విగ్రహాల దొంగలు అరెస్టు
-
-రూ.లక్ష విలువ గల పంచలోహ విగ్రహాలు స్వాధీనం
ఆత్మకూరు(అనుమసముద్రంపేట): ఆలయాల్లో విగ్రహాలు చోరీ చేస్తున్న ఏడుగురు దొంగలను ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు లక్ష రూపాయల విలువైన దేవతా విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని ఆత్మకూరు సీఐ ఖాజావలి తెలిపారు. మంగళవారం ఆత్మకూరులో స్థానిక సీఐ కార్యాలయం ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దొంగలను విలేకరుల ముందుకు తీసుకువచ్చారు. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోని దేవాలయాల్లో గత పది రోజులుగా దొంగతనాలు జరుగుతుండడంతో గస్తీ ముమ్మరం చేశామని, అందిన సమాచారం మేరకు నెల్లూరుపాళెంకు చెందిన పులిచెర్ల నాగేంద్ర, ఆత్మకూరుకు చెందిన పెయ్యల ప్రసాద్, సయ్యద్ అబ్దుల్ అలీ, మహ్మద్ అలీ జిన్నా, షేక్ షాబుద్దీన్, షేక్ ఉమర్, షేక్ జపురుల్లా, ఎస్‌టీ కాలనీకి చెందిన సయ్యద్ సర్ధార్, వరికుంటపాడు మండలం చెన్నంçపల్లికి చెందిన సుందరయ్యలపై నిఘా ఉంచామన్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్‌లో భాగంగా దేపూరు సమీపంలోని వెంకయ్యస్వామి ఆశ్రమం వద్దకు వెళ్లగా ఆలయం సమీపంలో చెట్ల వద్ద నక్కి చోరీ చేసేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులను గుర్తించామన్నారు. వారిలో జపురుల్లా, సర్దార్‌లు పరారయ్యారని మిగిలిన వారిని పట్టుకున్నామని తెలిపారు. వీరిని విచారించగా జూన్ నెల 25న నరసాపురం గ్రామంలోని శ్రీపాకనాటి పతివ్రతమ్మ ఆలయంలో పులిచర్ల నాగేంద్ర, పెంచల ప్రసాద్ తలుపులు పగులగొట్టి అమ్మవారి విగ్రహాలను దొంగలించి తీసుకెళ్లారని తెలిపారు. ఆ విగ్రహాల వివరాలు తెలపడంతో విగ్రహాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.లక్షకు పైగా ఉండవచ్చన్నారు. నిందితులను పట్టుకున్న ఆత్మకూరు ఎస్సై పూర్ణచంద్రరావు, సిబ్బందిని అభినందించారు.