Minister THUMMALA
-
నియోజకవర్గానికో వ్యవసాయ పరిశ్రమ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యవసాయ పరిశ్రమను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఖమ్మంలో వ్యవసాయ యాంత్రీకరణ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాధారిత పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఇందుకోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ఈనెల 16న కమిటీ సమావేశం కానుందని పేర్కొన్నారు. వ్యవసాయ ఖర్చు తగ్గించేందుకు యాంత్రీకరణ పథకాన్ని మరింత బలోపేతం చేయనున్నామన్నారు. ప్రతి మండలానికి పది చొప్పున 5,500 ట్రాన్స్‌ప్లాంటేషన్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం రూ.700 కోట్లను వచ్చే బడ్జెట్లో కేటాయించనున్నట్లు చెప్పారు. ఒక్కో ట్రాన్స్‌ప్లాంటేషన్ మిషన్‌కు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు సబ్సిడీ కూడా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.5వేల కోట్లతో నిర్మించే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు 3 పంప్‌హౌస్‌ల పనులు సాగుతున్నాయన్నారు. మార్చి నాటికి అందరికీ ట్రాక్టర్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, బానోత్ మదన్‌లాల్, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు భవిష్యత్ శూన్యం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా మోకాలడ్డుతోందని.. ఎన్ని కుప్పిగంతులేసినా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం కరీంనగర్‌లోని మానేరువాగుపై రూ.149 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి, కమాన్ నుంచి సదాశివపల్లి వరకు రూ.34 కోట్లతో చేపట్టనున్న నాలుగు లేన్ల రహదారి పనులకు మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టిన నాటి నుంచి కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు ప్రజలెవరూ పట్టించుకునే స్థితిలో లేరని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల అవసరాలను తెలుసుకుని పనిచేస్తోందన్నారు. ప్రాజెక్టులు, కరెంటు, రహదారులు, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నామన్నారు. కరీంనగర్లో రూ.149 కోట్లతో నిర్మాణం జరగనున్న కేబుల్ బ్రిడ్జి సౌతిండియాలోనే మొదటిదని అన్నారు. బ్రిడ్జి పూర్తయితే కరీంనగర్‌కు మణిహారంలా ఉంటుందన్నారు. కరీంనగర్ ప్రజలు హక్కుదారులు.. ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడిన కరీంనగర్ ప్రజలు ప్రభుత్వంలో హక్కుదారులని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోలేనని కేసీఆర్ క్లాక్‌టవర్ సాక్షిగా చెప్పారని అన్నారు. ఎన్ని నిధులైనా అడిగి తీసుకునే హక్కు మనకుందన్నారు. కాళేశ్వరం పూర్తయితే తెలంగాణ పచ్చగా మారిపోతుందని, కరీంనగర్ వాటర్‌హబ్‌గా నిలుస్తుందని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సౌతిండియాలో మొదటి కేబుల్ బ్రిడ్జి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కరీంనగర్లో జరగనుంది. దేశంలో ఇది మూడో బ్రిడ్జిగా ప్రసిద్ధిచెందనుంది. మానేరు నదిపై అత్యాధునిక టెక్నాలజీతో రూ.149 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కేబుల్ బ్రిడ్జి పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శనివారం ప్రారంభించనున్నారు. నిర్మాణ పనులను టాటా కన్సల్టెన్సీ, థాయ్‌లాండ్‌కు చెందిన గులేర్మాక్ సంస్థతో కలిసి చేపట్టనుంది. పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ కేబుల్ బ్రిడ్జి కరీంనగర్‌కు మణిహారంలా మారనుంది. గత అక్టోబర్‌లో బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చి, నిధులు విడుదల చేసింది. 21.5 మీటర్ల వెడల్పు, 520 మీటర్ల పొడవు, 16 మీటర్ల ఎత్తుతో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. కేబుల్‌కు సపోర్టు ఇచ్చేందుకు 45 మీటర్ల ఎత్తులో రెండు టవర్లు ఏర్పాటు చేయనున్నారు. 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు రూ.34 కోట్లతో కమాన్ నుంచి సదాశివపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులకూ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో మంత్రులు మాట్లాడనున్నారు. రోడ్డు, బ్రిడ్జి పనులు పూర్తయితే కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లేందుకు సుమారు 7 కి.మీ. దూరం తగ్గనుంది. ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామని ఇటీవలి పర్యటనలో ప్రకటించిన సీఎం కేసీఆర్.. మానేరు రివర్‌ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, ఐటీ టవర్లను మంజూరు చేశారు. -
ఎమ్మార్పీఎస్ రాస్తారోకో ఉద్రిక్తం
సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. సూర్యాపేటలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై సంఘం నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం రెండు గంటలుగా రాస్తారోకో చేపట్టారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. అదే సమయంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పోలీసులు ఆయనను పంపించే ప్రయత్నం చేయగా.. కాన్వాయ్ ఎదుట ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పడుకున్నారు. దీంతో మంత్రి కారు దిగి నాయకులతో మాట్లాడుతుండగా.. కొందరు కార్యకర్తలు రాళ్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తుమ్మలను కాన్వాయ్‌లోకి ఎక్కించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను చెదరగొడుతుండగా.. కాన్వాయ్‌పై వారు మళ్లీ రాళ్లు విసిరారు. ఈ దాడిలో పైలెట్ వాహనానికి రాళ్లు తగలడంతో ముందుభాగంలో స్వల్పంగా అద్దం పగిలింది. విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రకాష్‌జాదవ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
పాత వాహనాలకు కాలం చెల్లు!
సాక్షి, హైదరాబాద్: పదిహేనేళ్లు దాటిన వాహనాలు రోడ్డు ఎక్కకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలం చెల్లిన వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నందున వాటి విషయంలో అలసత్వం సరికాదన్న నిపుణుల సూచనతో ఏకీభవించింది. అలాగే మద్యం తాగి నడిపేవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. రహదారి భద్రతపై ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నా రు. వచ్చే నెలలో జరగనున్న మలిదఫా సమా వేశంలో వీటిపై ప్రకటన చేయనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో కమిటీ సభ్యులు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, పి.మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతోపాటు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రైల్వే పోలీసు డీజీ కృష్ణప్రసాద్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జాతీయ రహదారుల విభాగం ఈఎన్ సీ గణపతిరెడ్డి, రాష్ట్ర రహదారుల ఈఎన్సీ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు.. వాహన ప్రమాదాలు, వాటి రూపంలో ఏటా సగటున ఏడు వేల మంది మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణించి రోడ్డు భద్రతను ఎలా పటిష్టం చేయాలో సిఫారసు చేసేందుకు సీఎం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కొన్ని నిర్దిష్ట సూచనలు చేసే బాధ్యతను కమిటీ.. జేఎన్టీయూ ప్రొఫెసర్ లక్ష్మణరావు, ఓయూ ప్రొఫె సర్ ఎం.కె.కుమార్, వరంగల్ నిట్ ప్రొఫెసర్ ప్రసాద్, ఇండియన్ ఫెడరేషన్ ఫర్ రోడ్ సేఫ్టీ ప్రతినిధి వినోద్, రోడ్‌సేఫ్టీ క్లబ్ ప్రతినిధి పి.శ్రీనివాస్ తదితరులకు అప్పగించింది. ఈ సమావేశంలో వారంతా పాల్గొని తమ సూచనలిచ్చా రు. మద్యం తాగి వాహనం నడిపే వారిపై, నిబంధనలు పాటించని వారి విషయంలో కఠిన చర్యలు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ నిబంధనలు, వేగ నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. వచ్చే జనవరి తొలివారంలో రహదారి భద్రతావారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇçప్పుడు తీసుకున్న నిర్ణయాలపై మలిదఫా సమావేశంలో చర్చించి ప్రకటించనున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ ఏడాది మృతుల సంఖ్య 5,931.. 2015లో 21,552 ప్రమాదాల్లో 7,110 మృతిచెందగా, 2016లో 22,811 ప్రమాదాల్లో 7,219 మంది, ఈ సంవత్సరం నవంబర్ వరకు 20,0172 ప్రమాదాలు చోటు చేసుకోగా 5,931 మంది చనిపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని మంత్రి తుమ్మల వెల్లడిం చారు. మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గినంత మాత్రాన దీన్ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. దేశంలో రోడ్డు భద్రత చర్యలు పాటిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా పోలిస్తే బాగా వెనకబడిన విషయాన్ని మరవవద్దని పేర్కొన్నారు. -
సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5% కోటా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం కేటాయిస్తున్నట్లు మహిళాభివృద్ధి, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని.. ఉద్యోగ, విద్యావకాశాల్లో 3 శాతమున్న రిజర్వేషన్లను 4 శాతానికి పెంచిందని గుర్తుచేశారు. ఆదివారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికలాంగ విద్యార్థులకు వాహనాలు, యంత్రాలు అందించేందుకు ప్రభుత్వం అపరిమితంగా నిధులు ఖర్చు చేస్తోందని చెప్పారు. వికలాంగుల పెళ్లి ప్రోత్సాహక నిధులకు రూ.10 కోట్లు విడుదల చేశామని, జిల్లాల వారీగా వాటిని పంపిణీ చేశామని, త్వరలో లబ్ధిదారులకు చేరవేస్తామని వెల్లడించారు. దివ్యాంగుల సాఫ్ట్వేర్ ఉద్యోగాల కల్పనకు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఐటీ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం మామిడిపల్లిలో పదెకరాల స్థలం కేటాయించామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమంలో భాగంగా తనవంతు సహాయంగా రూ.15 లక్షలు ఆ శాఖకు అందించానని.. వికలాంగులకు డిజిటల్ లైబ్రరీ, బ్రెయిలీ యంత్రాల కోసం వాటిని ఖర్చు చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వికలాంగులకు రూ.1,500 పెన్షన్ ఇస్తున్నామని, వికలాంగుల సమస్యలను ఆలకించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. హెచ్ఎంఆర్ ఎండీకి సత్కారం వికలాంగుల మనసు నిర్మలమైనదని, కల్మషం లేకుండా కలివిడిగా ఉంటారని సినీనటి జీవిత అన్నారు. వికలాంగుల సమస్యలు, వారి మేధస్సు తెలిపేందుకు పలు చిత్రాల్లో వారి క్యారెక్టర్‌కు ప్రాధాన్యమిచ్చానని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. అనంతరం వికలాంగుల కోసం కృషి చేసిన సంస్థలు, ఉద్యోగులకు అవార్డులు అందించారు. మెట్రో రైళ్లో వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకుగాను హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని మంత్రులు సత్కరించారు. కాగా, ఉత్సవాలకు భారీగా వికలాంగులు హాజరుకావడంతో కొంత గందరగోళం నెలకొంది. జనాభాకు తగినట్లు ఏర్పాట్లు చేయకపోవడంతో కొందరు నిరసన వ్యక్తం చేశారు. అయితే అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, ఆ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, కమిషనర్ బి.శైలజ తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి–వరంగల్ హైవేకు మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) అనుసరిస్తున్న తీరుపై రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్–యాదాద్రి మధ్య నాలుగు వరసల రహదారి నిర్మాణం పూర్తి కాగా, ఇప్పుడు యాదాద్రి–వరంగల్ మధ్య నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న రోడ్డు నిర్వహణ సరిగా లేకపోవటంతో అది బాగా దెబ్బతింది. కీలకమైన రహదారి కావటంతో దీనిపై నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. రోడ్డు గుంత లమయం కావటంతో వాహనాల వేగం తగ్గిపోవటమే కాక ప్రమాదాలూ జరుగుతు న్నాయి. గుంతలతో వాహనాలు దెబ్బతింటున్నాయి. ఆర్టీసీ బస్సులో ఉప్పల్ నుంచి వరంగల్ వరకు గతంలో రెండున్నర గంటల్లో వెళ్లగా ఇప్పుడు మూడున్నర గంటలకుపైగా సమయం పడుతోంది. బస్సులు కూడా దెబ్బతింటున్నాయి. దీన్ని ఆర్టీసీ తీవ్రంగా పరిగణించినట్టు ఆర్టీసీ ఎండీ రమణారావు ‘సాక్షి’తో చెప్పారు. ఈ రోడ్డును ఎన్హెచ్ఏఐకి అప్పగించేప్పుడు మంచి కండిషన్లోనే ఉందంటూ జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి వివరణ ఇచ్చారు. ‘సాక్షి’ కథనంతో కదలిక..: రోడ్డు బాగా పాడైన చిత్రాలతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మంత్రి తుమ్మల బుధవారం ఎన్హెచ్ఏఐ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోడ్డు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధు లను కూడా సమావేశానికి పిలిచారు. నిర్మాణ ఒప్పందంలో.. పాత రోడ్డు నిర్వహణ అంశం ఉన్నా దాన్ని పట్టించుకోకపోవటం సరికాదన్నారు.దీనిపై నిర్మాణ సంస్థ ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేస్తానని అధికారులకు చెప్పారు. ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేస్తే విషయాన్ని ఢిల్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. దీనిపై ఎన్హెచ్ఏఐ తెలంగాణ సీజీఎంతో మంత్రి ఫోన్లో మాట్లాడి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. -
హరీశ్‌రావుకు త్రుటిలో తప్పిన ముప్పు!
సాక్షి, హైదరాబాద్: భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సోమవారం పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డా రు. వాతావరణం బాగా లేక ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు హెలికాప్టర్‌కు బేగంపేట విమానాశ్రయంలో ల్యాండింగ్ అనుమతి ఇవ్వలేదు. దాంతో హెలికాప్టర్ గాలిలోనే చక్కర్లు కొట్టింది. అయితే అందులో కొంతసేపటికి మాత్రమే సరిపడా ఇంధనం ఉండడంతో తీవ్ర ఉద్విగ్నత నెలకొంది. చివరికి పైలట్ హెలికాప్టర్‌ను హైదరాబాద్ శివార్లలోని హకీంపేట సైనిక ఎయిర్‌పోర్టులో అనుమతి లేకున్నా బలవంతంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ప్రాజెక్టులను పరిశీలించి వస్తూ.. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆహ్వానం మేరకు.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సోమవారం జరిగిన పలు ప్రాజెక్టు పనుల కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఇందుకోసం సోమవారం ఉదయం 8 గంటలకే హైదరాబాద్ నుంచి బయలుదేరేందుకు ఆయన సిద్ధమైనా.. ప్రభుత్వ అధీనంలోని హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. రోడ్డు మార్గంలో వెళ్లేందుకు సమ యం సరిపోదన్న ఉద్దేశంతో అద్దెపై బెంగళూ రు నుంచి ప్రైవేటు హెలికాప్టర్‌ను తెప్పించారు. ఆ హెలికాప్టర్ వచ్చాక మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన హరీశ్‌రావు.. పాలేరు, వెంకటాపురం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా.. చీకటి పడితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో భద్రాద్రిలోనే మంత్రి తుమ్మలను దింపి.. హైదరాబాద్‌కు బయలుదేరారు. వాతావరణం సహకరించక.. హరీశ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాయంత్రం 5.40 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. కానీ భారీ వర్షం కురుస్తుండడంతో.. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేదంటూ బేగంపేట ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి నిరాకరించింది. భారీ వర్షం కారణంగా కనీసం ఐదు వందల మీటర్ల దూరం కూడా కనిపించని స్థితిలో.. పైలట్ హెలికాప్టర్‌ను హకీంపేట విమానాశ్రయానికి మళ్లించారు. సైనిక అవసరాలు, సైనిక శిక్షణ విమానాల కోసం ప్రత్యేకించిన.. హకీంపేట విమానాశ్రయంలో గాంధీ జయంతి సెలవు సందర్భంగా సోమవారం ఏటీసీ మూసేసి ఉంది. దీంతో పైలట్ ఏటీసీని సంప్రదించలేకపోయారు. అటు బేగంపేట విమానాశ్రయంలో రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం లేదని హెచ్చరికలు వచ్చాయి. కానీ హెలికాప్టర్లో పది పదిహేను నిమిషాల పాటు మాత్రమే సరిపోయేలా ఇంధనం ఉంది. దీంతో పైలట్ విధిలేని పరిస్థితుల్లో ఏటీసీ అనుమతి లేకుండానే హకీంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్‌ను సురక్షితంగా దింపారు. సైనికాధికారుల అభ్యంతరం అనుమతి లేకుండా హెలికాప్టర్ ఎలా దింపుతారంటూ హకీంపేట ఎయిర్‌పోర్టుకు చెందిన సైనికాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఇరువర్గాల మధ్య దాదాపు అర గంటపైనే వాదు లాట జరిగిందని సమాచారం. అయితే అనివార్య పరిస్థితిని పైలట్ వివరించడం, రాష్ట్ర మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వారు వెనక్కి తగ్గారని తెలిసింది. కాగా హరీశ్‌రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడడంతో ప్రభుత్వ వర్గాలు, అధికార పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. -
సమస్యా.. 181కు ఫోన్ కొట్టండి!
మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల - 24 గంటలూ అందుబాటులో హెల్ప్‌లైన్‌కు విస్తృత ప్రచారం - కల్పించాలని అధికారులకు సూచన సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో మహిళ ఒంటరి కాదు.. వారికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎలాంటి సమస్య వచ్చినా... ఏదైనా సలహా కావాలన్నా వెంటనే 181 నంబర్‌కు ఫోన్ కొట్టండి. వెంటనే స్పందించి పరిష్కార మార్గం చూపుతాం’ అని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్‌లైన్–181 నంబర్‌ను శనివారం ఆయన సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ.. వేధింపులు, దాడులకు గురైన మహిళలు ఇక కన్నీరు పెట్టుకోవద్దని, హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే తదుపరి చర్యలు రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఏడాది పొడవునా.. ఈ హెల్ప్‌లైన్ ఏడాది పొడుగునా రాత్రింబవళ్లూ పనిచేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. సమస్యలకు పరిష్కారంతో పాటు సంక్షేమ కార్యక్రమాల వివరాలను సైతం ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ హెల్ప్‌లైన్ నంబర్‌పై విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు తుమ్మల సూచించారు. అన్ని కార్యాలయాలు, పబ్లిక్ స్థలాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసి చైతన్యపర్చాలన్నారు. హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసిన మహిళలకు సఖీ కేంద్రాలు, అంబులెన్స్, ఆస్పత్రులు, పోలీస్స్టేషన్ల ద్వారా సేవలందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆపదలో ఉన్నవారికి తాత్కాలిక వసతి కూడా కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో మహిళలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేలా సీఎం ప్రత్యేక శ్రద్ధతో పలు చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య భారీగా పెరిగిందని, అదేవిధంగా ఓపీ కూడా పెరిగిందని వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్లు, కేసీఆర్ కిట్లులాంటి పథకాలను అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వా నిదేనన్నారు. గృహహింస, పనిచేసే చోట వేధిం పులు, లైంగిక వేధింపులు, వరకట్నపు వేధిం పులు, ఆడపిల్లల అమ్మకం, రవాణాను నిరోధించడమే లక్ష్యంగా హెల్ప్‌లైన్ పనిచేస్తుందన్నారు. అనంతరం మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ గుండు సుధారాణి మాట్లాడుతూ మహిళల రక్షణ కు ఏర్పాటు చేసిన షీటీమ్స్ అద్భుత ఫలితాలు ఇస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర తదితరులు పాల్గొన్నారు. -
ఆలస్యం చేసేయ్.. అంచనాలు పెంచేయ్!
ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణంలో ‘ఎస్కలేషన్’ మాయ - ఏళ్లపాటు జాప్యం చేసి అంచనాలు పెంచే యత్నం - ఒప్పందంలో లేని పనులు.. నిబంధనలు బేఖాతరు - ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో కన్నం సాక్షి, హైదరాబాద్: ఓ పెద్ద నిర్మాణ పని మొదలవుతుంది. కానీ.. గడువులోపు పూర్తి చేయరు. పలు కారణాలతో జాప్యం చేస్తారు. ఈలోపు నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయన్న కారణంతో నిర్మాణ అంచనా విలువను ఆకాశా నికెత్తేస్తారు. దీనికి అధికారులూ ఓకే అంటారు. అందుకవసరమయ్యే సంతకాలన్నీ పడిపోతా యి. చివరకు ప్రభుత్వం కొత్త అంచనా విలువకు తగ్గట్టుగా బిల్లులు విడుదల చేస్తుంది. దీంతో నిర్మాణ ‘కథ’ సుఖాంతమవుతుంది. ప్రభుత్వ ఖజానాకు మాత్రం భారీ నష్టం జరుగుతుంది. ఇదీ రోడ్లు భవనాల శాఖలో తరచూ జరిగే వ్యవహారం!! ప్రస్తుతం ఇంద్రభవనాన్ని తలపిం చేలా ఉన్న ఆ శాఖ భవన నిర్మాణంలోనూ ఇదే జరిగింది. రూ.25 కోట్లతో పూర్తవ్వాల్సిన భవనా నికి రూ.65 కోట్ల లెక్కలు తేల్చి ఖజానాకు సున్నం కొట్టేశారు. ఇప్పుడు సాక్షాత్తూ శాసన సభ్యుల నివాస సముదాయం విషయంలోనూ దీన్నే పునరావృతం చేసేందుకు సిద్ధమయ్యారు.. గతంలో పనిచేసిన కొందరు అధికారులు. వారిలో కొందరు పదవీ విరమణ చేయగా.. కొందరు బదిలీ అయ్యారు. అంచనా విలువ అమాంతం పెంచాల్సి రావటంతో ప్రస్తుత అధి కారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. నిబం ధనలకు విరుద్ధంగా ప్రైస్ ఎస్కలేషన్ చేయడం, ఒప్పందంలో లేని పనులను చేర్చడం, టెండ ర్లతో సంబంధం లేకుండా అదనపు పనులు అప్పగించడం.. వెరసి మూడున్నరేళ్ల జాప్యం చేసి అంచనా విలువను భారీగా పెంచాల్సిన పరిస్థితికి తెచ్చారు. ఎమ్మెల్యేల నివాస సముదా యంలోనే ఇలా జరగటంతో ఎస్కలేషన్‌కు అను మతించాలా? లేదా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలా అని అధికారులు యోచిస్తున్నారు. పనుల్లో మార్పులు.. సాధారణంగా ఒప్పంద గడువులోపు పని చేయ కుంటే లిక్విడేటెడ్ డ్యామేజి పేరుతో నిర్మాణ విలువలో 10% వరకు ప్రభుత్వమే నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేయాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఒప్పందంలో అనుకున్న పనులే జర గాలి. మార్పులకు అవకాశం ఉండొద్దు. కానీ గతంలో పనిచేసిన అధికారులు కొందరు మార్పులు (డీవియేషన్స్) చేయాలని ఒప్పందం లో లేని పనులు చేయించారు. నిజానికి దీనికి విడిగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి పని అప్పగించాలి. కానీ ఆ నిబంధనను తుంగలో తొక్కారు. దీనివెనక ఉమ్మడి రాష్ట్రంలో ఓ ముఖ్య నేత బంధువు హస్తముందని ఆరోపణలు విని పిస్తున్నాయి. ఆయన కన్సల్టెన్సీ బాధ్యత చూశారని, దీన్ని నామినేషన్ పద్ధతిలో ఇప్పించి, ఆ పేరిట రూ.3 కోట్లు ఖర్చు చూపారని సమాచారం. గతంలో రాజ్‌భవన్ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే గవర్నరే గుర్తించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం బిల్డింగ్ విభాగంలో భారీ మార్పులు చేశారు. చీఫ్ ఇంజనీర్‌ను తప్పించి జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డికి బాధ్యతలు అప్పగిం చారు. ఎమ్మెల్యే క్వార్టర్ల విషయంలో నిబం ధనల ఉల్లంఘనలు కనిపించటంతో గణపతి రెడ్డి ఆచితూచి వ్యవహరించారు. ఇదీ సంగతి.. హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌లో ఎమ్మెల్యే భవనాలు పాతపడిపోవటంతో.. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్లకు అనుబంధంగా 120 క్వార్టర్లతో భారీ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఇందుకు 2012 ఆగస్టులో ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం జరిగింది. రూ.132 కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా.. నిర్మాణ సంస్థ 5.58 శాతం లెస్‌కు పనులను దక్కించుకుంది. దీంతో నిర్మాణ విలువ రూ.125 కోట్లుగా మారింది. 18 నెలల్లో అంటే.. 2014 జనవరి నాటికి పనులు పూర్తి చేసి భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ఇప్పటికీ జరగలేదు. ఇటీవలే మంత్రి తుమ్మల తనిఖీ చేసి జాప్యం జరగడంపై నిర్మాణ సంస్థ, అధికారులపై మండిపడ్డారు. ఈ జాప్యం వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంచనా విలువను పెంచేసి ఖజానాకు గండికొట్టాలని చూస్తున్నారని, రూ.40 కోట్ల వరకు అంచనా పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల జాడేది? సాధారణంగా నిర్మాణ సామగ్రి ధర పెరిగితే ప్రైస్ ఎస్కలేషన్‌కు అనుమతి స్తారు. కానీ.. ఒప్పంద గడువులోపు పనులు జరిగితేనే ఈ వెసులుబాటు ఉంటుంది. కానీ ఎమ్మెల్యే క్వార్టర్ల విష యంలో ఇన్నేళ్లు జాప్యం జరిగినా ఆ నిబంధనను బేఖాతరు చేశారు. ఇప్పటికే పలుసార్లు రూ.కోట్లలో ఎస్కలేషన్‌కు అవ కాశం కల్పించారు. జాప్యానికి ప్రభుత్వ పరమైన కారణాలుంటే అంచనా విలు వను పెంచుకోవచ్చు. కానీ.. పనులు ప్రారంభమైనప్పట్నుంచీ ఇప్పటిదాకా పలు సందర్భాల్లో అధికారులు నిర్మాణ సంస్థకు జాప్యంపై లేఖలు రాశారు. ఒప్పంద గడువు మేరకు పనులు జరగటం లేదని, పనుల వేగాన్ని పెంచాల న్నది వాటి సారాంశం కావటం విశేషం. నివేదిక వచ్చాక చర్యలు: మంత్రి తుమ్మల ఎమ్మెల్యేల కొత్త క్వా ర్టర్ల సముదాయ నిర్మాణ ప్రక్రియ గందరగోళంగా ఉంది. నిర్మాణ నాణ్యత లో సందేహాలు లేనప్ప టికీ.. తీవ్ర జాప్యం, ప్రైస్ ఎస్కలేషన్, అంచనా వ్యయం పెంచాల్సి రావటం వంటివి అభ్యంతరకరమే. వీటిపై పూర్తి వివరాలు అందజేయాల్సిందిగా ఈఎన్సీని ఆదేశిం చాను. నివేదిక అందిన తర్వాత చర్యలపై నిర్ణయం తీసుకుంటా. రెండు మూడు నెలల్లో భవన సముదాయాన్ని ప్రారంభిస్తాం. -
‘భద్రాచలం’ పనులు ప్రారంభించండి
- రైల్వే శాఖను కోరిన మంత్రి తుమ్మల - రైల్వే లైన్‌కు భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వే లైన్ పనులను వెంటనే ప్రారంభించాలని రైల్వేను రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఇందుకు అవసరమైన భూ సేకరణ, ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి సునీ ల్ శర్మ, ఈఎన్సీ రవీందర్రావులతో బుధవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. భద్రాచలం రోడ్ స్టేషన్ మీదుగా సత్తుపల్లిని అనుసంధానిస్తూ ఏపీలోని కొవ్వూరు వరకు 133 కి.మీ.ల దూరంతో మంజూరైన రైల్వే లైన్ ప్రాజెక్టులో రూ.704 కోట్ల వ్యయంతో చేపట్టే భద్రాచలం రోడ్-సత్తుపల్లి సెక్షన్ పనులు వెంటనే ప్రారంభించాలని రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాణ వ్యయాన్ని సింగరేణి కాలరీస్ సంస్థ భరించనున్నందున పనులు ప్రారంభించటంలో జాప్యం ఉండొద్దన్నారు. రైల్వే లైన్ వల్ల సాధారణ ప్రయాణికులకు, సింగరేణికి ఎంతో ఉపయోగం ఉన్నందున ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రైల్వే లైన్‌కు కావాల్సిన 500 ఎకరాల భూ సేకరణ పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. గతంలో మంజూరైన పాండురంగాపురంృకొత్తగూడెం రోడ్ లైన్‌కు సంబంధించి సర్వే చేయాలని, భద్రాచలం దేవాలయానికి వచ్చే భక్తులకు ఈ లైన్ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణాల గురించి కూడా తుమ్మల వాకబు చేశారు. 2 నెలలకోసారి సమావేశాలు: సీఎస్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరిగేందుకు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో 2 నెలలకోసారి సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వెల్లడించారు. రైల్వే జీఎం, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌లతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మెదక్-అక్కన్నపేట, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ల పురోగతి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. చర్లపల్లి, వట్టినాగులపల్లి టర్మినల్స్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మునీరాబాద్ృమహబూబ్నగర్ లైన్ భూ సేకరణను వేగిరం చేయాలని ఆదేశించారు. మానవరహిత లెవల్ క్రాసింగ్స్కు 28 చోట్ల అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులివ్వాలని, ఆర్ఓబీలు పూర్తయిన చోట అప్రోచ్ రోడ్లను నిర్మించాలని ఆదేశించారు. -
నేను, కేసీఆర్లే ఎన్టీఆర్‌కు నిజమైన శిష్యులం
రేవంత్ జాగ్రత్త: మంత్రి తుమ్మల ఖమ్మం: ‘టీడీపీ ఆది నుంచి అంతం వరకు మేము ఉన్నాం.. నేను, కేసీఆర్లే ఎన్టీఆర్‌కు నిజ మైన వారసులం.. ఆయన ఆశ యాలు, సంక్షేమాన్ని మేము కొనసాగిస్తున్నాం.. ఆ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.. కేసీఆర్ ఆహ్వానం మేరకు పార్టీలోకి వచ్చా..’’అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మంత్రి ఖమ్మంలో విలేకరులతో మాట్లాడారు. పోరంబోకు లతో రాళ్లు వేయించి అమాయక రైతులపై కేసు లయ్యేలా ఉసిగొల్పారని, ‘మొగుడ్ని కొట్టి మొగసాలె త్తినట్లుగా’ ప్రతిపక్షాల తీరు ఉందన్నారు. పదిరోజు లుగా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న నాయకుల్లో ఒక్కరు కూడా రైతులేడని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పత్తికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని చెప్పడంతో ఈ ఏడాది రైతులు మిర్చితోపాటు ఇతర పంటలను సాగు చేశారని తెలి పారు. డిమాండ్ తగ్గిపోవడంతోనే మార్కెట్లో మిర్చి ధర తగ్గుముఖం పట్టిందని, అయినా క్వింటాల్‌కు సరాసరిగా రూ.7 వేల వరకు ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు జరిగాయన్నారు. రేవంత్‌రెడ్డి కేవలం సీఎం, ఆయన కుటుంబ సభ్యులనే టార్గెట్‌గా చేసుకుని విమర్శిస్తున్నారే తప్ప సరైన ప్రణాళిక లేదన్నారు. తాను గెలిచిన నియోజకవర్గం, జిల్లా ప్రజల గురించి సోయిలేని రేవంత్‌రెడ్డి ఇక్కడకు వచ్చి ఆసు కవితలు వినిపిస్తున్నారని ఆరోపించారు. రాను న్న రోజుల్లో కొడంగల్ ప్రజలే ఆయనను బట్టలిప్పి కొడతారనే విషయం తెలుసుకోవాలన్నారు. విలేక రుల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి రెండు ఎకనమిక్ కారిడార్లు
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కొత్తగా రెండు ఎకనమిక్ కారిడార్ రహదారులు మంజూరయ్యాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. నార్కెట్‌పల్లి–నల్లగొండ–తిప్పర్తి–మిర్యాలగూడ–కొండ్రపోలు– పొందుగల మధ్య 98 కి.మీ. మేర, జడ్చర్ల– దామగ్నాపూర్–కర్ణాటక సరిహద్దు వరకు 109 కి.మీ. మేర రెండు రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు ఆయన రహదారులపై సమీక్షించారు. జూన్ 1వ తేదీ తర్వాత రోడ్లపై గుంతలు కనిపిస్తే అధికారులను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు ఎకనమిక్ కారిడార్లపై అధికారులతో చర్చించారు. సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.4,500 కోట్ల విలువైన పనులతో కూడిన వార్షిక ప్రణాళికకు అదనంగా ఆరాంఘర్, ఉప్పల్, ఎల్బీనగర్ కూడళ్లలో నిర్మించే మూడు ఎలివేటెడ్ కారిడార్లు జతయ్యాయని పేర్కొన్నారు. మొత్తంగా రూ.5,900 కోట్ల విలువైన పనులు రాష్ట్రానికి సాధించినట్టు వెల్లడించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ ఇబ్బందులు అధిగమించేలా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సీఎం ఆదేశించినట్టుగా రహదారులపై గుంతలు లేకుండా మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల భవనాల నిర్మాణాన్ని వేగిరం చేసి సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఈఎన్సీలు రవీందర్రావు, గణపతిరెడ్డి, సీఈలు చంద్రశేఖరరెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం మార్కెట్‌పై దాడి ..రైతుల పనికాదు
- స్పష్టం చేసిన మంత్రి తుమ్మల - కాంగ్రెస్, టీడీపీలు రైతు వ్యతిరేక పార్టీలు - భూసేకరణకు తొందరెందుకన్న ‘ఉత్తమ్’ మూర్ఖుడు సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మిర్చి మార్కెట్‌యార్డ్‌పై జరిగిన దాడిని ఖండి స్తున్నామని, ఇది రైతులు చేసిన పని కాదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలన్న తపన ఉన్న నాయకుడన్నారు. శనివారం ఇక్కడ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయలో ఆయన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం నాటి ఘటనలో రాళ్లు విసిరింది ముమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీ ముఠాలేనని, ఎవరు దాడి చేశారో సీసీటీవీ ఫుటేజీ లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. దేశంలో ఇప్పటికీ మిర్చి పంటకు అధి కంగా ధర ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ వంటి వారికి వ్యవసాయం మీద అవగాహన లేదని, మిర్చి ధరలకు, కేంద్రానికి సంబంధం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఖమ్మం మార్కెట్లో శుక్రవారం జరిగిన సంఘటన ప్రతిపక్షాల పిచ్చికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. రైతులు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తుమ్మల పేర్కొన్నారు. ‘పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మహానాయకుడా, మూర్ఖుడా? ఉత్తమ్ మూర్ఖుడయితేనే భూసేకరణకు తొందరేమిటి అని మాట్లాడతారు’ అని మంత్రి దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు కేవలం రాజకీయ బతుకుదెరువు కోసమే ఈ లఫంగీ పనులు చేస్తున్నారని, వారి పాలనలో ఏనాడైనా పంటలకు సరిగ్గా ధర చెల్లించారా? వారిచ్చిన మద్దతు ధరలపై చర్చకు సిద్ధమా? అని సవాలు చేశారు. ఓయూలో సీఎం ప్రసంగించకపోవడంపై అనవసర రాద్దాంతం ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించకపోవడంపై కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. విమర్శిస్తున్న వారికి కనీసం ప్రోటోకాల్ నిబంధనలు తెలియవన్నారు. ‘2007లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాల్గొన్న ఓయూ స్నాతకోత్సవంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రసంగించ లేదన్నారు. -
టీఆర్ఎస్కు ఎదురు లేదు: తుమ్మల
సాక్షి, వరంగల్: రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురులేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో సరైన నాయకత్వం లేదన్నారు. 2019లో అధికారంలోకి వస్తామని కలలుకంటున్న ప్రతిపక్ష పార్టీల ఆశలు కలలుగానే మిగులుతాయని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగసభ ప్రదేశానికి బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు జావగారి పోయాయని, టీఆర్ఎస్కు పోటీ ఇచ్చే పార్టీలు లేవన్నారు. -
కృష్ణ కృష్ణ.. ఎక్కడి పనులక్కడే..
- మరో పక్షం రోజుల్లో పుష్కరాలు - పలు పనులకు టెండర్లు పిలవని వైనం - సమీక్షించిన మంత్రి తుమ్మల సాక్షి, హైదరాబాద్ : మరో పక్షం రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండగా, ఇప్పటికీ ప్రధాన పనులు పూర్తికాకపోగా కొన్నింటికి కనీసం టెండర్లు కూడా పిలవలేకపోయారు. ఫలితంగా కృష్ణా పుష్కరాలు మొదలై భక్తులు పుణ్యస్నానాలకు వస్తున్నా పనులు మాత్రం కొనసాగేలా కనిపిస్తున్నాయి. మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్లక్ష్యం తేటతెల్లమైంది. అన్నీ అసంపూర్తిగానే.. నల్లగొండ జిల్లాలో కృష్ణా పుష్కరాల కోసం ఇప్పటికి కేవలం 36 కోట్లతో 17 రోడ్లను మాత్రమే పూర్తి చేశారు. మిగతా పనులను పరుగుపెట్టించినా పుష్కరాలు మొదలయ్యే నాటికి పూర్తి అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో మంత్రి తుమ్మల అధికారులకు ఆగస్టు 8 గడువు విధించారు. 9 అతిథి గృహాలను ఆగస్టు 8లోగా నిర్మించాలని, 17 పార్కింగ్ స్థలాలను పదో తేదీనాటికి సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో 16 రోడ్డు పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వచ్చేనెల ఐదో తేదీకి పూర్తి చేస్తామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. 15 అతిథి గృహాల మరమ్మతులు చేయాల్సి ఉండగా రెండే పూర్తయ్యాయి. మిగతావి వచ్చేనెల పది నాటికి పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. 30 ప్రాంతాల్లో పార్కింగ్ పనులకు టెండర్లు మాత్రమే పిలిచారు. మరో రెండుమూడు రోజుల తర్వాతగాని పనులు ప్రారంభమయ్యేలా లేవు. వాటిని కూడా పదో తేదీ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. పనుల తీరు గుర్తించిన మంత్రి రెండు జిల్లాలకు ఇద్దరు ఈఎన్సీలను అటాచ్ చేశారు. వీలైనంత తొందరలో పనులు పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. -
మొక్కలేసుడే..
⇒ ‘హరితహారం’లో ఊరూరా మొక్కల పండగ ⇒ విరివిగా నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు ⇒ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల, ⇒ పీఆర్ కమిషనర్ అనితారామచంద్రన్ సాక్షిప్రతినిధి, ఖమ్మం : హరితహారం కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా శుక్రవారం యజ్ఞంలా చేపట్టారు. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలు, వీధుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది విరివిగా మొక్కలు నాటారు. కలెక్టరేట్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితారామచంద్రన్, కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం పాల్గొని.. మొక్కలు నాటారు. జిల్లా పరిషత్‌లో పీఆర్ కమిషన ర్ అనితారామచంద్రన్‌తో కలిసి జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత మొక్కలు నాటారు. ⇒ భక్తరామదాసు కళాక్షేత్రంలో చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు 250 మొక్కలు నాటారు. నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని గార్డెన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,36,342 మొక్కలు నాటారు. ⇒ పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు మొక్కలు నాటారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని.. మొక్కలు నాటారు. గోళ్లపాడులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితారామచంద్రన్ మొక్కలు నాటారు. నేలకొండపల్లిలో హరితహారంలో మంత్రి తుమ్మల రోడ్ల వెంబడి మొక్కలు నాటారు. కూసుమంచి మండలం కిష్టాపురంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితారామచంద్రన్ హరితహారంలో పాల్గొని.. మొక్కలు నాటారు. తిరుమలాయపాలెంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు విరివిగా మొక్కలు నాటారు. ⇒ కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎంవీ.రవీంద్రనాథ్ మొక్కలు నాటారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో న్యూగొల్లగూడెం వద్ద డీఎస్పీ సురేందర్‌రావు, త్రీటౌన్ సీఐ రాజగోపాల్ మొక్కలు నాటారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్, డీఎఫ్ఓ కార్యాలయంలో డీఎఫ్ఓ శర్వానంద్, రామవరం రేంజి కార్యాలయంలో రేంజర్ జి.మధుసూదన్ మొక్కలు నాటారు. పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ జి.రాజిరెడ్డి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ⇒ కల్లూరు మండలం యర్రబోయినపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం, లింగాల గ్రామం, పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. సత్తుపల్లి మార్కెట్ యార్డు, కిష్టారం పాఠశాలలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జవహర్‌నగర్‌లో నగర పంచాయతీ చైర్పర్సన్ దొడ్డాకుల స్వాతి, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ భల్లా రాజేష్, గంగారం 15వ గిరిజన బెటాలియన్‌లో కమాండెంట్ కె.నాగరాజు, సబ్‌జైలులో సూపరింటెండెంట్ దేవేందర్, అటవీ శాఖ డిపోలో రేంజర్ నాగసాయి ప్రసాద్, ఆర్అండ్బీ కార్యాలయంలో డీఈఈ థానేశ్వర్ మొక్కలు నాటారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కాకర్లపల్లి వృద్ధాశ్రమంలో మొక్కలు నాటారు. ⇒ భద్రాచలం ఐటీడీఏలో పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు, ఎమ్మెల్యే సున్నం రాజయ్య మొక్కలు నాటారు. ఐటీడీఏలో విద్యార్థులు మానవహారం చేపట్టారు. మర్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య మార్కెట్ కార్యదర్శి నామాల శ్రీనివాసరావుతో కలిసి మొక్కలు నాటారు. డీఎఫ్ఓ రాంబాబు అటవీ శాఖ సిబ్బందితో కలిసి కలప డిపో ఆవరణలో మొక్కలు నాటారు. సబ్‌జైలులో జైలు సూపరింటెండెంట్ అశోక్‌కుమార్, జైలు సిబ్బంది, ఖైదీలతో కలిసి మొక్కలు నాటారు. ⇒ బూర్గంపాడు మండలంలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్‌స్టేషన్, సొసైటీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ⇒ మధిర మండలం వంగవీడులో వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి, సబ్‌జైలులో జడ్జి రాజేష్, నగర పంచాయితీ పరిధిలోని 15వ వార్డులో చైర్పర్సన్ మొండితోక నాగరాణి, చింతకాని మండలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ దివ్య మొక్కలు నాటారు. ⇒ ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌లో గురుకులం విద్యార్థినులు, పోలీసులు, డీఎస్పీ ఆర్.వీరేశ్వరరావు, సీఐ నరేందర్, ఎస్సై సతీష్, కొమురెల్లి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. ⇒ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రకాశ్, ఆర్ఐ కృష్ణమూర్తి, వీఆర్వోలు, సిబ్బంది, అటవీ శాఖ డిపో, అటవీ శాఖ కార్యాలయంలో డీఎఫ్ఓ శాంతారాం మొక్కలు నాటారు. ⇒ వైరా డీఎస్పీ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్లో మానవహారం చేపట్టి.. మొక్కలు నాటుతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ వీరేశ్వర్‌రావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి హరితహారంలో మంత్రి తుమ్మల ఖమ్మం జెడ్పీసెంటర్: ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మంత్రి కలెక్టరేట్లో మొక్కలు నాటి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను నాటే బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 3.50 కోట్ల మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి కోదాడ వరకు జాతీయ రహదారి పక్కన ఒకే రోజు ఒక గంటలో 1.50 లక్షల మొక్కలు నాటుతున్నట్లు మంత్రి చెప్పారు. వేసిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. రైతుల అభీష్టం మేరకు వారికి కావాల్సిన మొక్కలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇంటి పరిసరాల్లో వేసుకునేందుకు అవసరమైన మొక్కలు అందించే అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. పండ్ల మొక్కలను సైతం అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, పీఆర్ కమిషనర్ అనితరామచంద్రన్, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం, జేసీ దివ్య,ఏజేసీ శివ శ్రీనివాస్ డీఆర్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ అండ్ బీకి కొత్త ఇంజనీర్లు
♦ 82 మందికి నియామక పత్రాలు అందజేసిన మంత్రి తుమ్మల ♦ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం కొత్త ఇంజనీర్లను కేటాయించింది. వీరిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) స్థాయిలో 82 మంది ఉన్నారు. శనివారం ఆర్అండ్ బీ శాఖ ప్రధాన కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరికి నియామక ఉత్తర్వులు అందజేశారు. 2012 తర్వాత ఈ శాఖకు కొత్త ఇంజనీర్లు రావటం ఇదే తొలిసారి. అప్పటి నుంచి చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేయాల్సిందిగా ఆ శాఖ, సీఎం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి 82 మంది అభ్యర్థులను ఏఈఈ పోస్టులకు ఎంపిక చేశారు. కాగా, వీరందరిని వివిధ జిల్లాలకు కేటాయించారు. ఇక 42 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి మరో పరీక్ష నిర్వహించారు. వాటి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. శనివారం కేటాయించిన పోస్టుల్లో ఎస్సీలు 12 మంది, ఎస్టీలు నలుగురు, బీసీలు 33 మంది, వికలాంగుల కోటాలో ఒకరు, ఓసీలు 27 మంది ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక, నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగాయని ఆ శాఖ పరిపాలన వి భాగం ఈఎన్సీ భిక్షపతి పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన ఇంజనీర్లకు వచ్చేనెల 4 నుంచి 3 నెలల పాటు న్యాక్‌లో శిక్షణ ఇస్తామన్నారు. -
‘గులాబీ’ గాలం
టీఆర్ఎస్ గాలం విసిరింది. ఆపరేషన్ ‘ఆకర్ష్’ మొదలుపెట్టింది. ఈసారి ఖమ్మం కార్పొరేషనే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ‘హస్తం’నేతలను ఆకట్టుకోవడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. అనుకున్నట్టుగానే కొందరు మాజీ కౌన్సిలర్లను గులాబీ గూటికి లాగుతోంది. ‘శీలంశెట్టి’ నుంచి మొదలైన ఈ ప్రస్థానం ఎక్కడి వరకు వెళ్తుందో... మంత్రి తుమ్మల రాజకీయ చాణక్యం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.. - కార్పొరేషన్ దక్కించుకోవడమే లక్ష్యం! - పావులు కదుపుతున్న మంత్రి తుమ్మల - టీఆర్ఎస్ గూటికి మాజీ కౌన్సిలర్లు - పార్టీ తీరుతోనే ఫిరారుుంపులట! సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్‌ను దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. నగరంలో బలహీనంగా ఉన్న టీఆర్ఎస్ బలోపేతం దిశగా ఇతర పార్టీ మాజీ కౌన్సిలర్లను తనవైపు ఆకట్టుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మాజీ కౌన్సిలర్, డీసీసీ ఉపాధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రంను గురువారం గులాబీ గూటికి చేర్చుకుంది. ఆయనతోపాటు మరికొందరు ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు గులాబీ బాట పట్టనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు, ప్రజాప్రతినిధుల విధానాలు నచ్చకనే బయటకు వెళ్తున్నట్లు పార్టీ ఫిరారుుస్తున్న నేతలు చెబుతుండటం చర్చనీయూంశంగా మారింది. త్వరలో జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఉండటంతో ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్, టీడీపీ నేతలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అధికార పార్టీ హోదాలో ఉండి.. పార్టీ పరంగా బలం లేకున్నా ఇతర పార్టీ మాజీ కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకుని ఎన్నికల్లో జెండా ఎగురవేయాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగూడెం మినహా జిల్లాలో ఎక్కడా టీఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది. పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరఫున పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం. పైకి నేతలే పార్టీలో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కేడర్ లేకపోవడంతో అప్పట్లో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరుగుతాయని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బలం లేని ఖమ్మం నగరంలో బలోపేతంపై ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న నేతలు కార్పొరేషన్ బరిలో నిలిచేందుకు సరిపోరన్న ఉద్దేశంతో ఇతర పార్టీ మాజీ కౌన్సిలర్లు, నేతలకు ఎరవేసేందుకు సిద్ధమయ్యూరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ చతికిలపడింది. అధికారంలో ఉండి కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటకపోతే నేతలుగా, ప్రజా ప్రతినిధులుగా ఉన్న తమ ప్రతిష్ట గంగలో కలుస్తుందన్న భావనతో ఆ పార్టీ ఈ తతంగానికి తెరతీసింది. దీని దృష్ట్యానే కాంగ్రెస్ పార్టీ నుంచి పలుమార్లు కౌన్సిలర్లుగా విజయం సాధించి, డీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న శీలంశెట్టి వీరభద్రంను గులాబీ గూటికి చేర్చడంలో సఫలమైంది. ఆయనతోపాటు మాజీ కౌన్సిలర్లు గుంటి మల్లయ్య, గాదె భాస్కర్, బెడదం సత్యనారాయణ, గుంటి అరుణ, నేతలు తేజావత్ శ్రీను, ఆర్. రాము, కుమ్మరి గురుమూర్తి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రాజధానిలోని తెలంగాణ భవన్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్‌ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో నేతల తీరు నచ్చక.. భవిష్యత్‌పై ఆందోళనతోనే సదరు నేతలు కాంగ్రెస్‌ను వీడినట్లు సమాచారం. ఒంటెత్తు పోకడలతో తొలి నుంచి జెండా మోసిన వారికి పదవులు దక్కకుండా ఇటీవల వచ్చిన వారికే పీట వేస్తున్నారన్న ఆగ్రహంతో సదరు నేతలు కాంగ్రెస్‌పార్టీకి దూరమైనట్లు చర్చ జరుగుతోంది. దారికి రాకుంటే నయానో..భయానో.. పదవులు, నజరానాలు ఆశ చూపుతూ మరికొందరు మాజీ కౌన్సిలర్లు, వార్డుల్లో బలంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దారికి రాని వారికి నయానో..భయానో నచ్చచెప్పి తమ దారికి తెచ్చుకునే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి త్వరలో ఖమ్మం నగరంలో పర్యటించనున్నట్టు సంకేతాల నేపథ్యంలో ఆయన సమక్షంలోనే జిల్లాకేంద్రంలో కొంతమంది మాజీ కౌన్సిలర్లను పార్టీలో చేర్చాలన్న దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న నేతలు మాత్రం తమను కాదని ఇప్పటికే ఇటీవల వచ్చిన వారిని భుజానికెత్తుకోవడంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నామినేటెడ్ పదవులు దక్కకున్నా కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా కార్పొరేటర్‌గా బరిలో దిగుదామనుకుంటున్న వారి ఆశలు కొత్త నేతల రాకతో అడియాసలు అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న పాత నేతలంతా కార్పొరేషన్ ఎన్నికల సమయానికి తాడోపేడో తేల్చుకోవడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. ఉద్యమ జెండాను మోయకుండా ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరుతున్న వారికి పదవులు, ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ఉన్నారు. కాంగ్రెస్‌లో కలవరం ఇప్పటి వరకు టీడీపీపై కన్నేసిన టీఆర్ఎస్ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లకు వల వేయడంతో ఆ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. నగరంలో పరిస్థితి చేయి దాటిపోతే కార్పొరేషన్ గోల్ కొట్టడం సాధ్యం కాదని పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఓ వైపు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ కౌన్సిలర్లు, నేతలను గురువారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ డీసీసీ కార్యాలయానికి పిలిపించుకుని వారితో మంతనాలు జరిపారు. పార్టీని వీడవద్దని, రానున్న ఎన్నికల్లో మనదే పై చేయి అవుతుందని వారికి హితబోధ చేశారు. అయితే మరికొందరు కౌన్సిలర్లు, నేతలు కూడా గుట్టుచప్పుడు కాకుండా టీఆర్ఎస్ నేతలతో తెరవెనుక మంతనాలు జరుపుతున్నారన్న సమాచారంతోనే ఎమ్మెల్యేలు ఈ చర్చకు దిగారు. అయినా ఎప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీకి ‘చేయి’ ఇస్తారోనని, కార్పొరేషన్ బరిలో నిలవడం ఎలా అన్న హైరానాలో ఆ పార్టీ నేతలున్నారు. -
ఇసుక తవ్వకాలపై సర్కార్ సీరియస్
వంతెనల వద్ద తవ్వకాలను అరికట్టాలి బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని వంతెనల తనిఖీ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరిలో ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. బాసరలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా నిర్మిస్తున్న స్నానఘట్టాల కోసం నదీగర్భం నుంచే అక్రమంగా ఇసుకను తోడుతున్న తీరును ‘ఇసుక కోసం వంతెనలకు ఎసరు’ శీర్షికతో రెండు రోజుల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. మేజర్ బ్రిడ్జీలకు 500 మీటర్లలోపు ఇసుక తవ్వవద్దనే నిబంధన ఉన్నా బాసరలో వంతెనలకు అతి చేరువలో పొక్లెయిన్‌తో ఇసుకను ఎలా తవ్వుతున్నారని ఆయన ఉన్నతాధికారులను ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇసుక తవ్వేందుకు గనుల శాఖ అనుమతి ఇచ్చి ఉంటే సంబంధిత అధికారులపై చర్యలకు సిఫారసు చేయనున్నట్టు చెప్పారు. అనుమతి లేని ఇసుక తవ్వకాలను నిరోధించడంలో విఫలమైన ఆర్అండ్బీ అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. వంతెనలకు ఏమేరకు ప్రమాదం పొంచి ఉందో పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ నాణ్యత నియంత్రణ విభాగం ఈఎన్సీ బిక్షపతిని ఆదేశించారు. భద్రాచలం వరకు అన్ని వంతెనలను పరిశీలించి ఎక్కడెక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయో తేల్చాలని ఆదేశించారు. అన్ని వంతెనల వద్ద తవ్వకాల వల్ల జరిగే అనర్థాలను వివరించే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్లు, వంతెనల పనుల వివరాలు ఫేస్బుక్లో... తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్లు, వంతెనల నిర్మాణ వివరాలను ఎప్పటికప్పుడు ఫొటోల రూపంలో వెబ్సైట్, ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. పనులకు పూర్వం, పనుల సమయంలో, పనుల తర్వాత.. ఇలా ఎప్పటికప్పుడు ఫొటోలను అప్లోడ్ చేయాలన్నారు. మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిని హరితహారంగా మార్చాలని సూచించారు.