ఈ ఏడాదే మొత్తం రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రైతులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం రుణమాఫీ చేస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇప్పటివరకు సగం సొమ్మును బ్యాంకులకు చెల్లించామని.. మిగతా 50 శాతం సొమ్మును ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏకమొత్తంగా బ్యాంకులకు చెల్లిస్తామని వెల్లడించారు. సోమవారం సచివాలయంలో పోచారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు మండలాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కరువు పై ఏర్పాటు చేసిన కమిటీ మండలాల సం ఖ్యను నిర్ధారించిందని, ప్రకటించడమే మిగిలి ఉందని చెప్పారు. రైతులకు న్యాయం జరిగేలా కరువు మండలాల సంఖ్య ఉంటుందని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపు జీవోను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.
త్వరలో విత్తన విధానం
హైదరాబాద్‌లో మంగళవారం జాతీయ విత్తన కాంగ్రెస్ సదస్సు ప్రారంభమవుతోందని... మూడు రోజులపాటు జరిగే ఈ సభలకు దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, అధికారులు, ఆదర్శ రైతులు కలిపి 600 మంది వరకు హాజరవుతారని మంత్రి చెప్పారు. ఈ సదస్సులో విత్తన ఉత్పత్తిదారులు, రైతులతో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశామన్నారు. నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర నూతన విత్తన విధానాన్ని రూపొందిస్తామని మంత్రి తెలిపారు.
ఇప్పటికే సీడ్ విలేజ్ కార్యక్రమం చేపట్టామని... 16,680 యూనిట్లు ఏర్పాటు చేసి 36 వేల హెక్టార్లలో విత్తన ఉత్పత్తి ప్రారంభించామని చెప్పారు. ప్రభుత్వ సూచన మేరకు విత్తనోత్పత్తి కోసం విత్తన కంపెనీలు గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాయన్నారు. బైబ్యాక్ ఒప్పందం చేసుకొని ముందే ధర నిర్ణయించి ఆ ప్రకారం రైతులకు సరైన ధర చెల్లించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. నాణ్యమైన విత్తనాలతోనే పంటల దిగుబడి బాగా వస్తుందన్నారు. 2001లో జాతీయ స్థాయిలో 196.4 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను పండిస్తే... 2014లో 264 మిలియన్ టన్నులు పండించినట్లు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ డిప్యూటీ కమిషనర్ త్రివేది, రాష్ట్ర ఉన్నతాధికారులు పార్థసారథి, ఎం.వీరబ్రహ్మయ్య, ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వాల్సింది రూ. 8,080 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 35.82 లక్షల రైతులకు సంబంధించి రూ. 17 వేల కోట్లు అవుతుందని.. ఈ సొమ్మును నాలుగు వాయిదాలుగా బ్యాంకులకు చెల్లించాలని నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.4,230 కోట్లు విడుదల చేశారు. ఇందులో రూ.4,040 కోట్లను బ్యాంకులు రైతుల ఖాతాల నుంచి మాఫీ చేశాయి. మిగతా సొమ్ము బ్యాంకుల్లోనే ఉంది. ఇక రెండో విడతగా ఈ ఏడాది మరో రూ.4,040 కోట్లు చెల్లించింది. అంటే మొత్తంగా ఇప్పటివరకు రూ.8,080 కోట్లు రుణమాఫీ అయింది. మిగతా రూ.8,080 కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేయాల్సి ఉంది.
మొత్తం వడ్డీతో కలిపి కూడా ఇంతే మొత్తం అవుతుందని, ప్రత్యేకంగా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు మొత్తం రుణం సొమ్ము చెల్లించలేదనే కారణంతో కొన్ని బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఇటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఒకేసారి చెల్లించాలని సర్కారు నిర్ణయించినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రుణమాఫీ పథకంలో దాదాపు రూ.800 కోట్ల మేరకు బోగస్ రైతుల ఖాతాల్లోకి వెళ్లిందని సర్కారు అంచనా వేసింది. దానిపై ఏ చర్యలు తీసుకుంటారనేదానిపై ఇంకా స్పష్టత లేదు.