Minister Pocharam Srinivas
-
నియోజకవర్గానికో వ్యవసాయ పరిశ్రమ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యవసాయ పరిశ్రమను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఖమ్మంలో వ్యవసాయ యాంత్రీకరణ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాధారిత పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఇందుకోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ఈనెల 16న కమిటీ సమావేశం కానుందని పేర్కొన్నారు. వ్యవసాయ ఖర్చు తగ్గించేందుకు యాంత్రీకరణ పథకాన్ని మరింత బలోపేతం చేయనున్నామన్నారు. ప్రతి మండలానికి పది చొప్పున 5,500 ట్రాన్స్‌ప్లాంటేషన్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం రూ.700 కోట్లను వచ్చే బడ్జెట్లో కేటాయించనున్నట్లు చెప్పారు. ఒక్కో ట్రాన్స్‌ప్లాంటేషన్ మిషన్‌కు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు సబ్సిడీ కూడా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.5వేల కోట్లతో నిర్మించే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు 3 పంప్‌హౌస్‌ల పనులు సాగుతున్నాయన్నారు. మార్చి నాటికి అందరికీ ట్రాక్టర్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, బానోత్ మదన్‌లాల్, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
అడిగిన వెంటనే సాగునీరు
పోటో 28బీడీఎన్202ఃఅలీసాగర్ ఎత్తిపోతలపథకం వద్ద మొక్కలు నాటుతున్న మంత్రి 28బీడీఎన్203ఃఅలీసాగర్ నీటిని విడుదలకు స్విచ్ఆన్ చేస్తున్న మంత్రి,ఎమ్మెల్యేలు నవీపేట : రైతుల పంటపొలాలకు సాగునీటిని విడుదల చేయాలని అడిగిన పది గంటల్లోపే ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేశామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రోజుల తరబడి వేచిచూడాల్సి వచ్చేందన్నారు. మండలంలోని కోస్లీ శివారులో గోదావరి నది ఒడ్డున గల అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గురువారం ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌తో కలిసి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటిని వదలాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటే రోజుల సమయం పట్టేదన్నారు. కానీ అలీసాగర్ ద్వారా నీటిని వదలాలని బుధవారం రైతులు కోరగా వెంటనే హైదరాబాద్ వెళ్లి సీఎంతో చర్చించానన్నారు. గోదావరిలో నీరుండడంతో వెంటనే పథకాల ద్వారా నీటిని వదలాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, కలెక్టర్‌తో మాట్లాడి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకంతో నిజామాబాద్, నవీపేట, రెంజల్, ఎడపల్లి, డిచ్పల్లి, మాక్లూర్ మండలాల్లోని 53,793 ఎకరాలు సాగులోకి వస్తాయని పేర్కొన్నారు. అందుబాటులోని చెరువులు, కుంటలు నింపుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. అలీసాగర్ నీటిని విడుదల చేయాలని బుధవారం మంత్రి పోచారంను కోరగా వెంటనే హైదరాబాద్ వెళ్లి సీఎం అనుమతి తీసుకురావడంపై ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో యాదిరెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లం, నీటి పారుదల శాఖ ఎస్ఈ గంగాధర్, డీఈఈ పంకజాదేవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావ్, ఎంపీటీసీ సభ్యురాలు నర్సుబాయి, నాయకులు బెలాల్ నర్సింగ్‌రావు, కాశి సంజీవ్, కమలాకర్‌రావు, భూమన్న, రుక్మయ్య, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాల రాద్ధాంతం
బాన్సువాడ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధిపొందడానికే టీడీపీ, కాంగ్రెస్‌లు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు., సోమవారం ఆ పార్టీలు పిలుపునిచ్చిన మెదక్ జిల్లా బంద్ పూర్తిగా విఫలమైందన్నారు. సోమవారం బాన్సువాడలోని పార్టీ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలం ప్రారంభం నుంచి జూలై 24 వరకు ప్రాణహిత, ఇందిరావతి నదుల నుంచి 770 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని తెలిపారు. ఈ నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలోని కొంత భాగంలో గల 3,000 గ్రామాల్లోని 40 లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు 45 సార్లు నిండుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి 40 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యం కాగా, వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 65 లక్షల ఎకరాల్లోనే పంటలను వేసారని తెలిపారు. 25 లక్షల ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా, 3.40 లక్షల ఎకరాల్లో వేశారని తెలిపారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల బాధితులతో జీవో నెంబర్ 123 ప్రకారం ముఖాముఖిగా మాట్లాడి నష్ట పరిహారం చెల్లించడం, లేదా 2013 పార్లమెంట్ బిల్లు ప్రకారం చెల్లంచడంపై వారితోనే అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. జీఓ 123 ప్రకారం వారు ఒప్పుకోగా, మార్కెట్ రేట్ ప్రకారం ఎకరాకు రూ. 6 లక్షలు, పొలాల్లో ఉండే నిర్మాణాలు, బోర్లకు అదనంగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమయ్యామని, దీనికి ఏటిగడ్డ, కిష్టాపూర్ గ్రామస్తులు అంగీకరించారని తెలిపారు. ఎవరో టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డి, సొంత లబ్దికోసం మిగితా గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి ఆందోళన చేస్తూ, పోలీసులపై రాళ్లు రువ్వారని, ఇది ఎంత వరకు సమంజసమని అన్నారు. మేధావి అయిన ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కాంగ్రెస్ నేతలు దీన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.9000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాణహిత–చేవేళ్ల పథకం ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు లభించాయా అని మంత్రి పోచారం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని కోటి ఎకరాలకు నీరందించడమే ధ్యేయంగా కాళేశ్వరం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. గోదావరి, మంజీర నదులపై మహారాష్ట్ర, కర్ణాటకలు అక్రమ ప్రాజెక్టులను నిర్మించడంతో నేడు నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు. కాళేశ్వరంతోనే ఈ ప్రాజెక్టులకు జీవం పోయడానికి వీలుంటుందని మంత్రి పేర్కొన్నారు. -
చెట్లతోనే వర్షాలు
♦ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన వాస్తవం ♦ మొక్కలు నాటడం అందరి బాధ్యత ♦ మూడేళ్లలో జిల్లాలో 10 కోట్ల మొక్కలు లక్ష్యం ♦ కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి ♦ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ♦ వీడియో కాన్ఫరెన్స్, సమీక్షలలో మంత్రి పోచారం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కరువును, దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు పచ్చదనాన్ని పెంచడమే ఏకైక మార్గమని వ్యవసాయ, ఉద్యానవన, సహకారశాఖల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్కసారి మనం ఇటీవల కురుస్తున్న వర్షాలు, వర్షపాతం గమనిస్తే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అడవులున్న ప్రాంతాల్లో ఎక్కువ, చెట్లు లేని చోట తక్కువ వర్షం కురుస్తోందని, వర్షాభావానికి కేవలం అంతరించిన పచ్చదనమే కారణమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాని అన్నారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక హరితహారం విజయవంతం చేయడం అందరి బాధ్యతని అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల, జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరితహారం అమలులో కొందరు అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హరితహారం అమలు కోసం రెండు గ్రామ పంచాయతీలకు ఒక క్లస్టర్‌గా అధికారిని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నోడల్ అధికారిని, మున్సిపాలిటీలకు కమిషనర్లను నియమించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలో 40 వేలు... ప్రతి గ్రామ పంచాయతీలో 40 వేల మొక్కలను నాటించాల్సిన బాధ్యత నోడల్ అధికారులు, క్లస్టర్ అధికారులదేనని మంత్రి పోచారం అన్నారు. గుంతలు తవ్విన తర్వాతనే నర్సరీల నుంచి మొక్కలు విడుదల చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కకు ఖచ్చితమైన లెక్కలతో, మొక్కలను బతికించాలని ఆదేశించారు. ఈ పనులకు ప్రభుత్వ పరంగా చెల్లించే సొమ్ము గురించి రైతులు, గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. నోడల్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అందరికీ అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో చెట్లు తక్కువగా ఉన్న లింగంపేట, తాడ్వాయి, బాన్సువాడ, కమ్మర్పల్లి మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని ఉదహరించారు. మూడేళ్లలో జిల్లాలో 10 కోట్ల మొక్కలను నాటించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 1.7 లక్షల హెక్టార్ల అడవులను కారడవులుగా మార్చేందుకు ఒక కోటి మొక్కలను, పొలాల గట్లు, నివాస ప్రాంతాల్లో 9 కోట్ల మొక్కలు పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. సుడిగాలి పర్యటన.. ‘తెలంగాణ హరితహారం పథకం భావి తరాల బాగు కోసం... మన ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు... మన దగ్గర మబ్బులు పైనుంచి పోతున్నా... వర్షాలు పడటలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి.. చెట్లున్న ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి... ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా భావించండి... భావితరాల భవిష్యత్‌ను దష్టిలో పెట్టుకుని మొక్కలు నాటుదాం’’ అంటూ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హరితహారం ప్రారంభం నుంచి బిజీ బిజీగా ఉన్నారు. ఈ నెల 11న బాన్సువాడలో మొక్కలు నాటి అధికారికంగా హరితహారం ప్రారంభించిన ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షలు జరుపుతూ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్.. ఇలా అన్ని నియోజకవర్గాల్లో కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శాఖల వారిగా సమీక్షలు చేస్తున్నారు. అంతటా పర్యటించిన మొక్కలు నాటుతున్నారు. బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ఆయన సోమవారం కూడ కలెక్టరేట్ నుంచి మండల, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ చైర్మన్ దపేదార్ రాజు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, సంయుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డి, ముఖ్య అడవీ సంరక్షణ అధికారి ఎస్కే గుప్త, డీఎఫ్‌వోలు, డ్వామా పీడీ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెల జిల్లాకు సీఎం
♦ 1,2 తేదీల్లో కేసీఆర్ పర్యటన ♦ బీర్కూర్‌లోని టీటీడీ ఆలయాన్ని దర్శించుకుంటారు ♦ విలేకరులతో మంత్రి పోచారం బీర్కూర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేనెల 1, 2 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం బీర్కూర్‌లోని టీటీడీ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ 1న బాన్సువాడలోని తన స్వగృహంలో బసచేసి, 2న బీర్కూర్‌లోని టీటీడీ ఆలయాన్ని దర్శించుకుంటారని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ఆలయవార్షిక బ్రహ్మోత్సవాలకు రాలేకపోతున్నారని మంత్రి తెలిపారు. పరిపూర్ణ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం సమగ్ర ప్రణాళిక-పరిపూర్ణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీర్కూర్‌లోని టీటీడీ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకా రం చుడుతూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారన్నారు. గతంలో మూస పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టేవారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం భిన ్నంగా ఆలోచించి ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించి కొత్తరాష్ట్రంలో ఏ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలి, ఎక్కడ తగ్గించాలి అని విశ్లేషించి చక్కటి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని పేర్కొన్నా రు. సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్లు కేటాయిం చారని ఇలా నాలుగేళ్లలో సుమారు రూ. లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈసారి వైద్యం కోసం ప్రత్యేకంగా రూ. 5 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. సీఎంతో పాటు ప్రతి మంత్రి వద్ద రూ. 25 కోట్లు స్పెషల్‌ఫండ్ కింద పెడుతున్నార న్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌కు రూ. 10 కోట్లు, ఎస్పీకి రూ. కోటి స్పెషల్ ఫండ్ ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ. 85 కోట్లతో నిజాంసాగర్ డీసీలు మరమ్మతులు చేయించామని, ఈసారి బడ్జెట్లో మరో రూ. 46 కోట్లు మంజూరు చేయించాని చెప్పారు. ఈసారి బడ్జెట్లో డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 1 నుంచి 82 వరకు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 220 కోట్లు కేటాయించిందన్నారు. మద్నూర్, సిర్పూర్ మీదుగా పోతంగల్ కోటగిరి నుంచి రుద్రూర్ బోధన్ మీదుగా నిజామాబాద్ వరకు జాతీయ రహదారి మంజూరయిందని పేర్కొన్నారు. దీంతో పాటు బాలానగర్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు నేషనల్ హైవే పనులు కూడా చేపడతామని చెప్పారు. సమావేశంలో కోటగిరి ఎంపీపీ సులోచన, బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, నాయకులు ద్రొణవల్లి సతీశ్, పెర్క శ్రీనివాస్, అప్పారావు, మహ్మద్ ఎజాస్, కొత్తకొండ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిఇంటికి సురక్షిత మంచినీరు
పుల్కల్/పెద్దశంకరంపేట: మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. 2017 మార్చిలోగా 275 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ముందుగు సాగుతున్నామని చెప్పారు. సోమవారం మెదక్ జిల్లా పుల్కల్ మండల పరిధిలోని పెద్దరెడ్డిపేట శివారులో జరుగుత్ను భగీరథ పనుల పరిశీలన, పెద్దశంకరంపేట మండలం జంబికుంట నుంచి నిజామాబాద్ జిల్లాకు నిర్మిస్తున్న తాగునీటి పైప్‌లైన్ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా 1.75 లక్షల కిలోమీటర్ల మే పైప్లైన్లు వేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్లతో 26 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. రూ.1,350 కోట్లతో సింగూరు- జూకల్, రూ.1400 కోట్లతో శ్రీరాంసాగర్- కామారెడ్డి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. సింగూర్-జూకల్ ప్రాజెక్టును నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేయాలన్నారు. జూకల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు బోధన్ ప్రాంతానికి ఈ పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నిజామాబాద్ జిల్లాకు రెండు ప్యాకేజీల ద్వారా రూ. 1000 కోట్లతో ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. ఆయన వెంట జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు ఉన్నారు. -
ఈ ఏడాదే మొత్తం రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రైతులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం రుణమాఫీ చేస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇప్పటివరకు సగం సొమ్మును బ్యాంకులకు చెల్లించామని.. మిగతా 50 శాతం సొమ్మును ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏకమొత్తంగా బ్యాంకులకు చెల్లిస్తామని వెల్లడించారు. సోమవారం సచివాలయంలో పోచారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు మండలాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కరువు పై ఏర్పాటు చేసిన కమిటీ మండలాల సం ఖ్యను నిర్ధారించిందని, ప్రకటించడమే మిగిలి ఉందని చెప్పారు. రైతులకు న్యాయం జరిగేలా కరువు మండలాల సంఖ్య ఉంటుందని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపు జీవోను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. త్వరలో విత్తన విధానం హైదరాబాద్‌లో మంగళవారం జాతీయ విత్తన కాంగ్రెస్ సదస్సు ప్రారంభమవుతోందని... మూడు రోజులపాటు జరిగే ఈ సభలకు దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, అధికారులు, ఆదర్శ రైతులు కలిపి 600 మంది వరకు హాజరవుతారని మంత్రి చెప్పారు. ఈ సదస్సులో విత్తన ఉత్పత్తిదారులు, రైతులతో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశామన్నారు. నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర నూతన విత్తన విధానాన్ని రూపొందిస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే సీడ్ విలేజ్ కార్యక్రమం చేపట్టామని... 16,680 యూనిట్లు ఏర్పాటు చేసి 36 వేల హెక్టార్లలో విత్తన ఉత్పత్తి ప్రారంభించామని చెప్పారు. ప్రభుత్వ సూచన మేరకు విత్తనోత్పత్తి కోసం విత్తన కంపెనీలు గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాయన్నారు. బైబ్యాక్ ఒప్పందం చేసుకొని ముందే ధర నిర్ణయించి ఆ ప్రకారం రైతులకు సరైన ధర చెల్లించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. నాణ్యమైన విత్తనాలతోనే పంటల దిగుబడి బాగా వస్తుందన్నారు. 2001లో జాతీయ స్థాయిలో 196.4 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను పండిస్తే... 2014లో 264 మిలియన్ టన్నులు పండించినట్లు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ డిప్యూటీ కమిషనర్ త్రివేది, రాష్ట్ర ఉన్నతాధికారులు పార్థసారథి, ఎం.వీరబ్రహ్మయ్య, ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాల్సింది రూ. 8,080 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 35.82 లక్షల రైతులకు సంబంధించి రూ. 17 వేల కోట్లు అవుతుందని.. ఈ సొమ్మును నాలుగు వాయిదాలుగా బ్యాంకులకు చెల్లించాలని నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.4,230 కోట్లు విడుదల చేశారు. ఇందులో రూ.4,040 కోట్లను బ్యాంకులు రైతుల ఖాతాల నుంచి మాఫీ చేశాయి. మిగతా సొమ్ము బ్యాంకుల్లోనే ఉంది. ఇక రెండో విడతగా ఈ ఏడాది మరో రూ.4,040 కోట్లు చెల్లించింది. అంటే మొత్తంగా ఇప్పటివరకు రూ.8,080 కోట్లు రుణమాఫీ అయింది. మిగతా రూ.8,080 కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేయాల్సి ఉంది. మొత్తం వడ్డీతో కలిపి కూడా ఇంతే మొత్తం అవుతుందని, ప్రత్యేకంగా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు మొత్తం రుణం సొమ్ము చెల్లించలేదనే కారణంతో కొన్ని బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఇటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఒకేసారి చెల్లించాలని సర్కారు నిర్ణయించినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రుణమాఫీ పథకంలో దాదాపు రూ.800 కోట్ల మేరకు బోగస్ రైతుల ఖాతాల్లోకి వెళ్లిందని సర్కారు అంచనా వేసింది. దానిపై ఏ చర్యలు తీసుకుంటారనేదానిపై ఇంకా స్పష్టత లేదు. -
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ: వరి సాగు చేస్తే పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువగా వచ్చి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, అందుకే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. వరితో ఉరే శరణ్యంలా పరిస్థితి తయూరైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చిన రైతు సాయిలుతో మాట్లాడారు. తాను వరి పండించేందుకు రూ. 30 వేలు ఖర్చు చేయగా, 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, అమ్మితే రూ.35 వేలు వస్తాయని చెప్పాడు. దీంతో మంత్రి పోచారం మాట్లాడుతూ వరి సాగుతో రైతులకు ఒరిగేదమీ లేదని, ఆరు నెలలు కష్టపడితే రూ. 5 వేలే వస్తాయన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూరగాయలు, వాణిజ్య పంటలు, పండ్లు, పూల మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సేంద్రియ ఎరువులనే వాడాలని సూచించారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీలున్న మెదక్, బోధన్, మెట్పల్లి చెరుకు రైతులకు సంబంధించిన బకాయిలను కూడా విడుదల చేశామన్నారు. -
ఏడాది కష్టానికి రూ.11 ఆదాయం
♦ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. ♦ కానీ సేంద్రియ సాగు వైపు అడుగులు వేశా.. ♦ రైతుల అవగాహన సదస్సులో మహిళా రైతు ప్రసంగం ఆర్మూర్: ‘ఏడాది పాటు కష్టపడి వ్యవసాయం చేసి పత్తి పండిస్తే.. నా భర్త 11 రూపాయల ఆదాయం చూపించాడు. ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకుందామన్నా.. కానీ వ్యవసాయ అధికారులు చెప్పిన సేంద్రియ వ్యవసాయాన్ని ప్రయత్నించి చూద్దామని పట్టుదలతో ప్రారంభించా. ఇప్పుడు 30 ఎకరాల భూమికి ఆసామినయూ.. రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు సలహాలు సూచనలిస్తున్నా’ అని మహబూబ్‌నగర్ జిల్లా తెల్కపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన మహిళా రైతు లావణ్య ప్రసంగం సభికులను ఉర్రూతలూగించింది. ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి పరంపరాగత క్రిషి వికాస్ యోజన పథకంలో భాగంగా రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యూరు. ఈ సదస్సులో లావణ్య చేసిన ప్రసంగం ప్రతి రైతును ఆలోచింపజేసింది. ప్రసంగం ఆమె మాటల్లోనే.. ‘పదేళ్ల క్రితం మా ఆయన రసాయన ఎరువులపై ఆధారపడి వ్యవసాయ చేసేవాడు. ఒక ఏడాది బీటీ పత్తి విత్తనం పండించాము. 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మాకు విత్తనాలు, ఎరువులు ఇచ్చిన వ్యాపారికి పంటను అమ్మాము. మూడు నెలల తర్వాత నేను అడిగితే మా ఆయన వ్యాపారి వద్దకు వెళ్లి లెక్క చూసుకుంటే విత్తనాలు, ఎరువుల ఖర్చులు పోను కేవలం 11 రూపాయలు చేతికి వచ్చారుు. ఏం చేయాలో పాలుపోలేదు. పదెకరాల పొలం అమ్ముకున్నాము. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. చివరికి ఇలాంటి సదస్సులో వారం రోజుల పాటు శిక్షణ పొందాను. సేంద్రియ ఎరువుల వాడకంపై పూర్తి అవగాహన వచ్చింది. ఇక మా భూమిలో పత్తి, వరి, కూరగాయలు పండించడం ప్రారంభించాము. మొదట్లో దిగుబడి తక్కువగా వచ్చేది. కానీ నేను పండించిన మిరపకాయలు వేరే రైతులతో పోలిస్తే నాణ్యంగా ఉండటంతో ఎక్కువ ధరకు అమ్ముకొని లాభపడ్డాను. ఇలా పదేళ్ల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. ఆవు మూత్రం, పంచగవ్వ, జీవామృతం వినియోగిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాను. నేను పండించిన పంటలను నేనే మార్కెటింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మా జిల్లాలో ప్రతీ రోజు ఐదు నుంచి పది మంది నా వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడానికి వస్తున్నారు. ప్రతి రోజు సుమారు 30 మందికి సేంద్రియ వ్యవసాయంపై ఫోన్లో ఉచితంగా సలహాలు ఇస్తున్నాను. జిల్లాలో 300 ఎకరాలకు నేను తయారు చేసిన పత్తి విత్తనాన్ని అమ్ముకుంటున్నాను. పెట్టుబడి వ్యయం తగ్గింది. దిగుబడి పెరిగింది. లాభాల బాటన పడ్డాము. మేము గతంలో అమ్ముకున్న భూమినే రూ.18 లక్షలు పెట్టి కొనుగోలు చేశాము. ప్రభుత్వ సహాయంపై ఆధారపడకుండా ఆవు మూత్రంపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ విజయం సాధించాము. మీలో ఎవరైనా మీ పిల్లలను ఏం చదివిస్తారు అంటే డాక్టర్, కలెక్టర్, ఇంజినీర్ అంటారే కాని ఏ ఒక్కరు కూడా నా పిల్లలను రైతును చేస్తామని మాత్రం అనరు.. నా తొమ్మిదేళ్ల కొడుకుకు పూర్తి వ్యవసాయం నేర్పిస్తున్నాను. రైతులను చిన్న చూపు చూసే ఈ పరిస్థితి మారాలి. ఎంత ఉన్నత పదవిలో ఉన్న వారైనా అన్నం పండించే రైతులు లేకపోతే పరిస్థితి ఏంటో ఆలోచించండి. నా అన్న కూడా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాని నేను ధైర్యంగా నిలబడి సేంద్రియ వ్యవసాయంలో విజయం సాధించాను. మీరు నాకు ఫోన్ చేసి సలహాలు అడగండి.. చెపుతా’ అంటూ తన ఫోన్ నంబర్ 7730061819 ను రైతులందరికీ అందజేసింది. అనంతరం జడ్చర్ల మండలం గొల్లపల్లికి చెందిన రైతు వెంకట్రాంరెడ్డి, అమెరికాలో ఉద్యోగం మానుకొని గ్రామానికి వచ్చి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న మేడ్చల్ మండలం రావులపల్లికి చెందిన రైతు వెంకట్ తమ అనుభవాలను పంచుకున్నారు. లావణ్య చేసిన ప్రసంగానికి స్పందించిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆమెకు పది వేల రూపాలయ ప్రోత్సాహక బహుమతిని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. -
కరువు ప్రాంతాలు ప్రకటిస్తాం
శాసనమండలిలో మంత్రి పోచారం ప్రకటన - రూ.1,500 కోట్ల వరకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తాం - రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ. 93,500 అప్పు ఉంది - నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు అఖిలపక్షం నిర్వహిస్తాం - వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: త్వరలో కరువు ప్రాంతాలను ప్రకటించి ప్రభుత్వమే ఇన్పుట్ సబ్సిడీగా రూ.1,500 కోట్ల మేరకు రైతుకు సాయంగా అందిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. 200కు పైగా మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. శాసనమండలిలో గురువారం ఆయన రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. త్వరలో మిగిలిన సగం రుణమాఫీని ఏకమొత్తంగా చెల్లించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని, చెల్లింపును వచ్చే ఏడాది వరకు సాగదీయబోమని స్పష్టంచేశారు. బ్యాంకుల్లో రుణం రెన్యువల్ చేసుకోని రైతుల డాక్యుమెంట్లను వెనక్కిచ్చే ఏర్పాట్లు చేస్తామని, వసూలు చేసిన వడ్డీని తిరిగి రైతులకిచ్చే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. బోగస్ రుణాలు పొందిన వారిని ప్రోత్సహించవద్దని చెప్పారు. ‘700 మంది ఓటర్లున్న మా గ్రామంలోనే 500 మంది బినామీ పేర్లతో రుణాలు తీసుకున్నారు. అలాగే నా నియోజకవర్గంలో రూ. 9 కోట్ల రుణాలు బినామీల ఖాతాల్లోకి వెళ్లాయి’ అని పోచారం ఉదహరించారు. దేశంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ. 47 వేల అప్పుంటే, తెలంగాణలో రూ. 93,500 అప్పు ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. నల్లబెల్లం విక్రయాలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలో వెయ్యి ఏఈవో పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పశువుల వైద్యం కోసం 36 డివిజన్లలో శుక్రవారం నుంచి మొబైల్ వెటర్నరీ వ్యాన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 108, 104 మాదిరి ఇవి పనిచేస్తాయన్నారు. రైతులు తమ పశువుల అనారోగ్యంపై ఫోన్ చేసిన వెంటనే మొబైల్ వ్యాన్ సంబంధిత గ్రామానికి వెళ్తుందని పోచారం పేర్కొన్నారు. వెంటనే ఎందుకు స్పందించలేదు? రైతు ఆత్మహత్యలపై సర్కారు వెంటనే స్పందించలేదని మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. రాజ్యాంగపరమైన సమస్య ఉత్పన్నమవుతుందన్న భయంతోనే సర్కారు ఇప్పుడు హడావుడి చేస్తోందే తప్ప.. రైతులపై ప్రేమతో కాదన్నారు. మొదట్లోనే భరోసా ఇచ్చి ఉంటే వెయ్యి మందికిపైగా రైతుల ఆత్మహత్యలు ఆగేవన్నారు. గత ఏడాది 337 మండలాల్లో లోటు వర్షపాతం ఉంటే, కేంద్రానికి కరువు మండలాల జాబితాను పంపడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పెద్దగా కరువులేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందని వివరించారు. ఈ పరిస్థితుత్లో రబీలో రైతుకు ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలన్నారు. ప్రైవేటు అప్పులపై రెండు మూడేళ్లు మారటోరియం ప్రకటించాలన్నారు. ఎప్పటిలోగా రుణమాఫీ సొమ్ము చెల్లిస్తారో నిర్ణీత తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాల్లో రైతు భరోసా యాత్ర నిర్వహించాలన్నారు. నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలన్నారు. కేంద్రం నుంచి రూ. 10 వేల ప్రత్యేక ప్యాకేజీ సాధించాలన్నారు. ఈ చర్చలో బీజేపీ సభ్యుడు రామచందర్‌రావు కూడా మాట్లాడారు. -
వాటర్‌గ్రిడ్‌కు రూ.3, 470 కోట్లు
సింగూరుకు రూ. 1710 కోట్లు ఎస్ఆర్ఎస్పీకి రూ.1760 కోట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ : జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 1645 గ్రామాలకు తాగునీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రూ.3,470 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో మిషన్ కాకతీయ పనులను, ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు సాగుకు అవసరమైనందున రూ.1710 కోట్లతో సింగూరు నుంచి వాటర్‌గ్రిడ్ పైప్‌లు వేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా బాన్సువాడ, బోధన్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 785 గ్రామాలకు నీరు సరఫరా చేస్తామని వివరించారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రూ.1760 కోట్లతో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 860 గ్రామాలకు నీరందిస్తామని తెలిపారు. ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, ఎల్అండ్టీ కంపెనీ వారు కాంట్రాక్టు పొందారని చెప్పారు. వాటర్ గ్రిడ్ పూర్తరుుతే నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు పూర్తిగా సాగుకే వినియోగిస్తామని, ఆయకట్టు కింద రైతులకు పుష్కలంగా నీరు లభిస్తుందని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసినా, కొందరు బ్యాంకర్లు అమలు చేయలేదని, దీని కోసం శనివారం సాయంత్రం నిజామాబాద్‌లోని ప్రగతి భవన్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. బాన్సువాడలో 50 ఫీట్లతో రోడ్డు వెడల్పు.. బాన్సువాడలోని ప్రధాన రహదారికి ఇరువైపులా 50 ఫీట్లతో రోడ్డును వెడల్పు చేయనున్నట్లు మంత్రి పోచారం స్పష్టం చేశారు. రోడ్డు వెడల్పు చేస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని, అందుకు వ్యాపారులు సహకరించాలని కోరారు. ఆయన వెంట బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నేతలు మహ్మద్ ఎజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, నార్ల సురేష్, సర్పంచ్ వాణి విఠల్, అలీముద్దీన్ బాబా ఉన్నారు. -
కరువును పారదోలుతాం
సాక్షి, మహబూబ్‌నగర్: పొట్టకూటి కో సం జిల్లావాసులు దుబాయి, బొంబా యి ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితిని రూపుమాపుతామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌శాఖ మంత్రి డా.సి.లకా్ష్మరెడ్డితో కలిసి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. వీరి వెంట షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఉన్నారు. నవాబ్‌పేట మండలం దేపల్లి గ్రామం వద్ద రైతులతో ప్రకృతి సేద్యంపై సదస్సు నిర్వహించారు. గోవు ఆధారితంగా ప్రకృతి సేద్యం చేస్తున్న పంట చేలను, గింజలను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ... ప్రకృతి సేద్యం పాలమూరు జిల్లా చాలా ఉపయోగకరమన్నారు. జిల్లాకు డ్రిప్, స్పింక్లర్లు ఎంతో అవసరమని, రైతులు ఎన్ని కోరినా ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. ఇది వరకే జిల్లాలో కొన్ని చోట్ల ప్రకృతి సేద్యం సాగవుతోందని, దీన్ని మరింత విస్తృత పరిచేందుక రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఒక ఆవు ద్వారా 30 ఎకరాల వరకు ప్రకృతి సేద్యం సాగు చేసే వీలుంటుందని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం వల్లే ఆరోగ్యం: లకా్ష్మరెడ్డి గోవు ఆధారితంగా చేసే ప్రకృతి సేద్యాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉందని విద్యుత్‌శాఖ మంత్రి డా.సి.లకా్ష్మరెడ్డి అన్నారు. పూర్వం కూడా ఇంచుమించు ఇలాంటి సేద్యమే చేసేవారని మంత్రి గుర్తుచేశారు. ప్రకృతి సేద్యం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గితే, భూములు కూడా సారవంతంగా మారుతాయన్నారు. వ్యవసాయశాఖ అధ్వర్యంలో ప్రతీ మండలంలో ఒక చోట మోడల్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పాలమూరు జిల్లా వ్యవసాయరంగంలో కూడా వెనకబడినందున... వ్యవసాయశాఖ జిల్లా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. సేంద్రీయ ఎరువుల ద్వారా పండించిన పంటను ఆహారంగా తీసుకుంటే వ్యక్తి పౌష్టికంగా ఉంటారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పేర్కొన్నారు. తన పొలంలో గత కొంత కాలంగా రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిషేదించినట్లు తెలిపారు. అలాగే అచ్చంపేటకు చెందిన మహిళారైతు ఊర్మిళ, తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన లావణ్య, నవాబ్‌పేట మండలం దేపల్లి గ్రామానికి చెన్నారెడ్డి అనే రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో నాయకులు విఠల్‌రావు ఆర్య, ఇందిర, శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, రాముగౌడ్ తదితరులు పాల్గొన్నారు.