కృష్ణ కృష్ణ.. ఎక్కడి పనులక్కడే..
- మరో పక్షం రోజుల్లో పుష్కరాలు
- పలు పనులకు టెండర్లు పిలవని వైనం
- సమీక్షించిన మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్ : మరో పక్షం రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండగా, ఇప్పటికీ ప్రధాన పనులు పూర్తికాకపోగా కొన్నింటికి కనీసం టెండర్లు కూడా పిలవలేకపోయారు. ఫలితంగా కృష్ణా పుష్కరాలు మొదలై భక్తులు పుణ్యస్నానాలకు వస్తున్నా పనులు మాత్రం కొనసాగేలా కనిపిస్తున్నాయి. మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్లక్ష్యం తేటతెల్లమైంది.
అన్నీ అసంపూర్తిగానే..
నల్లగొండ జిల్లాలో కృష్ణా పుష్కరాల కోసం ఇప్పటికి కేవలం 36 కోట్లతో 17 రోడ్లను మాత్రమే పూర్తి చేశారు. మిగతా పనులను పరుగుపెట్టించినా పుష్కరాలు మొదలయ్యే నాటికి పూర్తి అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో మంత్రి తుమ్మల అధికారులకు ఆగస్టు 8 గడువు విధించారు. 9 అతిథి గృహాలను ఆగస్టు 8లోగా నిర్మించాలని, 17 పార్కింగ్ స్థలాలను పదో తేదీనాటికి సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.
ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో 16 రోడ్డు పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వచ్చేనెల ఐదో తేదీకి పూర్తి చేస్తామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. 15 అతిథి గృహాల మరమ్మతులు చేయాల్సి ఉండగా రెండే పూర్తయ్యాయి. మిగతావి వచ్చేనెల పది నాటికి పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. 30 ప్రాంతాల్లో పార్కింగ్ పనులకు టెండర్లు మాత్రమే పిలిచారు. మరో రెండుమూడు రోజుల తర్వాతగాని పనులు ప్రారంభమయ్యేలా లేవు. వాటిని కూడా పదో తేదీ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. పనుల తీరు గుర్తించిన మంత్రి రెండు జిల్లాలకు ఇద్దరు ఈఎన్‌సీలను అటాచ్ చేశారు. వీలైనంత తొందరలో పనులు పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.