సాక్షి, హైదరాబాద్: బ్యాంకు నుంచి నగదు డ్రా చేసిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టి మళ్లించి ఆ డబ్బుల్ని దొంగిలించే ఓజీ కుప్పం గ్యాంగ్ నగర పోలీసులకు చిక్కింది. హైదరాబాద్ సహా దక్షిణాదిలోని అనేక నగరాలు, పట్టణాల్లో తమ పనికానిచ్చింది. నలుగురున్న ఈ గ్యాంగులో ఇద్దరిని పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.9.4 లక్షల నగదు, నాలుగు బైక్‌లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీ పి. రాధాకిషన్‌రావుతో కలసి గురువారం మీడియాకు వెల్లడించారు.
రైళ్లలో వాహనాలతో సహా వచ్చి..
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఓరన్ థంగల్ గొల్ల కుప్పంను ఓజీ కుప్పంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 20 మంది నేరగాళ్ళు 12 గ్యాంగ్‌లుగా పని చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్లు మినహా సభ్యులు ఒక్కోసారి ఒక్కో గ్యాంగ్‌లో కలిసి ‘పని’కి వెళ్తుంటారు. తెలుగు, తమిళం బాగా, హిందీ ఓ మోస్తరుగా తెలిసిన వీళ్ళు దక్షిణాదినే లక్ష్యంగా చేసుకుంటారు. ఓ నగరం/పట్టణాన్ని టార్గెట్‌గా చేసుకుని వారంతా ఆ ప్రాంతానికి బైక్‌లు తీసుకుని బయల్దేరతారు. లక్ష్యంగా చేసుకున్న ప్రాంతానికి వాహనాలను రైల్వే పార్శిల్ ద్వారా తాము వెళ్లే రైల్లోనే తీసుకువస్తారు. అక్కడకు చేరుకుని లాడ్జిల్లో లేదా శివార్లలో ఇళ్ళు అద్దెకు తీసుకుని బస చేస్తారు. అనంతరం ఓ బ్యాంకుపై దృష్టి సారించి ముగ్గురు వ్యక్తులు బ్యాంకు బయట, మరో వ్యక్తి బ్యాంకులోపల ఉంటారు. అక్కడ నగదు డ్రా చేస్తున్న వ్యక్తులను ప్రధానం వయసు మళ్లిన వారిని లక్ష్యంగా చేసుకుని అతడి కదలికలను ఎప్పటికప్పుడ బయటివారికి దొంగిలించి న సెల్‌ఫోన్ ద్వారా చేరవేస్తుంటాడు.
డబ్బు డ్రా చేసిన వ్యక్తి బయటకొచ్చినప్పటినుంచి ఈ గ్యాంగ్ సమయం కోసం వేచి చూస్తూ అతడిని వెంబడిస్తుంది. ఖాతాదారుడు కనుక కారులో వస్తే తమ వద్ద ఉన్న పంక్చర్ చేసే ఉపకరణంతో టైర్‌కు రంధ్రం చేసి, లేదా కారులో డ్రా చేసిన డబ్బు తీసుకువెళ్ళేప్పుడు యజమానితో పాటు డ్రైవర్ కూడా ఉంటే రూ.50, రూ.100 నోట్లు పక్కన పడేయటం ద్వారా అవి మీవే అంటూ తీసుకునేలా చేసి తమ పని పూర్తి చేస్తారు. ఒకవేళ బైక్‌లోని డిక్కీలో నగదు పెడితే పార్క్ చేసేంత వరకు తెలియకుండా వెంటబడతారు. అనంతరం డిక్కీని పగలగొట్టి డబ్బును దొంగిలిస్తారు. ఈ మూడు కాకపోతే వీరి వద్ద దురద పుట్టించే ఓ స్ప్రే సిద్ధంగా ఉంటుంది. ఓ ముఠా సభ్యుడు తమ టార్గెట్ గమనించకుండా అతడి పై దీన్ని స్ప్రే చేసి వెళ్ళిపోతాడు. బాధితుడు ఆ దురదతో ఇబ్బంది పడుతుంటే వెనుక వచ్చే గ్యాంగ్ సభ్యులు సహకరిస్తున్నట్లు నటించి డబ్బు కాజేస్తారు.
300 కెమెరాల ఫీడ్ విశ్లేషించి..
నగరాన్ని టార్గెట్ చేసిన ఈ ముఠా గత నెల, ఈ నెల్లో కలిపి నల్లకుంట, అంబర్‌పేట్, ఫలక్‌నుమ, మీర్‌పేట్ ఠాణాల పరిధుల్లో నాలుగు నేరాలు చేసి రూ.16 లక్షలు ఎత్తుకుపోయారు. ఈ కేసుల్ని ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్‌లతో పాటు గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఫలక్‌నుమ డీఐ కేఎస్ రవి సైతం బృందంగా ఏర్పడ్డారు. వీరు నేరం జరిగిన నాలు ప్రాంతాల్లోని సుమారు 300 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్‌ను సేకరించి విశ్లేషించారు. రెండు వాహనాలపై తిరుగుతున్న నలుగురు వ్యక్తులు ఈ నేరాలు చేశారని, నేరం తర్వాత తమ ముఖాలు కప్పుకుని తప్పించుకుంటున్నారని గుర్తించారు.
సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు తమ వేగుల సాయంతో ఆ నలుగురూ ఓజీ కుప్పం ప్రాంతానికి చెందిన ఆకుల కిరణ్, జి.తులసింధర్, ప్రభుదాస్, శామ్యూల్‌రాజ్‌గా నిర్థారించారు. అనంతరం వీరికోసం ఓజీ కుప్పం వెళ్లారు. దాదాపు 15 రోజుల పాటు అక్కడే ఉండి నిందితులు కిరణ్, తులసింధర్‌లను పట్టుకుని నగరానికి తీసుకొచ్చారు. వీరి నుంచి రూ.9.4లక్షల నగదు, నాలుగు బైక్‌లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నగరంలో నాలుగు నేరాలతో పాటు ఏపీలోని పెనమలూరు, పామర్రు, చిలకలపూడి, కర్ణాటకలోని బీదర్, తుముకూర్‌ల్లోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో 23 కేసుల్లో నిందితుడిగా ఉన్న కిరణ్‌పై మూడు ఎన్‌బీడబ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నాయి. తులసింధర్‌పై గతంలో 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నేరగాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment