గోదావరి) : మృత్యువులోనూ స్నేహ బంధాన్ని వీడలేదు ఆ యువకులు. మంగళవారం ఉదయం స్థానిక సాయితేజ రైస్ మిల్లు ఎదురుగా జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృత్యువాత పడగా, సుమారు 20 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అనపర్తి సీఐ ఎంవీ భాస్కరరావు తెలిపారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రపురం డిపోనకు చెందిన అద్దె బస్సు అనపర్తి నుంచి రామచంద్రపురం వెళుతుండగా సాయితేజ రైస్ మిల్లు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. ముందు వెళుతున్న కొమరిపాలెం దత్తత నాయకుడు, కేపీఆర్ సంస్థల డైరెక్టర్ కొవ్వూరి సత్యనారాయణరెడ్డి కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ఒక్క ఉదుటన ఎగిరి పక్కనే ఉన్న పంట కాలువలో పడింది. దీంతో కారు వెనుక భాగం నుజ్జునుజ్జు కావడమే కాకుండా సత్యనారాయణరెడ్డికి తలకు తీవ్ర గాయమై, చేయి విరిగింది.
అంతటితో ఆగకుండా బస్సు తొస్సిపూడి వైపు వెళుతున్న మరో రెండు ద్విచక్రవాహనాలను బలంగా ఢీకొట్టడంతో ప్యాషన్ బండి పై ఉన్న తొస్సిపూడికి చెందిన కర్రి అభిరామ్(19) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన తమలంపూడి సాయి సతీష్‌కుమార్‌రెడ్డి(18) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సతీష్‌కుమార్‌రెడ్డికి వరుసకు తమ్ముడైన శివ అజయ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే స్కూటీపై వెళుతున్న అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్, శ్రీను, బస్సులో డ్రైవర్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన 108లో అనపర్తి సీహెచ్‌సీకి తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికులలో 15మందికి స్వల్పగాయాలు కావడంతో వారు ఎవరికి వారు దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బిక్కవోలు ఎస్సై వై.గణేష్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మండపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఆయన వెల్లడించారు.
తొస్సిపూడిలో విషాదఛాయలు
చిన్నతనం మంచి స్నేహితులుగా ఉన్న కర్రి అభిరామ్, తమలంపూడి సాయిసతీష్‌కుమార్‌రెడ్డి మృతి చెందారన్న వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. యువకులిద్దరూ ప్రాణ స్నేహితులు పదో తరగతి వరకు పందలపాక ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. అనంతరం అభిరామ్ పాలిటెక్నిక్‌లో చేరగా, సతీష్‌రెడ్డి బిక్కవోలు ప్రజ్ఞ కళాశాలలో ఇంటర్ చదువుకున్నాడు. మంగళవారం సతీష్‌రెడ్డి తన చిన్నాన్న కుమారుడు ఆజయ్‌కుమార్‌రెడ్డి చదువుకుంటున్న బలభద్రపురంలోని ప్రైవేటు పాఠశాల నుంచి అతడికి జ్వరంగా ఉందని, తీసుకువెళ్లాలంటూ ఫోన్ రావడంతో స్నేహితులిద్దరూ అజయ్‌ను తీసుకురావడానికి ప్యాషన్ బైక్ పై వెళ్లి ఇంటికి తీసుకువస్తుండగా మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో ప్రాణ మిత్రులిద్దరూ మృత్యువాత పడగా అజయ్ తలకు తీవ్రగాయమై పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. జులై 7న అభిరామ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కొత్త డ్రెస్ తీయించమని కోరాడని అవే తన బిడ్డ తనతో మాట్లాడిన చివరి మాటలని కర్రి శ్రీనివాస్ గుండెలవిసేలా రోదిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది.
దుఃఖంలోనూ నేత్రదానం
సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే కర్రి శ్రీను తన కుమారుడు మరణించి దుఃఖంలో ఉన్నా మరొకరి చూపుని ప్రసాదించాలన్న సత్సంకల్పంతో తమ కుమారుడు అభిరామ్ నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. మండపేట ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ వైద్యులు కార్నియాను సేకరించారు.
బాధితులను ఆదుకుంటాం
బాధితులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. తొస్సిపూడి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలబారిన పడిన వారిని వైద్య సేవల నిమిత్తం 108లో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి విచ్చేసిన ఆయన క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరిన తమలంపూడి సుతీష్ కుమార్ రెడ్డి(18), తమలంపూడి శివ అజయ్‌కుమార్ రెడ్డి(10)లకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు గాను ఆసుపత్రి వైద్యులకు పలు సూచనలు చేసిన ఆయన అత్యవస వైద్యం నిమిత్తం వారిరువురిని రాజమహేంద్రవరం తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు డ్రైవర్ షారూక్ అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా బస్సును నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారని అన్నారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment