సభలో మాట్లాడుతున్న మంత్రి పోచారం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యవసాయ పరిశ్రమను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఖమ్మంలో వ్యవసాయ యాంత్రీకరణ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాధారిత పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఇందుకోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ఈనెల 16న కమిటీ సమావేశం కానుందని పేర్కొన్నారు. వ్యవసాయ ఖర్చు తగ్గించేందుకు యాంత్రీకరణ పథకాన్ని మరింత బలోపేతం చేయనున్నామన్నారు. ప్రతి మండలానికి పది చొప్పున 5,500 ట్రాన్స్‌ప్లాంటేషన్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఇందుకోసం రూ.700 కోట్లను వచ్చే బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు చెప్పారు. ఒక్కో ట్రాన్స్‌ప్లాంటేషన్ మిషన్‌కు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు సబ్సిడీ కూడా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.5వేల కోట్లతో నిర్మించే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు 3 పంప్‌హౌస్‌ల పనులు సాగుతున్నాయన్నారు. మార్చి నాటికి అందరికీ ట్రాక్టర్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, బానోత్ మదన్‌లాల్, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment