
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కరీంనగర్‌లో జరగనుంది. దేశంలో ఇది మూడో బ్రిడ్జిగా ప్రసిద్ధిచెందనుంది. మానేరు నదిపై అత్యాధునిక టెక్నాలజీతో రూ.149 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కేబుల్ బ్రిడ్జి పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శనివారం ప్రారంభించనున్నారు. నిర్మాణ పనులను టాటా కన్సల్టెన్సీ, థాయ్‌లాండ్‌కు చెందిన గులేర్‌మాక్ సంస్థతో కలిసి చేపట్టనుంది.
పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ కేబుల్ బ్రిడ్జి కరీంనగర్‌కు మణిహారంలా మారనుంది. గత అక్టోబర్‌లో బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చి, నిధులు విడుదల చేసింది. 21.5 మీటర్ల వెడల్పు, 520 మీటర్ల పొడవు, 16 మీటర్ల ఎత్తుతో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. కేబుల్‌కు సపోర్టు ఇచ్చేందుకు 45 మీటర్ల ఎత్తులో రెండు టవర్లు ఏర్పాటు చేయనున్నారు. 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ నిర్మాణం చేపట్టనున్నారు.
మరోవైపు రూ.34 కోట్లతో కమాన్ నుంచి సదాశివపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులకూ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో మంత్రులు మాట్లాడనున్నారు. రోడ్డు, బ్రిడ్జి పనులు పూర్తయితే కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లేందుకు సుమారు 7 కి.మీ. దూరం తగ్గనుంది. ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామని ఇటీవలి పర్యటనలో ప్రకటించిన సీఎం కేసీఆర్.. మానేరు రివర్‌ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, ఐటీ టవర్లను మంజూరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment