అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
కడప అర్బన్ : తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంబీఏ పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఎంపికైన యువకుడు తన కాలు ప్రమాదానికి గురైందని శిక్షణకు వెళ్లలేదు. ఈనెల 6 వతేదీన రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుళ్ల ప్రిలిమనరీ రాత పరీక్ష జరిగింది. ఆ పరీక్ష రాసి వస్తానని ఇంటినుంచి బయలుదేరి వెళ్లిన యువకుడు కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్‌లో ఓ ఇంటిలో మృతదేహమై కనిపించాడు. సంఘటనపై మృతుని బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన ఎం.సురేంద్ర (26) పిచ్చన్న, బాలనాగమ్మల రెండవ కుమారుడు. ఎంబీఏ వరకు చదువుకుని 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా కూడా ఎంపికయ్యాడు. కాలు ప్రమాదానికి గురైందని శిక్షణకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సదరు మహిళతో సంబంధం లేకుండా చేసుకునేందుకు కొంత మొత్తాన్ని ముట్టజెప్పాలని కూడా పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈనెల 6వ తేది పోలీసు కానిస్టేబుళ్ల ప్రిలిమినరి పరీక్షకు చిత్తూరులో హాజరు కావాలని గత శనివారం తల్లిదండ్రులకు చెప్పి వచ్చాడు. వారం రోజుల తర్వాత ప్రకాశ్‌నగర్‌లోని జయలక్ష్మి అనే మహిళ నివసిస్తున్న ఇంటిలో మృతదేహమై కనిపించాడు. ఈ సంఘటనపై జయలక్ష్మి అనే మహిళ తన తల్లి వెంకటలక్ష్మితో కలిసి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
తన సోదరుడు రవికుమార్ స్నేహితుడు సురేంద్ర అని, తన తండ్రి, తమ్ముడు మరణించిన తర్వాత తమ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని ఈనెల 10వ తేదీ గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో కడపలోని తమ ఇంటికి వచ్చాడని, శుక్రవారం అతను లోపల వేసుకున్న గడియ పగులగొట్టేందుకు ప్రయత్నించామన్నారు. శనివారం పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. మృతదేహాన్ని చిన్నచౌకు సీఐ బి.రామకృష్ణ, ఎస్‌ఐ యోగేంద్రలు తమ సిబ్బందితో మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.