ఏడాది కష్టానికి రూ.11 ఆదాయం
♦ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..
♦ కానీ సేంద్రియ సాగు వైపు అడుగులు వేశా..
♦ రైతుల అవగాహన సదస్సులో మహిళా రైతు ప్రసంగం
ఆర్మూర్: ‘ఏడాది పాటు కష్టపడి వ్యవసాయం చేసి పత్తి పండిస్తే.. నా భర్త 11 రూపాయల ఆదాయం చూపించాడు. ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకుందామన్నా.. కానీ వ్యవసాయ అధికారులు చెప్పిన సేంద్రియ వ్యవసాయాన్ని ప్రయత్నించి చూద్దామని పట్టుదలతో ప్రారంభించా. ఇప్పుడు 30 ఎకరాల భూమికి ఆసామినయూ.. రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు సలహాలు సూచనలిస్తున్నా’ అని మహబూబ్‌నగర్ జిల్లా తెల్కపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన మహిళా రైతు లావణ్య ప్రసంగం సభికులను ఉర్రూతలూగించింది.
ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి పరంపరాగత క్రిషి వికాస్ యోజన పథకంలో భాగంగా రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యూరు. ఈ సదస్సులో లావణ్య చేసిన ప్రసంగం ప్రతి రైతును ఆలోచింపజేసింది. ప్రసంగం ఆమె మాటల్లోనే.. ‘పదేళ్ల క్రితం మా ఆయన రసాయన ఎరువులపై ఆధారపడి వ్యవసాయ చేసేవాడు. ఒక ఏడాది బీటీ పత్తి విత్తనం పండించాము. 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మాకు విత్తనాలు, ఎరువులు ఇచ్చిన వ్యాపారికి పంటను అమ్మాము.
మూడు నెలల తర్వాత నేను అడిగితే మా ఆయన వ్యాపారి వద్దకు వెళ్లి లెక్క చూసుకుంటే విత్తనాలు, ఎరువుల ఖర్చులు పోను కేవలం 11 రూపాయలు చేతికి వచ్చారుు. ఏం చేయాలో పాలుపోలేదు. పదెకరాల పొలం అమ్ముకున్నాము. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. చివరికి ఇలాంటి సదస్సులో వారం రోజుల పాటు శిక్షణ పొందాను. సేంద్రియ ఎరువుల వాడకంపై పూర్తి అవగాహన వచ్చింది. ఇక మా భూమిలో పత్తి, వరి, కూరగాయలు పండించడం ప్రారంభించాము. మొదట్లో దిగుబడి తక్కువగా వచ్చేది. కానీ నేను పండించిన మిరపకాయలు వేరే రైతులతో పోలిస్తే నాణ్యంగా ఉండటంతో ఎక్కువ ధరకు అమ్ముకొని లాభపడ్డాను.
ఇలా పదేళ్ల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. ఆవు మూత్రం, పంచగవ్వ, జీవామృతం వినియోగిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాను. నేను పండించిన పంటలను నేనే మార్కెటింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మా జిల్లాలో ప్రతీ రోజు ఐదు నుంచి పది మంది నా వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడానికి వస్తున్నారు. ప్రతి రోజు సుమారు 30 మందికి సేంద్రియ వ్యవసాయంపై ఫోన్‌లో ఉచితంగా సలహాలు ఇస్తున్నాను. జిల్లాలో 300 ఎకరాలకు నేను తయారు చేసిన పత్తి విత్తనాన్ని అమ్ముకుంటున్నాను. పెట్టుబడి వ్యయం తగ్గింది. దిగుబడి పెరిగింది.
లాభాల బాటన పడ్డాము. మేము గతంలో అమ్ముకున్న భూమినే రూ.18 లక్షలు పెట్టి కొనుగోలు చేశాము. ప్రభుత్వ సహాయంపై ఆధారపడకుండా ఆవు మూత్రంపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ విజయం సాధించాము. మీలో ఎవరైనా మీ పిల్లలను ఏం చదివిస్తారు అంటే డాక్టర్, కలెక్టర్, ఇంజినీర్ అంటారే కాని ఏ ఒక్కరు కూడా నా పిల్లలను రైతును చేస్తామని మాత్రం అనరు.. నా తొమ్మిదేళ్ల కొడుకుకు పూర్తి వ్యవసాయం నేర్పిస్తున్నాను. రైతులను చిన్న చూపు చూసే ఈ పరిస్థితి మారాలి. ఎంత ఉన్నత పదవిలో ఉన్న వారైనా అన్నం పండించే రైతులు లేకపోతే పరిస్థితి ఏంటో ఆలోచించండి.
నా అన్న కూడా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాని నేను ధైర్యంగా నిలబడి సేంద్రియ వ్యవసాయంలో విజయం సాధించాను. మీరు నాకు ఫోన్ చేసి సలహాలు అడగండి.. చెపుతా’ అంటూ తన ఫోన్ నంబర్ 7730061819 ను రైతులందరికీ అందజేసింది. అనంతరం జడ్చర్ల మండలం గొల్లపల్లికి చెందిన రైతు వెంకట్రాంరెడ్డి, అమెరికాలో ఉద్యోగం మానుకొని గ్రామానికి వచ్చి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న మేడ్చల్ మండలం రావులపల్లికి చెందిన రైతు వెంకట్ తమ అనుభవాలను పంచుకున్నారు. లావణ్య చేసిన ప్రసంగానికి స్పందించిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆమెకు పది వేల రూపాలయ ప్రోత్సాహక బహుమతిని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.