
సోమేశ్వరాలయంలో చోరీ
కడప అర్బన్ : కడప నగర పరిధిలోని దేవుని కడప సోమేశ్వరాలయంలో శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనపై ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శ్రీధర్, స్థానిక ప్రజల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని దేవుని కడప సోమేశ్వరాలయంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. కార్తీక మాసం కావడంతో అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలోకి కటాంజనం గడియ పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించినట్లుగా తెలుసుస్తోంది. ఆలయంలో నంది విగ్రహం సమీపంలోను, లోపలి భాగంలోనూ రెండు హుండీలను ఏర్పాటు చేశారు. ఆ హుండీలను సైతం పెకలించి, ఆలయం వెనుక భాగానికి తీసుకెళ్లారు. హుండీలకు ఏర్పాటు చేసిన సీళ్లతో కూడిన గడియలను రాడ్లతో పగులగొట్టారు. హుండీల్లో భక్తాదులు సమర్పించిన కానుకలను అపహరించారు. పెండ్లిపత్రికలను చెల్లాచెదురుగా పడేశారు. సమీపంలోనే మద్యం సేవించి తాపీగా తమ పని కానిచ్చేసినట్లుగా తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రామకృష్ణుడు తమ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆలయ ఈఓ శ్రీధర్ మాట్లాడుతూ ఈ ఏడాది జూన్‌లో రెండు హుండీలను లెక్కించామన్నారు. ప్రస్తుతం కార్తీక మాసం పూర్తయిన తర్వాత ఆ హుండీలను లెక్కించాలని అనుకున్నామన్నారు. ఈ హుండీలలో రూ. 40 నుంచి 50 వేల మధ్య నగదు ఉంటుందని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోనే వున్న ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ రెండు సంఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.