ఏపీ, కేరళ, తమిళనాడు,పంజాబ్‌ల్లో పెరుగుతోన్న వృద్ధులు
ఏపీలో 2011లో 50 లక్షల మంది వృద్ధులు
ఇప్పుడు ఆ సంఖ్య 70 లక్షలకు చేరిక
దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం జనాభా వృద్ధి తగ్గుదల
పలు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలో జనాభా వృద్ధి తగ్గుతోంది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ జనాభా వృద్ధి పెరుగుతోంది. 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2024లో పలు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదలను విశ్లేషిస్తూ ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలతో పోల్చితే 2024 అంచనాల మేరకు తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి క్షీణించిందని నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో 2011లో జనాభా వృద్ధి 15% ఉండగా 2024 అంచనాల మేరకు జనాభా వృద్ధి 12 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో 2011 లెక్కల ప్రకారం జనాభా వృద్ధి 27 శాతం ఉండగా 2024 అంచనాల మేరకు అది 29 శాతానికి పెరిగిందని వెల్లడించింది. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఏపీ రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య తక్కువగా పెరుగుతోందని వెల్లడించింది. ఏపీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 50 లక్షలు ఉండగా ఇది మొత్తం జనాభాలో 10.1%గా ఉంది.
2024 అంచనాల మేరకు వృద్ధుల జనాభా 70 లక్షలకు పెరిగింది. ఇది మొత్తం జనాభాలో 12.4%గా ఉంది. అంటే 2011–24 నాటికి వృద్ధుల సంఖ్య 2.3% పెరిగింది. 2011 జనాభాతో పోల్చి చూస్తే 2024 అంచనాల మేరకు కేరళలో 16.5 శాతం, తమిళనాడు 13.6 శాతం, హిమాచల్ ప్రదేశ్ 13.1 శాతం, పంజాబ్ 12.6 శాతం వృద్ధులు పెరిగారు. అతి తక్కువగా వృద్ధుల జనాభా 2024 అంచనా మేరకు బిహార్‌లో 7.7 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 8.1 శాతం, అసోంలో 8.2 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment