మల్కన్‌గిరి నుంచి సాక్షి ప్రత్యేక బృందం: కూంబింగ్‌కు వెళ్లిన పోలీసు బలగాలకు తారసపడిన మావోయిస్టులను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినప్పటికీ వారు వినకుండా కాల్పులు ప్రారంభించారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు జరపడం వల్ల ఇంతమంది చనిపోయారని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ చెప్పారు. మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారు కాకుండా మరికొందరు తీవ్రంగా గాయపడి తప్పించుకు పారిపోయారని, ఒక్కరు కూడా లొంగిపోలేదని స్పష్టంచేశారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో అగ్రనేతలు ఆర్కే, అరుణలు లేరని చెప్పారు. కాగా కాల్పుల్లో ఆర్కే కుమారుడు మున్నా మృతి చెందినట్లు వెల్లడించారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం మృతదేహాలను 72గంటల పాటు భద్రపరుస్తామని, మృతుల సంబంధీకులు వస్తే అప్పగిస్తామన్నారు. విజయనగరంలో ఉంటున్న మురళీ కుటుంబ సభ్యులు మాత్రమే ఇప్పటికవరకూ తమను ఫోన్‌లో సంప్రదించినట్లు తెలిపారు. మురళీ మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని చెప్పారు.
ఇంకా 11 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. మృతదేహాల్లో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారివేనని చెప్పారు. ఆపరేషన్‌లో పాల్గొన్న ఆంధ్ర, ఒడిశా పోలీసులకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అభినందనలు అందుతున్నాయని, రివార్డులు కూడా వచ్చే అవకాశముందని తెలిపారు.