అప్పులు తీర్చేందుకు చోరీలు
కర్నూలు: అప్పులు తీర్చేందుకు చోరీలు చేస్తూ పోలీసుల వలకు చిక్కి ఓ దొంగ కటకటాలపాలయ్యాడు. కర్నూలు శివారులోని చదువులరామయ్య నగర్‌లో నివాసముంటున్న కొమ్ము వంశీని మూడవ పట్టణ పోలీసులు దొంగతనం కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో వ్యసనాలకు బానిసై నేరాల బాట పట్టాడు. చిన్నప్పుడు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడ్డాడు. గౌండ పనిచేస్తూ జీవనం సాగించే వంశీ కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు చోరీలకు పాల్పడేవాడు. ఠాగూర్ నగర్‌కు చెందిన కురువ శ్రీనివాసులు బిర్లాగేట్ దగ్గర శివ మొబైల్స్ నడుపుతున్నాడు. కొమ్ము వంశీ ఫోన్ రిచార్జ్ కోసం శివ మొబైల్స్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించాడు. చోరీ చేసేందుకు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారించుకుని ఈనెల 20వ తేదీన చోరీకి పాల్పడ్డాడు. దుకాణం షెట్టర్‌ను పెకిలించి లోనికి ప్రవేశించి సుమారు రూ.30 వేలు విలువ చేసే 15 సెల్‌ఫోన్లు చోరీ చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఘా వేసి వంశీని అదుపులోకి తీసుకుని కటకటాలకు పంపారు. ఇతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌లను రికవరీ చే సినట్లు సీఐ మధుసూదన్‌రావు తెలిపారు.