గచ్చిబౌలి: ఉన్నత చదువుని మధ్యలో ఆపి.. చోరీల బాట పట్టి కటకటాలపాలయ్యాడు ఓ యువకుడు. ఏడాదిన్నరగా మాదాపూర్ జోన్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి.. ఎట్టకేలకు మియాపూర్ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు గురువారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ డాక్టర్ వినీత్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కడకెళ్ల మండలం విక్రంపురానికి చెందిన బబ్బాడి అభిలాష్(29) నాగపూర్‌లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తూ మధ్యలో ఆపేశాడు. ఈజీ మనీకి అలవాటు పడి.. విలాసవంతమైన జీవితం కోసం చోరీలు చేయాలనుకున్నాడు. ఈక్రమంలో రెండేళ్ల నుంచి కేపీహెచ్‌బీలోని హెచ్‌ఎంటీ హిల్స్‌లో ఉంటున్నాడు.
దాదాపు 20 కేసుల్లో నిందితుడు
అభిలాష్‌పై 2022వ సంవత్సరం నుంచి దాదాపు 20 కేసులు ఉన్నాయి. మియాపూర్ పీఎస్ పరిధిలో 7 చోరీలు, చందానగర్ పీఎస్ పరిధిలో 7, గచ్చిబౌలి పీఎస్ పరిధిలో 4, కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో 2 చోరీలు చేసినట్టు డీసీపీ తెలిపారు.
నిందితుడి నుంచి రూ.16 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి వస్తువులు, చోరీలకు ఉపయోగించే స్టీల్ బోల్ట్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా చోరీ చేసి సొత్తును జై సింగ్ అనే వ్యక్తికి అమ్ముతున్నాడని, అతనిపైనా కేసు నమోదు చేస్తామని డీసీపీ వినీత్ తెలిపారు.
రెక్కీ నిర్వహించి చోరీలు
డెలివరీ బాయ్ అని చెబుతూ సెక్యూరిటీ లేని అపార్ట్‌మెంట్లకు వెళ్లి తాళం వేసి ఉన్న ఫ్లాట్లను పరిశీలిస్తాడు అభిలాష్. తాళం వేసి ఉన్న ఫ్లాట్, సెంట్రల్ లాక్ లేని ఇళ్లే ఇతని టార్గెట్. వెంట తెచ్చు కున్న స్టీల్ కట్టర్‌తో ఇంటికున్న తాళం తొలగించి లోపలికి దూరి తన పని పూర్తి చేస్తాడు. చోరీల కోసం గతంలో ఎర్రగడ్డలో స్టీల్ స్టోన్ కట్టర్ కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు.
దీని ద్వారా తాళం కట్ చేసినా పెద్దగా శబ్ధం రాదన్నారు. దాదాపు 20 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అభిలాష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ చెప్పారు. సమావేశంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ ఎన్.నర్సింహారెడ్డి, మియాపూర్ ఏసీపీ నర్సింహ్మారావు, సీఐ ప్రేమ్‌కుమార్, డీఐ కాంతారెడ్డి, డీఎస్సై మల్సూర్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment