ఎమ్మార్పీఎస్ నాయకులతో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. సూర్యాపేటలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై సంఘం నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం రెండు గంటలుగా రాస్తారోకో చేపట్టారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. అదే సమయంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.
పోలీసులు ఆయనను పంపించే ప్రయత్నం చేయగా.. కాన్వాయ్ ఎదుట ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పడుకున్నారు. దీంతో మంత్రి కారు దిగి నాయకులతో మాట్లాడుతుండగా.. కొందరు కార్యకర్తలు రాళ్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తుమ్మలను కాన్వాయ్‌లోకి ఎక్కించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను చెదరగొడుతుండగా.. కాన్వాయ్‌పై వారు మళ్లీ రాళ్లు విసిరారు. ఈ దాడిలో పైలెట్ వాహనానికి రాళ్లు తగలడంతో ముందుభాగంలో స్వల్పంగా అద్దం పగిలింది. విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రకాష్‌జాదవ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment