‘మాయ’ ముఠా తిరుగుతోంది..!
-
తస్మాత్ జాగ్రత్తా..
-
మూడురోజుల్లో మూడు ఘటనలు
జగిత్యాల అర్బన్ : వృద్ధులను ఏదైనా పనిమీద బయటకు పంపిస్తున్నారా..? అయితే వారికి విలువైన వస్తువులు ఇచ్చి వెళ్లనివ్వకండి. ఎందుకంటే వృద్ధులు కనిపిస్తేచాలు వారి ముందు పర్సు లేదా మరేదైనా వస్తువు పడేసి ‘అవి మీవే.. సరిగ్గా చూసుకోండి..’ అంటూ మాటల్లోదింపి మోసం చేసే ముఠా జగిత్యాల ప్రాంతంలో సంచరిస్తోంది. వస్తువును పడేయడమే కాకుండా.. అందులో నకిలీ బంగారంపెట్టి.. దానిని పంచుకుందామంటూ నిజమైన బంగారాన్ని ఎత్తుకెళ్తోంది. ఇలాంటి ఘటనలు మూడురోజుల్లోనే రెండుచోట్ల చోటుచేసుకున్నాయి. ఏడాది క్రితం ఇలాంటి ఘటన మెుదటిసారిగా జగిత్యాలలోనే జరిగింది. ఆ తర్వాత సిరిసిల్లలో కలకలం రేపింది. తాజాగా మంగళవారం మెట్‌పల్లిలోనూ ఇలాంటి ఘటనే జరగడం చర్చనీయాంశమైంది. ఘటనలకు పాల్పడుతున్న ముఠాలో ఓ పురుషుడితోపాటు ఇద్దరు మహిళలు పాల్గొంటున్నట్లు సమాచారం.
వృద్ధులే టార్గెట్
ఈ ముఠా ఎక్కువగా వృద్ధులనే టార్గెట్ చేస్తోంది. పట్టణంలోని ఎల్జీరామ్ లాడ్జి సమీపంలో కొడిమ్యాలకు చెందిన వృద్ధురాలు మ్యాక ఎల్లవ్వ ఆయుర్వేద మందుల కోసం వచ్చింది. ఈమె ముందు ఇద్దరు మహిళలు పర్సును పడేశారు. అనంతరం పర్సు మీదేనా అంటూ మాటల్లో దింపారు. ఇంతలో మరోవ్యక్తి వచ్చి అందులో బంగారు కడ్డీ ఉందని, పంచుకుందామని నమ్మించారు. కడ్డీ ఇచ్చినందుకు తమకు నమ్మకంగా ఏదైనా వస్తువు ఇవ్వాలని మాటల్లో దింపారు. మాయలో పడిన ఎల్లవ్వ మెడలోని పుస్తెలతాడు, కమ్మలను ఇవ్వగా అక్కడినుంచి ఉడాయించారు. ఎల్లవ్వ బంగారంలాంటి కడ్డీని స్వర్ణకారుడి వద్ద చూపించగా నకిలీదని తేల్చడంతో లబోదిబోమంది.
మరో సంఘటనలో మెట్‌పల్లిలోని మఠంవాడకు చెందిన యమగంగు కూరగాయల కొనుగోలుకు సంతకు వెళ్లింది. అక్కడ ఇద్దరు మహిళలు, ఒక మగ వ్యక్తి తారసపడి మాటలు కలిపారు. ఆమె ముందు ఓ వస్తువును పడేసి తనదే అన్నట్లు నమ్మించి మాటల్లో ముంచారు. అది బంగారుకడ్డీ అని, చూసిచెప్పినందుకు తమకూ వాటా ఇవ్వాలని మాయ చేశారు. కడ్డీ 20 తులాలు ఉంటుందని, అది ఉంచుకుని తమకు ఏదైనా ఇవ్వుమని సలహా ఇచ్చారు. దీంతో ఆమె కూడా పుస్తెలతాడు, కమ్మలు ఇచ్చి కడ్డీని స్వర్ణకారుడి వద్దకు వెళ్లి చూపించగా నకిలీదిగా తేల్చడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటన సిరిసిల్లలోనూ జరిగినట్లు సమాచారం.
తస్మాత్ జాగ్రత్త
మహిళలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పేర్కొంటున్నారు. ఏడాదిక్రితం ఇలాంటి సంఘటనలు కోకోలల్లుగా జరిగాయి. ఓ పురుషుడితోపాటు ఇద్దరు మహిళలు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. జగిత్యాల, మెట్‌పల్లిలో ఇలాంటివే జరగడంతో ముఠా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే మరిన్ని సంఘటనలు అవకాశం ఉంది.
అత్యాశకు పోవద్దు
– కరుణాకర్‌రావు, సీఐ
బంగారు కడ్డీ దొరికిందని నమ్మబలికితే నమ్మవద్దు. మాయముఠా తిరుగుతోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ‘బంగారం వస్తువు దొరికింది. మీ వద్ద ఉంచుకోండి..’ అని చెబితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. వారిని నమ్మవద్దు. మహిళలు, వృద్ధులు అత్యాశకు పోవద్దు. ఏదైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.